భూకేటాయింపుల విధానాలపై సిబిఐ ఆరా?
posted on Jul 2, 2012 @ 10:28AM
రాష్ట్రంలో కీలకమైన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి అక్రమాస్తుల కేసు విచారిస్తున్న సిబిఐ మరో కొత్త అంశంపై విచారణ సాగించింది. ఈ అంశంపై కూలంకుషంగా పరిజ్ఞానం సంపాదించే దిశగా సిబిఐ కసరత్తులు చేసింది. భూకేటాయింపులపై రాష్ట్రప్రభుత్వం అనుసరించే విధానాన్ని స్వయంగా అడిగితెలుసుకుంది. దీనికోసం భూకేటాయింపులు చేసే అధికారులతోనూ, ఇతర ప్రతినిధులతోనూ సిబిఐ సంప్రదింపులు జరిపింది. దాదాపు పూర్తిస్థాయి విచారణ తలపించేలా ఎక్కువసమయాన్ని సిబిఐ కేటాయించింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాత ఎంత కాలంలో భూకేటాయింపులు జరుగుతాయనే విషయంపైనే సిబిఐ దృష్టి సారించింది. సచివాలయంలో దస్త్రాలు, ఫైళ్ల కదలిక, వివిధ హోదాల్లోని అధికారులు వారి అధికారం తదితర అంశాలపై సిబిఐ వివరాలు తీసుకుంది. ప్రత్యేకించి కొందరు అధికారులను దిల్‌కుషాలో ప్రశ్నించి తమ సందేహాలను తీర్చుకుంది. సిబిఐ ఇలా భూకేటాయింపుల అంశాన్ని క్షుణ్నంగా పరిశీలించడం చూస్తుంటే మరో కొత్త సంచలనం త్వరలో తెరపైకి వస్తుందని పలువురు భావిస్తున్నారు. ఈ విచారణ ఆధారంగా ఏ కేసును పరిష్కరిస్తారోనని ఎదురు చూస్తున్నారు.