ప్రభుత్వానికి సవాల్ విసురుతున్న మాఫియా?
posted on Aug 16, 2012 @ 10:34AM
కోర్టు తీర్పులు, ప్రభుత్వ నిర్ణయాల అనంతరమూ ఇసుక వ్యవహారం ఇంకా ఒక కొలిక్కిరాలేదు. ప్రతీజిల్లాలోనూ డిపోలను నిర్వహించైనా ఇసుకను ప్రభుత్వమే సరఫరా చేస్తుందని ఇచ్చిన భరోసా కాలగర్భంలో కలిసిపోయింది. అటు కాంట్రాక్టర్లు, ఇటు ప్రభుత్వమూ కాకుండా ఇసుకతవ్వకాలపై మాఫియా పెత్తనం చేస్తోంది. బండెడు ఇసుకను వేలకు విక్రయించే స్థితికి మాఫియా చేరుకుంది. తమ ప్రైవేటు సేనలను రంగంలోకి దింపిన మాఫియా ఇదేమిటని ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడుతోంది. ప్రత్యేకించి వాహనాలను ఆపేందుకు విజిలెన్స్, రెవెన్యూశాఖలు ప్రయత్నిస్తే వారిపై నుంచి నడిపేయమని సినీతరహాలో డ్రైవర్లకు ఆదేశాలిచ్చిందట. దీంతో డ్రైవర్లు రెచ్చిపోయి ఆగినట్లే ఆగి విజిలెన్స్‌శాఖాథికారులపైకి వాహనాలు నడిపి వారిని భయభ్రాంతులను చేసి తప్పించుకుంటున్నారు.
ఈ విషయం బయటికి తెలిస్తే తమను ఇంకెవరూ ఖాతరు చేయరని విజిలెన్స్ అథికారులు కూడా నోరునొక్కుకుంటున్నారు. హైదరాబాద్, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలు, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, కరీంనగర్, కర్నూలు తదితర ప్రాంతాల్లో మాఫియా ఇసుక సామ్రాజ్యాన్ని నెలకొల్పిందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం సీతంపేట వద్ద అక్రమంగా తరలిస్తున్న ఇసుకను అడ్డుకున్నందుకు వీఆర్వో వాసుపై ఇసుకమాఫియా దాడి చేసింది. దాడిలో గాయపడిన వాసు పోలీసులను ఆశ్రయించారు. ఇలా ప్రతీప్రాంతంలోనూ మాఫియా ఎదురుతిరుగుతుంటే రెవెన్యూ, ఇతర ప్రభుత్వశాఖలు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నాయి. ముదిరిన ఈ వ్యవహారంపై ఇకనైనా ప్రభుత్వం సీరియస్‌గా స్పందించకపోతే విధులు నిర్వహించటమే కష్టమవుతుందని ఉద్యోగసంఘాలు రాష్ట్రప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి.