విజయ ‘శాంతి’పై కే.సి.ఆర్. గరం గరం
posted on Aug 8, 2012 8:05AM
ఎంపి, సినీనటి విజయశాంతిని టిఆర్‌ఎస్ ఓ కరివేపాకులా తీసిపారేస్తుంది. ప్రత్యేకించి టిఆర్‌ఎస్ అధినేత కేసిఆర్ ఆమెను అస్సలు లెక్క చేయటం లేదు. పైపెచ్చు ఇంతకు ముందులా పార్టీ కార్యక్రమాలు ఆమెకు తెలియజేసేందుకూ కేసిఆర్ ఇష్టపడటం లేదని సమాచారం. తెలంగాణా జెఎసి ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్‌తో గతంలో విబేధించిన కేసిఆర్ ఇప్పుడు ఆయనకు కనీస గౌరవమైనా ఇస్తున్నారు. అయితే ఆ గౌరవమూ విజయశాంతికి లేకుండా పోయిందని ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా తెలంగాణా ఉద్యమనేత జయశంకర్ వర్ధంతి కార్యక్రమానికి కేసిఆర్ అథ్యక్షత వహించి అందరినీ మాట్లాడనిచ్చి విజయశాంతికి మాత్రం అవకాశం ఇవ్వలేదు. వేదికపై ఆయనకు దగ్గరగానే ఉన్నా ఆమెను మాట్లాడమనకపోవటం వీరిద్దరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయనటానికి సంకేతంగా భావిస్తున్నారు. ఇటీవల కొన్నాళ్లు కేసిఆర్ అజ్ఞాతవాసం చేసినప్పుడు అడగకుండానే విజయశాంతి టిఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి వైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్‌విజయమ్మ సిరిసిల్ల యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. యమాస్పీడుగా ఆందోళనలు నిర్వహించే విజయశాంతికి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవటం చూస్తే ఆమెపై కేసిఆర్ గంరంగరంగా ఉన్నాడని భావించాల్సి వస్తోందని టిఆర్‌ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. ఇది ఎప్పుడైనా బయటపడవచ్చని వారు భావిస్తున్నారు. విజయశాంతి స్పీడుగా ఉన్నప్పుడు ఎవరినీ లెక్కచేయరని, ఆ స్పీడులో కేసిఆర్‌ను నిలదీసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని టిఆర్‌ఎస్ నాయకులు అంటున్నారు. ఏమో మొత్తానికి విజయశాంతికి సొంతగూటిలో అశాంతి తప్పలేదు.