కొడుమూరు కొండలరాయునికి తేళ్ల నైవేద్యం!
posted on Aug 7, 2012 @ 12:35PM
వింత ఆచారాలకు నెలవు ఆంథ్రప్రదేశ్ అన్న మాటను కర్నూలు జిల్లా కొడుమూరు వాసులు నిజం చేస్తున్నారు. కొడుమూరు కొండపై కొండలరాయుడు వెలిశాడు. ప్రతీ ఏడాది శ్రావణమాసం మూడో సోమవారం నాడు ఆయనకు తేళ్ల నైవేద్యం పెట్టి మొక్కులు చెల్లించు కుంటారు. ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. బంధువులను పిలిచి వారి సాయంతో ఈ కొండలరాయుడుని కొలుస్తారు. ప్రతీ ఇళ్లూ బంధువులతో నిండిపోతుంది.
వచ్చిన వాళ్లు కూడా కొండలరాయుడుకు ఇష్టమైన తేళ్లు పట్టడంలో సహకరిస్తారు. ఈ ఉత్సవం కోసమే తేళ్లు పట్టుకునే పనిని కొందరు చేపట్టారు. డబ్బు పోసి మరీ తేళ్లు కొని తమ మొక్కులతో పాటు వాటిని కొండలరాయుడుకు నివేదిస్తారు. పట్టుకున్న తేళ్లను జాగ్రత్తగా తీసుకురావటం కొడుమూరు గ్రామస్తులకే కాదు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కూడా అలవాటు చేసుకున్నారు. అందుకే కర్నూలు జిల్లాలో కొడుమూరు పేరు వినిపించగానే కొండలరాయుడు ఉత్సవం గుర్తు చేసుకుంటారు. భారీ సంఖ్యలో బంధువులతో కలిసి కొండలరాయుడును దర్శించు కుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. అంతేకాకుండా తమకు అవసరమైన సంపాదనకు కూడా కొండలరాయుడు దారి చూపుతాడని ఎక్కువ మంది పేదలు ఈ ఉత్సవానికి హాజరవుతుంటారు. వీరంతా ఖచ్చితంగా నైవేద్యాన్ని అంటే తేళ్లను తీసుకునే వస్తారు. విషజంతువుల బారి నుంచి కొండలరాయుడు కాపాడుతాడని భక్తులు అంటున్నారు.