జాతీయ పండుగలనగా నేమి?
posted on Aug 16, 2012 9:21AM
జాతీయ పండుగలంటే ‘స్వాతంత్య్రదినం, గణతంత్రదినం, గాంధీజయంతి...’ తదితరాలు చెప్పేస్తారు. అయితే 65 ఏళ్ళ ప్రజాస్వామ్యదేశంలో ప్రకటనలకే తప్ప ఆయా పండుగలను జాతీయ పండుగలుగా గుర్తిస్తూ నేటివరకూ అధికారిక ఉత్తర్వులు రాలేదంటే మన పాలకుల నిర్లక్ష్యానికి, అలక్ష్యానికి అద్దంపడుతోంది. పైన తెలిపినట్లు ఏ ఉత్తర్వుల ప్రకారం ఆగస్టు 15, జనవరి 26, అక్టోబర్ 2లను జాతీయపండుగలుగా ప్రకటిస్తున్నారు అని ఆ ఉత్తర్వుల నకలును పంపించండి’ అంటూ సమాచార హక్కుచట్టం పరిధిలో పదేళ్ళ ఓ బాలిక కోరగా, అలాంటి ఉత్తర్వులు ఏదీ జారీ కాలేదని తెలుపగా, తిరిగి ఆ మూడు రోజులను జాతీయపండుగదినాలుగా ప్రకటించినట్లు పాఠ్యపుస్తకాలలో ఉంది కనుక పంపించండి’ అని మళ్ళీ అప్పీలు చేసుకుంటే సంబంధిత సిబ్బంది, శిక్షణ శాఖలోని ఆర్కైవ్స్ విభాగం సిబ్బంది పైళ్ళన్నిటిని వెతికి వెతికి అసలు అలాంటి ఉత్తర్వు ఏదీ లేదని తేల్చి చెప్పారు. దాంతో ఆ బాలిక రాష్ట్రపతికి, ప్రధానికి వినతి పత్రం సమర్పించింది.
ఈ సంఘటనను బట్టి చూస్తే పాలకుల పనితీరు, అధికారుల అలసత్వం తెలుస్తోంది. ఇదంతా చూస్తుంటే నాయకులు ఎన్నిక కావడానికి తప్పనిసరైన ఎన్నికల నోటీఫికేషన్ తప్ప ఏదీ సక్రమంగా అమలుకావని అర్ధం చేసుకోవచ్చు. ప్రజలకు అద్దంలో చందమామను చూపించే ప్రయత్నాలే తప్ప అసలు ‘విషయం’ ఏదీ వుండదని, మనదేశంలో జాతిపితగా పిలుచుకునే గాంధీగారికి జాతిపిత పేరు ఎప్పుడు వచ్చింది? ఎవరిచ్చారు? ఏ సందర్భంలో ఆయన్ను ఈవిధంగా సంబోధించారంటూ ఓ తొమ్మిదో తరగతి అమ్మాయి ఇటీవల అడిగిన ప్రశ్నకు కూడా ప్రధానమంత్రి కార్యాలయం సమాధానం చెప్పలేకపోయింది మరి! జాతీయ పండుగలో లెక్కా!