ఈనెల 10 నుంచి మారనున్న తత్కాల్ రిజర్వేషన్ల టైం
posted on Jul 1, 2012 @ 5:33PM
అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణీకులకు ఉపయోగకరంగా వుంటుందని ప్రవేశపెట్టిన తత్కాల్ రైల్వే రిజర్వేషన్ వల్ల సాధారణ ప్రయాణీకుల కంటే దళారులే ఎక్కువగా లాభం పొందుతున్న విషయాన్ని గుర్తించిన రైల్వేశాఖ తత్కాల్ రిజర్వేషన్ వేళల్లో మార్పుచేసింది. ఈ ప్రకారం ఇకపై ఉదయం 10 గంటల తరువాతే తత్కాల్ రిజర్వేషన్లు అందుబాటులో వుంటాయని రైల్వే అధికారులు ప్రకటించారు. తత్కాల్ రిజర్వేషన్లలో అవకతవకలు చోటుచేసుకుంటున్నట్లు రైల్వేశాఖకి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. ఉదయం 8 గంటలకే రిజర్వేషన్ సౌకర్యం అందుబాటులో వుండడంతో దళారులు ముందుగా రిజర్వేషన్లు చేయించుకొని, అనంతరం వాటిని బ్లాక్‌లో విక్రయిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో ప్రయాణీకులకు వీలైన సమయాన్ని అమలు చేయాలని నిర్ణయించి, ఉదయం 10 గంటలకు మాత్రమే తత్కాల్ రిజర్వేషన్లు కౌంటర్లను తెరువనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ విధానం ఈనెల 10వ తేదీ నుంచి అమలుకానుంది. విధి నిర్వహణలో రైల్వే సిబ్బంది సెల్‌ఫోన్ వినియోగంపై కూడా రైల్వే శాఖ నిషేధం విధించింది.