విశాఖతీరంలో భారీ ప్లాంటు, మత్య్స కారుల వ్యతిరేకత
posted on Jul 2, 2012 @ 12:20PM
విశాఖతీరంలో రూ. రెండువేల కోట్ల రూపాయల భారీప్లాంటు మరో మూడేళ్ల లోపు నిర్మించనున్నారు. హిందుస్తాన్ కాపర్‌స్మెల్టింగ్ ప్లాంటును ఇక్కడ నెలకొల్పనున్నారు. దీని ద్వారా అంతర్జాతీయ మార్కెట్టులో ఈ కంపెనీ విస్తరించేందుకు అవకాశాలు మెరుగవుతాయి. కాపర్‌వ్యాపారరంగంలో ఉన్న ఈ కంపెనీ ఇతర రంగాల్లోకి పరిచయమయ్యేందుకు విశాఖ అనువుగా ఉంటుందని ముందస్తుగా ఈ ప్లాంటుకు యోచన చేశారు. ఈ ప్లాంటు నిర్మాణానికి మూడేళ్ల సమయం పడుతుందని హెచ్‌సిఎల్(హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్) సిఎండి షకీల్ అహ్మద్ తెలిపారు. ప్రస్తుతానికి సాధ్యాసాధ్యాల నివేదికను రూపొందించేందుకు కన్సల్టెన్సీ సంస్థను మాత్రం ఏర్పాటు చేశామని వివరించారు.
అయితే ఈ విశాఖతీరంలో ఏ కొత్తప్లాంటు ప్రతిపాదన చేసినా ఇటీవల వివాదాలు తెరపైకి వస్తున్నాయి. అందుకే కన్సల్టెన్సీ సంస్థ ద్వారా హెచ్‌సిఎల్ సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తోంది. ప్రత్యేకించి మత్స్యకార ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టేందుకు భారీ సంస్థలు కృషి చేస్తున్నాయి. అందువల్ల తీరం ఖాళీ లేకుండా పోతోందని విశాఖ పర్యావరణ పరిరక్షణ సమితి సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ పరిశ్రమల వల్ల ఉద్యోగావకాశాలు మెరుగుపడినా కాలుష్యం చవి చూడాల్సి వస్తోందంటున్నారు. అందుకని ముందుగానే కాలుష్యాన్ని జీరో చేసే సాంకేతికపరికరాలతో ప్లాంటుకు ప్రతిపాదనలు రూపొందించుకోవాలని సూచిస్తున్నారు.