రాష్ట్రానికి కొత్త హార్డ్‌వేర్ కంపెనీలు?
posted on Jul 2, 2012 @ 12:25PM
రాష్ట్ర మంత్రివర్గం ప్రకటించిన రాయితీలు కొత్తహార్డ్‌వేర్ కంపెనీలను ఆకర్షిస్తున్నాయి. వేలాది కోట్లతో హార్డ్‌వేర్ కంపెనీలు ప్రారంభిద్దామని నిర్ణయించుకున్న వారంతా ఇతర రాష్ట్రాలను వదిలి ఆంధ్రప్రదేశ్‌కు రాకతప్పదు. ఎందుకంటే రాష్ట్రంలో ప్రధాన సమస్యగా ఉన్న విద్యుత్తు కోత ఈ కంపెనీలకు ఉండబోదని ప్రభుత్వం ప్రకటించింది. ఇది కూడా కంపెనీలను ఆకర్షించేందుకు హైలైట్ పాయింట్ అని పారిశ్రామికవేత్తలంటున్నారు. అంతేకాకుండా ఒక పరిశ్రమకు అవసరమైన రుణ, భూమి వంటి అన్ని సదుపాయాల్లోనూ రాయితీలు ప్రకటించింది. దీనితో ఆగకుండా ఉద్యోగ నియామకాలకూ తమ వంతు సాయాన్ని అందిస్తోంది. అంటే రెండేళ్లలో 50మందిని నియమించటానికి రూ.2.5లక్షలు, చిన్న, మథ్యతరహా కంపెనీలు 200మందిని నియమించేందుకు పది లక్షల రూపాయలు ప్రభుత్వం సహాయం అందిస్తుంది. 2,3 స్థాయి పట్టణాల్లో పెట్టే చిన్న కంపెనీలకు భారీగా మంత్రివర్గ సాయం అందుతోంది. సాంకేతికపరిజ్ఞొనాభివృద్థి కోసం తీసుకునే పరికరాలకు మొదట సారి సబ్సిడీ కింద పది శాతం అదీ గరిష్టంగా 25లక్షల వరకూ ప్రభుత్వమే భరిస్తుంది. రెండోస్థాయి నగరాల్లో ఏర్పాటు చేసే కంపెనీలకు నూరుశాతం స్టాంపుడ్యూటీ మినహాయింపు ఇస్తారు. ఈ హార్డ్‌వేర్ కొత్తకంపెనీలకు వ్యాట్, సిఎస్‌టిల నుంచి మినహాయింపు ఇచ్చేస్తోంది. గతంలో కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ఇచ్చిన రాయితీలతో పోలిస్తే ఇప్పుడు ఆంధ్రాప్రకటించిన విధానాలు చాలా బాగున్నాయని, చిన్న చిన్న పట్టణాల్లో సైతం ఈ కంపెనీలు పెట్టడం ద్వారా ప్రభుత్వ రాయితీల ఫలం ఎక్కువ అందుకోవచ్చని ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లు అంటున్నాయి. సెజ్‌లు, ప్రభుత్వ భూముల్లో 25శాతం రాయితీ ప్రకటించటం కూడా హైలైట్‌గా ఉందంటున్నారు.