2014 కాంగ్రెస్ అజెండాలో సంపూర్ణ మద్యనిషేధం
posted on Jul 2, 2012 @ 11:55AM
రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాననిషేధాన్ని ప్రవేశపెట్టేందుకు 2014 ఎన్నికలను కాంగ్రెస్ వేదికగా భావిస్తోంది. ఇప్పటి నుంచి మ్యానిఫెస్టో రూపొందించేందుకు కూడా కాంగ్రెస్ ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. రాష్ట్రంలో మహిళలకు కాంగ్రెస్ ఇచ్చే వరంగా సంపూర్ణమద్యపాన నిషేధం అంశాన్ని ప్రకటించాలని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. తాము వ్యక్తిగతంగా కోరుకుంటున్నా ప్రభుత్వపరంగా సాధ్యమవుతుందా అన్న అంశం ఆలోచిస్తామని పీసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ ప్రకటించారు. వాస్తవానికి ఈయన కుటుంబంపై మద్యంవ్యాపార ఆరోపణలున్నాయి. అయితే తాము సంపూర్ణమద్యపాన నిషేధం కోసం ప్రభుత్వానికి ఇతర మార్గాల్లో ఆదాయాన్ని చూపుతామన్నారు. కేంద్రం అంగీకరిస్తే ఈ అంశం మ్యానిఫెస్టోలో చేరుతుందన్నారు. గతంలో వైఎస్‌ఆర్ రైతులకు ఉచిత విద్యుత్తు అంశంపై కేంద్రం నుంచి అనుమతి పొందారని గుర్తు చేశారు. అలానే ఇక్కడి పరిస్థితులు వివరించి తాను ఈ సంపూర్ణమద్యపాన నిషేధం అంశం మ్యానిఫెస్టోలోకి చేర్చేందుకు కృషి చేస్తానని బొత్సాబాబు శెలవిచ్చారు. గత ఎన్నికల్లో పరిస్థితులను గమనిస్తే రాష్ట్రంలో అధికారం కోసం సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని నందమూరి తారకరామారావు ప్రకటించారు. ఆయన ఎన్నికల్లో విజయం సాధించాక తొలిసంతకం కూడా ఈ ఫైలుపైనే చేశారు. ఆనాటి అనుభవాలూ, అప్పటి పరిస్థితులూ పునరావృతమయ్యాయి. ఈ అంశాన్ని ఉప ఎన్నికల్లో ఓటమి తరువాత గమనించిన పీసిసి అధ్యక్షుడు బొత్సా మీడియా ముందు ఆగలేక నోరు జారి ప్రకటించేశారు. కానీ, ఇదే గనుక బొత్సా నిజం చేయగలిగితే కాంగ్రెస్ మళ్లీ అథికారంలోకి వస్తుంది. అప్పట్లో మాదిరిగా చరిష్మా ఉన్న ఎన్టీఆర్ లేకపోయినా కాంగ్రెస్‌కు మ్యానిఫెస్టో బలం ఉందని ఈ అంశం తోడైతే ప్రకటించేయవచ్చు.