ఇడ్లీ నూకగా మారుతున్న రూపాయి బియ్యం
posted on Aug 16, 2012 @ 10:21AM
రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకం చేపట్టిన కిలో రూపాయి బియ్యం పేదలకు చేరటం లేదు. ఈ బియ్యాన్ని ఉప్పుడుబియ్యంగా మార్చి కొందరు ఇడ్లీనూకకు ఉపయోగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతీనెలా కోటాలో తీసుకోకుండా మిగిలిపోయిన బియ్యం అంతా ఈ ఇడ్లీనూక తయారు చేసే పరిశ్రమలకు తరలిస్తున్నారు. కోటాకు రాని వారి పేరిట మిగిల్చేసిన బియ్యం అంతా దుకాణదారులు కిలో పదిరూపాయలకు ఇడ్లీనూక పరిశ్రమలకు అమ్ముతున్నారు. నూకగా పట్టిన తరువాత దాన్ని రూ.30 నుంచి ఆ పరిశ్రమయాజమాన్యం అమ్ముకుంటోంది.
భారీస్థాయిలో బియ్యం ఈ పరిశ్రమలకు తరలుతోందని ఆరోపణలు వస్తున్నా రెవెన్యూశాఖ ఎటువంటి దాడులు నిర్వహించటం లేదు. ఎందుకంటే వారికి రావాల్సిన ఆమ్యామ్యాలు అందేస్తున్నాయని ఆరోపణలు ఎక్కువయ్యాయి. తాజాగా కృష్ణాజిల్లా గంపలగూడెం నుంచి తరలిస్తున్న లారీలో 220 బస్తాల చౌకబియ్యాన్ని విజయవాడ విజిలెన్స్ అథికారులు పట్టుకున్నారు. లారీని సీజ్ చేసి సంబంధిత యజమానులపై కేసు నమోదు చేశామని విజిలెన్స్ అథికారులు స్పష్టం చేశారు. దీనికి ముందుగా గుంటూరు జిల్లాలోనూ 550బస్తాల చౌకబియ్యం, తూర్పుగోదావరి జిల్లాలో 127బస్తాల చౌకబియ్యం దొరికాయని విజిలెన్స్ అథికారులు ధృవీకరించారు.
ప్రభుత్వం ఈ పథకం పెట్టినప్పటి నుంచి చౌకధరల దుకాణదారుల జీవితాలే మారిపోయాయంటున్నారు. ఈ బియ్యం కోసమే ఎదురుచూసే పరిశ్రమలు చౌకథరల దుకాణదారులకు సరుకు చేరవేయగానే సంతృప్తికరంగా పేమెంటు చేస్తోంది అందుకే దుకాణదారులు కార్డుదారులన ఒప్పించి మరీ ఈ బియ్యం సేకరిస్తున్నారట. చివరికి ముఖ్యమంత్రి ఈ పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇబ్బందుల పాలవుతూనే ఉన్నారు. ఈ పథకం క్యాన్సిల్ చేస్తే కాంగ్రెస్ మాట తప్పిందంటారని సిఎం ఈ పథకానికి ప్రాధాన్యత కల్పిస్తూనే ఉన్నారు.