వన్యప్రాణుల కోసం హత్యలకు తెగబడుతున్న వేటగాళ్లు?
posted on Aug 16, 2012 @ 9:56AM
వన్యప్రాణుల సంరక్షణ అన్నది కాగితాలపైన రాసుకోవటానికే అన్నట్లుంది మన రాష్ట్రంలోని అడవుల పరిస్థితి. వేటగాళ్ల బారి నుంచి ఈ వన్యప్రాణులను కాపాడటం నానాటికీ కష్టమవుతోంది. విలాసవంతమైన జీవితం గడిపేవారు ఈ వన్యప్రాణుల కోసం లక్షలాది రూపాయల వరకూ వెచ్చించటానికైనా సిద్ధమంటున్నారు. దీంతో వేటగాళ్లు తమ కుటుంబపోషణ కోసం కక్కుర్తిపడుతున్నారు. వేటగాళ్లకు, వన్యప్రాణుల కొనుగోలుదారులకు మధ్య దళారీవ్యవస్థ కూడా పుట్టుకొచ్చిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ దళారులు వన్యప్రాణులను తెచ్చిస్తే ఎంత డబ్బు ముడుతుందో చెబుతూ వేటగాళ్లను రెచ్చగొడుతున్నారు. వీరు కూడా రెచ్చిపోయి తాము వన్యప్రాణులను వేటాడటానికి వెళ్లేటప్పుడు ఎవరైనా అడ్డుపడితే హత్య చేయటానికి కూడా వెనుకాడటం లేదు.
చిత్తూరు జిల్లా కెవీపల్లి మండలం మారెళ్ల అటవీప్రాంతంలో పోలీసులు, వేటగాళ్ల మథ్య కాల్పులు జరిగాయి. అడవిలో వేటగాళ్లను గుర్తించి పోలీసులు వెంబడిరచారు. దీంతో ఆగ్రహించిన వేటగాళ్లు పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. ప్రతిగా పోలీసులు కూడా నాలుగురౌండ్ల కాల్పులు జరిపారు. మొత్తానికి ఒకవేటగాడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విషయం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే నలుగురు వేటగాళ్లు పరారయ్యారు. అడవిలో పోలీసులను ఎదిరించి కాల్పులు జరిపేందుకు వేటగాళ్లు పూనుకోవటం అరుదైన సంఘటన. పోలీసులను చూస్తేనే భయంతో పారిపోయే వేటగాళ్లు ఎదురుకాల్పులకు తెగబడటం వెనుక నిషేథిత ప్రాణుల వేటకోసం వెడుతున్న వేటగాళ్లను అడ్డుకోవటమే కారణమై ఉండవచ్చని పలువురు అనుమానిస్తున్నారు.