కేసిఆర్‌ను సైకోగా తేల్చేసిన సోమిరెడ్డి
posted on Aug 8, 2012 8:56AM
టిఆర్‌ఎస్ అథినేత కేసిఆర్ ఒక సైకో అని తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తేల్చేశారు. ఇప్పటి వరకూ ఒకరిని విమర్శించటానికి ప్రాధాన్యత ఇవ్వని సోమిరెడ్డికి తెలుగుతల్లి గురించి చంద్రశేఖరరావు చేసిన వ్యాఖ్యలు ఒళ్లు మండేలా చేశాయి. తెలుగుతల్లిని దెయ్యం అన్న కేసిఆర్ తోటి తెలుగువారిని గౌరవించటం నేర్చుకోవాలని సోమిరెడ్డి కోరారు. పిచ్చి ముదిరినట్లు తనకు తెలియని చరిత్ర గురించి కేసిఆర్ మాట్లాడారని, అది ఆంధ్రులను రెచ్చగొట్టడంలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నోరు ఉంది కదా అని పారేసుకునే బదులు ఒక్కసారి కేసిఆర్ గతాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కేసిఆర్ తెలుగుతల్లి పాటను ఆలకించి పులకరించారని సోమిరెడ్డి గుర్తు చేశారు. తాను ఎలా అర్థం చేసుకున్న కేసిఆర్‌లో సైకో లక్షణాలే ఎక్కువ కనిపిస్తున్నాయని విశదీకరించారు. ఈ లక్షణాలు ఉండటం వల్లే ఆయన్ని వదిలేసుకోవటానికి తెలంగాణా జెఎసి కూడా సిద్ధమవుతోందని అభిప్రాయపడ్డారు. సగటు భారతీయులను ధూషించటం ఎంత మాత్రం బాగోలేదని సోమిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా సాహిత్యం గురించి పూర్తిగా పరిచయం లేని కేసిఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం బాగోలేదని పలువురు సాహితీవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నన్నయ్యను విమర్శించేంత పాండిత్యం లేని కేసిఆర్ ఖబడ్దార్ అని వారు హెచ్చరిస్తున్నారు.