బాబు కిరణ్ పోటాపోటి డిక్లరేషన్లు
posted on Aug 16, 2012 @ 9:42AM
బీసి డిక్లరేషన్, ముస్లిండిక్లరేషన్, తాజాగా వర్గీకరణ ఇవ్వాలనే డిమాండులతో తెలుగుదేశం పార్టీ అథినేత చంద్రబాబు నాయుడు రాజకీయ తెరపై తెగహడావుడి చేసేస్తున్నారు. తమలా దమ్ముంటే డిక్లరేషను ప్రకటించమని సిఎంకు ఆయన సవాల్ కూడా విసిరారు. కులాలవారీగా సమీకరణల ఆథారంగా బాబు ఈ డిక్లరేషను ప్రకటిస్తే సిఎం ఇంకో రెండాకులు ఎక్కువ చదివి గిరిజన డిక్లరేషన్ ప్రకటించారు. ఎంత పెద్ద సమస్య ఎదురైనా పెద్దగా హడావుడి కనపడనీయని సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తాజాగా ప్రకటించిన ఈ డిక్లరేషను యావత్తుదేశంలోనే పెద్దసంచలనం.
ఎందుకంటే అభివృద్థికి నోచుకోని గిరిజన ప్రాంతాలు నక్సల్ అడ్డాలుగా మారిపోయాయి. మావోయిస్టులకు గిరిపుత్రుల సహకారం ఎక్కువ. అటువంటిది ఆ గిరిజనప్రాంతాలే అభివృద్థి చెందితే గిరిపుత్రుల జీవితాల్లో పెనుమార్పులు ఖాయం. అంతేకాకుండా ఈ డిక్లరేషను వల్ల యావత్తు రాష్ట్రం అంతా ఒక్కసారిగా తమ ఏజెన్సీ ప్రాంతాలపై ఏకాగ్రతతో కూడిన దృష్టిపెట్టకతప్పదు. ఎందుకంటే గిరిజనులకు మౌళికసదుపాయాలు కల్పించాల్సింది మైదానప్రాంతాల వారే కాబట్టి. మొత్తం రాష్ట్రంలోని అన్ని జిల్లాల యంత్రాంగాలు ఇటువైపు దృష్టిసారిస్తే ఖచ్చితంగా దాని ఫలితాలు ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీకి అనుకూలమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పైగా గిరిజనులు ఎవరినైతే నమ్ముతారో వారిని చివరి వరకూ అంటే జీవితాంతం మోసేస్తారు.
గతంలో ఎన్టీఆర్ తరహాలో ఏజెన్సీలో బస చేసిన కిరణ్ ఇప్పుడు ఆయన తరహాలోనే సాహసవంతమైన డిక్లరేషను ప్రకటించారని మేథావులు సైతం అభిప్రాయపడుతున్నారు. మైదానానికి దూరంగా బతుకుతున్న గిరిజనుల అభివృద్థికి 8 ఐటిడిఎ పరిథుల్లో 22 స్కిల్‌సెంటర్లు ఏర్పాటు చేస్తామని సిఎం కిరణ్ ప్రకటించారు. సెంటరుకు మూడు కోట్ల రూపాయలు కేటాయిస్తామన్నారు. ఐటిడిఎల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తామని భరోసా ఇచ్చారు. మౌళికవసతులకు రూ.600కోట్లు కేటాయిస్తామన్నారు. గిరిజనపాఠశాలలు అన్నింటికీ ఒకడాక్టరు, సిబ్బంది, మెడికల్‌కిట్లు, 104 సదుపాయం కూడా కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో దళారులు, వడ్డీ వ్యాపారుల బారి నుంచి గిరిజనులను రక్షించేందుకు పెద్దఎత్తున బ్యాంకుశాఖలు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరుతానని సిఎం ప్రకటించారు. సిఎం గిరిజన డిక్లరేషను ప్రకటించి దానికి తగ్గట్లుగా ప్రణాళిక రూపొందిస్తున్నందుకు పలు ప్రాంతాల గిరిజనులు ఆయన్ని క్యాంపుకార్యాలయంలో కలిసి అభినందించారు. ఏమైనా ఇంత భారీస్థాయిలో గిరిజనడిక్లరేషను కనుక అమలు చేస్తే తెలుగుదేశం పార్టీయే కాదు ఇతర పార్టీలు కూడా ఏజెన్సీలో కాలుమోపటానికి ఇబ్బంది పడక తప్పదని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.