వెలుగుచూసిన ఎరువుల డీలర్ల అక్రమాలు
ఎరువుల డీలర్లు రైతులను పీల్చిపిప్పిచేసే జలగల్లా మారారు. తమ వ్యాపారాల కోసం రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఒకవైపు రైతులకు పిండి అప్పుగా ఇచ్చి ధాన్యం పండాక ఇచ్చిన దానికన్నా ఎక్కువ దోచుకుంటున్నారు. విత్తనాలు దాచేసుకోవటం, ఎరువులను తమకు తోచిన రీతిన సరఫరా చేయటం వీరికి ఉన్న హక్కు. కృత్రిమకొరత ఏర్పడటానికీ వీరు ప్రధానకారణమవుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం విజిలెన్స్ దాడులకు ఆదేశాలివ్వటం రైతులకు ఊరట ఇచ్చే అంశం. ఈ దాడుల్లో ఒక్కరోజే రాష్ట్రంలో దాదాపు 8కోట్ల పైచిలుకు ఎరువులు, విత్తనాలు బయటకు వచ్చాయి. అలానే అక్రమాలకు అలవాటుపడ్డ డీలర్లు విజిలెన్స్ అధికారులపై ప్రతిదాడులకు దిగి గాయపరిచారు. ముందుగా దాడుల సమాచారం తెలుసుకున్న గుంటూరు జిల్లా మాచర్ల ఎరువుల వ్యాపారులు తమ దుకాణాలను మూసేశారు. ఈ దుకాణాల మూసివేత డీలర్ల నెట్‌వర్క్‌ను చాటుతోంది. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి అక్రమంగా దాచి ఉంచిన ఎరువుల బస్తాలు స్వాధీనం చేసుకుని డీలరుపై కేసు పెట్టారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో విజిలెన్స్‌దాడులు నిర్వహించింది. ఖమ్మం జిల్లాలో రెండు దుకాణాలు జప్తు చేశారు. నల్గొండ జిల్లాలో మూడు బృందాలు దాడుల్లో పాల్గొన్నాయి. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఒక దుకాణంపై దాడి చేసి 1224 ప్యాకెట్ల పత్తివిత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా గుడ్లూరు, యర్రగొండపాలెం, గిద్దలూరుల్లో మూడు దుకాణాలు మూయించారు. వరంగల్ జిల్లాలో విత్తనాల దుకాణాలపై తహశిల్దార్ దాడులు చేశారు. మెదక్ జిల్లా రామాయంపేటలో విజిలెన్స్ దాడులు నిర్వహించింది. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం, కడియం, తాళ్లరేవుల్లో ఐదుకోట్ల రూపాయల విలువైన ఎరువులు, పురుగుమందులు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగం ్‌ఖిల్లాఘనపురం, కొత్తకోటల్లో వ్యవసాయాధికారుల దాడులు జరిగాయి.కర్నూలులో రూ.70లక్షల విలువైన బిటి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. మెదక్‌జిల్లా నర్సాపురంలో రెవెన్యూ, వ్యవసాయ, పోలీసు శాఖలు సమన్వయంగా దాడులు నిర్వహించాయి. కరీంనగర్ జిల్లా పెదపల్లి మండలం చిన్నకలువలో తనిఖీ అధికారులపై వ్యాపారులు దాడుల చేశారు. ఎఇఓకు గాయాలయ్యాయి. ఇంకా దాడులు కొనసాగించి డీలర్లను లొంగదీయాలని రైతులు కోరుతున్నారు.