జగన్‌కు ఈ నెలాఖరు లోగా బెయిల్?
posted on Aug 8, 2012 8:54AM
మూడు నెలల పాటు సిబిఐ విచారణను ఎదుర్కొన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డికి ఈ నెలలో సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చే అవకాశాలున్నాయని సమాచారం. ఎందుకంటే ఇప్పుడేమీ ఎన్నికలు లేవు. పైగా కేంద్రంలో కాంగ్రెస్‌కే మద్దతు ఇస్తానని జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నందున ఈ బెయిల్ మంజూరయ్యే అవకాశాలున్నాయని రాజకీయపండితులు అంటున్నారు. హైకోర్టు జగన్ బెయిల్ పిటీషన్ నిరాకరించినందుకు సుప్రీంకోర్టులో దాన్ని సవాల్ చేస్తూ పిటీషను వేశారు. ఈ పిటీషనుపై విచారణ ఈ నెల 9న సుప్రీంకోర్టు చేపట్టింది. అయితే సిబిఐ చెప్పినట్లు సాక్ష్యులను తారుమారు చేసే అవకాశం జగన్‌కు లేదనటానికి మూడునెలల పాటు చంచల్‌గూడా జైలులో శిక్ష అనుభవించటమే నిదర్శనంగా చూపనున్నారు.
ఈ గ్రౌండ్‌పైనే కేసును ముందుకు నడిపితే మాత్రం సుప్రీం కోర్టు మూడునెలల పాటు నేరం రుజువుకాకుండానే శిక్ష అనుభవించినందుకు జగన్‌కు బెయిల్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ అని న్యాయనిపుణులు అంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పు తమకు అనుకూలంగా ఉంటుందన్న నమ్మకంతో జగన్ తల్లి, వైకాపా గౌరవాథ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి రాజమండ్రిలో కార్యకర్తలకు జగన్ వచ్చి కలుస్తాడని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటిదాకా అందరూ ఊహించని విధంగా జైలులో గడిపిన జగన్ బయటకు వచ్చాక తిరిగి ప్రజల్లోకి వెళతారంటున్నారు. తనకు జరిగిన అన్యాయం గురించి సానుభూతిపరుల ద్వారా ప్రజలకు తెలియజేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయఢంకా మోగించాలని జగన్ భావిస్తున్నారని ప్రచారం ప్రారంభమైంది. అంటే జగన్ బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువనేది మరోసారి గుర్తుచేసుకోక తప్పదు.