హీరోల యందు రియల్ హీరోలు వేరయా
posted on Jul 2, 2012 @ 11:51AM
టాలీవుడ్‌లో ఓ ప్రముఖ స్టార్ ఒకసారి విమానంలో ప్రయాణం చేస్తుండగా దానిలో సాంకేతిక లోపంతలెత్తటంతో ఆ విమానాన్ని పైలట్ చాకచక్యంగా పొలాల్లో దింపారు. అప్పుడు సదరు ఆ హీరోగారు విమాన ప్రయాణంలో జరిగిన ఒడిదుడుకుల్లో కంగారు పడి బోరున ఏడ్చారని ప్రముఖ నవలా రచయిత యండమూరి సెలవిచ్చారు. అలాగే మరో తెలుగు హీరో ఇంట్లో దొంగతనానికని ఒకడు తెగబడితే అటుగా వెళుతున్న పోలీసులు అతన్ని పట్టుకున్నారు. అప్పుడు సదరు హీరోగారు ఒకవేళ దొంగతనానికి వాడు ఇంట్లో ప్రవేశించి ఉంటే డబ్బులుతోపాటు నన్ను కూడా చంపేసేవాడేమోనని అసలు రూపాన్ని బయట పెట్టారు. మరో హీరో ఓ ఫాక్షన్ స్టోరీ లో హీరోగా చేస్తుంటే వ్యతిరేక వర్గం హీరో ప్రయాణిస్తున్న కారుపై బాంబులు విసిరారు. అప్పుడు ఆ హీరో ఒకటే ఏడుపు .... ముందుగా తేరుకున్న ఫాక్షనిస్టే హీరోగారిని కారులోనుండి బయటకు లాగి చూస్తే ఏముంది ...కొంచెం గీరుకుపోయింది అంతే... దీన్ని బట్టి తేలేదేమంటే హీరోలంతా సినిమాలకే పరిమిత మవుతుంటారు. బయటకు వస్తే ఏముండదు. అయితే ఈ రోజు జూబ్లిహిల్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఎమ్మెల్సీలంతా పరుగుపెడుతుంటే ఒక యువ ఎమ్మెల్యే దివంగత కాంగ్రెస్ నాయకుడు అయిన జనార్ధన్‌రెడ్డి కుమారుడు విష్ణువర్దన్‌రెడ్డి దట్టంగా అలుముకున్న పొగలను మంటలను లెక్కచేయకుండా సిలిండర్‌ను ఆఫ్ చేయడం పలువురిని ఆకట్టుకుంది. యుపిఎ తరుపున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రణబ్‌ముఖర్జీ ప్రసంగం తరువాత జూబ్లీహాలులో అగ్నిప్రమాదం సంభవించింది. అదీ ఎసి గ్యాస్‌సిలెండర్ ఒక్కసారిగా పేలి మంటలు చెలరేగాయి. మంటలు ఉధృతంగా ఉన్న సమయంలో పీజెఆర్ తనయుడు విష్ణు మంటల్లోకి దూకి వస్తున్న వేడిని లెక్క చేయకుండా ఎసి సిలెండర్‌ను ఎంతో చాకచక్యంగా ఆఫ్ చేశారు. దీంతో కొద్దిసేపు మంటలు వ్యాపించినా మరింత పెద్ద ప్రమాదం తప్పింది. కొద్దిసేపటికి మంటలూ శాంతించాయి. దీంతో అక్కడే ఉన్న మిగిలిన కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విష్ణును తమ భుజాల పైకెత్తి అభినందనలు తెలిపారు. చప్పట్లు కొట్టి మరీ విష్ణు సాహసాన్ని ప్రశంసించారు. హమ్మయ్య ఈ ప్రమాదం తప్పిందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసిన విష్ణు స్నేహితులు కూడా ఆయన సాహసాన్ని కొనియాడారు. నిజజీవితంలో నాయకుడంటే అతడే మరి.