తీవ్రమవుతున్న థర్మల్‌పవర్‌ప్లాంటు వ్యతిరేక ఉద్యమం?
posted on Aug 16, 2012 @ 9:34AM
ఇచ్ఛాపురం ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ అరెస్టుతో శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలో బీలలో ధర్మల్ ప్లాంట్ వ్యతిరేక ఉద్యమం తీవ్రతరమవుతోంది. ప్రభుత్వం అనుమతి ఇచ్చినా పర్యావరణానికి థర్మల్ విద్యుత్తు ప్లాంటు ముప్పు తెస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడ మూడేళ్ల నుంచి రిలేనిరాహారదీక్షలు చేపట్టారు. మూడేళ్లు పూర్తయ్యే సమయంలోనే ఎమ్మెల్యే అరెస్టు కూడా జరగటంతో నిరసనకారులతో తెలుగుదేశం నేతలు జతకట్టారు. సామూహికంగా ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించాలని నిశ్చయించుకున్నారు.
పర్యావరణపరిరక్షణసమితి, మత్స్యకార ఐక్యవేదికలతో కలిసి పని చేయటానికి తెలుగుదేశం పార్టీ సీనియర్‌నేత కింజరపు ఎర్రంనాయుడు, మాజీస్పీకర్ కావలి ప్రతిభాభారతి, మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ, పార్టీ జిల్లాఅథ్యక్షుడు చౌదరి బాబ్జీ, అమదాలవలస టిడిపి ఇన్‌ఛార్జి కూస రవికుమార్ తదితరులు సిద్ధమయ్యారు. వీరంతా తమ ఎమ్మెల్యేను ఎందుకు అరెస్టు చేశారని జిల్లా ఎస్పీని ప్రశ్నించారు. పర్యావరణానికి ముప్పుతెచ్చే పరిశ్రమలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వ వైఖరిపై ధ్వజమెత్తుతున్నారు.
భారీస్థాయిలో ఈ నిరసన ఉద్యమాన్ని కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. తగిన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. మహాసభ ఏర్పాటు చేయాలని నిరసనకారులు నిర్ణయించారు. ఈ నెల 17నుంచి సామూహిక దీక్షలకు సిద్ధమవుతున్నారు. తెలుగుదేశం పార్టీ, పర్యావరణ పరిరక్షణసమితి, మత్స్యకార ఐక్యవేదిక ఈ నిరసనకార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ప్రభుత్వం థర్మల్‌పవర్‌ప్లాంటు రద్దు చేసేంత వరకూ తీవ్రస్థాయిలో స్పందించాలని ఈ మూడు నిశ్చయించాయి.