కిరణ్‌కు ధర్మ సంకటం!
posted on Aug 17, 2012 8:25AM
సీనియర్ మంత్రి ధర్మాన రాజీనామా రాష్ట్రంలో సంచలనం రేపింది. వాన్‌పిక్ కుంభకోణం వ్యవహారంలో సీబిఐ చార్జ్‌షీట్‌లో ఐదవ నిందితుడిగా ఉన్న దర్మాన నైతిక విలువలకు కట్టుబడి తాను మంత్రి పదవికి రాజీనామా చేశానని చెప్పారు. అయితే ముఖ్యమంత్రి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఏర్పడిరది. రాజీనామా ఆమోదించనందువల్ల ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. న్యాయనిపుణుల సలహా తీసుకొని నిర్ణయం తీసుకుంటాననడం మరిన్ని ఆరోపణలకు తావిస్తుంది. ధర్మానను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతించాలని సిబిఐ ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరింది. సీబిఐ నిర్ణయం మీదా, రాజీనామా విషయమూ రెండూ గవర్నర్‌తో కిరణ్‌కుమార్ రెడ్డి సంప్రదించవలసిందే. ఒక సారి కోర్టునుండి చార్జిషీటు దాఖలైతే మంత్రులు రాజీనామా చేయాల్సివుంది.
2జి స్పెక్ట్రమ్ విషయంలో కేంద్రమంత్రి రాజా రాజీనామాను ప్రధాన మంత్రి మన్మోహన్ ఆమోదించారు. అదే సంప్రదాయాన్ని కిరణ్‌కుమార్ రెడ్డి కూడా అమలు చేయవలసి ఉంది. అయితే ధర్మాన రాజీనామా అంగీకరిస్తే మిగతా మంత్రుల విషయంలో కూడా అదే పద్దతి కొనసాగించవలసి ఉంది. రాజశేఖర రెడ్డి హయాంలో 26 జివోల కోసం ఇప్పటికే ఆరుగురు మంత్రులు సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్నారు. ఇదే కేసులో మోపిదేవి వెంకటరమణ జైలులో ఉన్నారు. మంత్రి పొన్నాల సిబిఐ విచారణ నెదుర్కుంటున్నారు. వీరితో పాటు గాలి జనార్థన్‌రెడ్డి బెయిల్‌కేసులో న్యాయశాఖమంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి, ఫెరా కేసులో విద్యామంత్రి పార్ధసారధి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ధర్మాన రాజీనామా ఆమోదిస్తే మిగతా మంత్రుల విషయంలోనూ అదే న్యాయాన్ని అనుసరించాల్సి ఉంది. ఏది ఏమైనా ధర్మాన రాజీనామా ఆమోదిస్తే ఒక బాధ ... ఆమోదించకపోతే మరో బాధ.. ముఖ్యమంత్రిని కలవరపెడుతుంది.