నల్లధనానికి చట్టాలు చుట్టాలా?
posted on Aug 16, 2012 9:28AM
నల్లధనంపై ఉక్కుపాదం మోపాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) అనుకుంటోంది. ఎంత బ్లాక్ మనీ ఉంటే అంత గొప్ప వ్యక్తులుగా కొనియాడబడుతున్న నేటి ప్రపంచంలో నల్లదనం వెలికితీతకు కొత్తచట్టాలు రావడంతో పాటు ప్రస్తుతం ఉన్న చట్టాలు బలోపేతం కావాలని, అంతేకాకుండా అధికారం నుండి వైదొలగే సమయంలో ఆస్తుల ప్రకటన తప్పనిసరిచేయాలనీ, వీటితో పాటు పన్ను చట్టాలు ఉల్లంఘించిన వారికి భారీ పెనాల్టీలు విధించడం వంటి పలు అంశాలను సిబిడిటి పరిశీలిస్తోంది. ఏవైనా చట్టాలు అమలు చేయాలంటే ఆ చట్టాలు ప్రజలకోసమే కాని రాజకీయనాయకులు, మంత్రులకు కాదనీ, నల్లధనాన్ని కూడబెట్టే పెద్దలు ఆ చట్టానికి అతీతులన్నది నేడు జరుగుతున్న కుంభకోణాల తీరు చూస్తే తెలుస్తోంది.
నల్లధనాన్ని తెల్లధనంగా మార్చే ప్రయత్నంలో తొలి అడుగే రాజకీయం అన్నది నేటి మాటగా వినిపిస్తోంది. భవిష్యత్‌లో క్రిందిస్థాయి నుండి పాలకుల వరకు వారి వారి హోదాలను బట్టి నల్లధనం సంపాదించుకోవచ్చునంటూ ఓ చట్టం తెచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు. విదేశాల్లో దాచిపెట్టిన నల్లధనాన్ని జాతీయ సంపదగా ప్రకటించాలన్న డిమాండ్ వల్ల దేశానికి పెద్దగా ప్రయోజనం ఉండదని అధికారం ప్రతిపక్షవర్గాలే చెప్పడం విడ్డూరమే! కాబట్టి నల్లధన కుబేరులు మనసులో ‘ఆనందమానంద మాయే, మది ఆశలనందనమాయే’ అంటూ పాడుకుంటున్నారు.
ప్రజాస్వామ్య దేశంలో చట్టాలు ప్రజలకే కాని దాని పరిధిలోకి పాలకులు, పెద్దలు రారని ఇప్పటికే ప్రజలకు అర్ధమైపోయింది. పన్నుపోట్లు, ధరల గాట్లు, సామాన్యులను దరిద్రానికి దగ్గరచేస్తుంటే, పన్ను ఎగవేతలు, నల్లధనం దాచివేతలు పాలకులను, పెద్దలను ప్రపంచ కుబేరులను చేస్తాయన్నది ఇప్పటినిజం! రేపటిసత్యం! అవినీతికి కళ్ళాలు వెయ్యాలంటే అందుకు ఖచ్చితంగా ఏదైనా అద్భుతం జరిగి తీరాల్సిందే?