ప్రత్యేక తెలంగాణాపై కాంగ్రెస్ మల్లగుల్లాలు?
posted on Jul 2, 2012 @ 12:01PM
ప్రత్యేక తెలంగాణా అంశంపై కాంగ్రెసు పార్టీ అధిష్టానంలో మళ్ళీ చలనం వచ్చింది. ఈ అంశం తమపార్టీపై తీవ్రప్రభావం చూపుతోందని అధిష్టానం భావిస్తోంది. ఒకవైపు తెలంగాణావాదులు, మరోవైపు సమైక్యవాదులు ఎన్నికల సమయంలో పార్టీ గెలుపును ఈ అంశం ఆధారంగా శాసిస్తున్నారని అధిష్టానం భావిస్తోంది. అందుకే దీన్ని తొందరగా తేల్చి పారేస్తే మిగతా పనులు చూసుకోవచ్చని అధిష్టానం ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. చిత్రంగా తెలగాణా, రాయలసీమలను కలిపే రాయల తెలంగాణా రాష్ట్రం గురించి ఓ మూడు రోజుల పాటు కాంగ్రెస్ నాయకత్వం చర్చలు నడిపింది. రాయలసీమ ఎప్పుడైతే తమతో కలిసిందో అప్పుడే అధికారం పోయిందన్న భావనలో ఉన్న టిఆర్‌ఎస్ నాయకులు దీని సాధ్యాసాధ్యాలు చర్చించకుండానే అది వద్దని బ్రేక్ వేశారు. వారు వద్దన్నా కాంగ్రెస్ అధిష్టానం మాత్రం రాయలతెలంగాణావైపే మొగ్గుచూపుతోంది. ఇలా తెలంగాణాను ప్రకటించేస్తే తమకు వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీతో ఉన్న సమస్య కూడా తప్పినట్లే కాంగ్రెస్ భావిస్తోంది. ఎందుకంటే అథికారం కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్, టిఆర్‌ఎస్ పార్టీలు ఇప్పుడు ఉన్న సఖ్యత వదిలేసి ఘర్షణకు దిగుతారు కాబట్టి రాయల తెలంగాణా సరైన పరిష్కారంగా అధిష్టానం భావిస్తోంది. మీలో మీరే తేల్చుకోండని పరోక్షంగా తన్నుకు చావమని కాంగ్రెస్ అధిష్టానం సూచిస్తోంది.ఒకవైపు టి.ఆర్‌యఎస్.ను మరో వైపు జగన్ పార్టీని ఇరుకున పెట్టేందుకే కాంగ్రెస్ అధిష్టానం ఇటువంటి ఆలోచనలు చేస్తోందని, ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టడమే ఆ పార్టీ లక్ష్యమని తెలుస్తోంది. అయితే టిఆర్‌ఎస్ నేరుగా ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నందున కాంగ్రెస్ ఇంకా మల్లగుల్లాలు పడుతోంది. అయితే ఈసారి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశముందని నేతల తీరు స్పష్టం చేస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ఇచ్చిన సంకేతాలు ప్రత్యేక రాష్ట్రం ఖాయమని పరోక్షంగా అర్థం వస్తోంది.