టిడిపి చంద్రబాబు సొంత ఆస్తి కాదు: కొడాలి నాని
posted on Jul 11, 2012 @ 4:04PM
తెలుగుదేశం పార్టీ చంద్రబాబు సొంత ఆస్తి కాదు అని, అది అన్నగారు స్థాపించిన పార్టీ అని అన్నారు. జగన్ తనకు వ్యక్తిగతంగా తెలిసిన మనిషి, గతంలో కూడా నాలుగైదు సార్లు కలిశానని, ఆయన ఇబ్బందులలో ఉన్నారని కలవడానికి వెళ్లానని ఆయన చెప్పారు. జగన్ వద్దకు వెళితే చంద్రబాబుకు కోపం అని తెలిసే, విజయమ్మ వద్దకు వెళ్ళానని, ఇంటి బయటకు వచ్చేసరికి సస్పెన్షన్ చేసినట్లు టీవీలలో వచ్చిందని ఆయన అన్నారు. ఎన్.టి.ఆర్.పై సవాలు చేసి ఓడిపోయి, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి టిడిపిలోకి చంద్రబాబు వచ్చి, ఆ పార్టీని స్వాధీనం చేసుకున్నారని అన్నారు. తాను అసలు మాట్లాడకుండా ఉన్నా, జిల్లాకు చెందిన కొందరు కుక్కలను ఉసికొల్పి, తిట్టించి, చివరి ఆయన కూడా తిట్టారని నాని వ్యాఖ్యానించారు. కేంద్రంలో సోనియాగాంధీ, చిదంబరంలతో సంబందాలు పెట్టుకుని కాంగ్రెస్ కు టిడిపిని హోల్ సేల్ గా అమ్మేశారని చంద్రబాబుపై ఆరోపించారు. తనను సస్పెండ్ చేసినందుకు ఎన్.టి.ఆర్.ఆత్మ ఘోషిస్తుందని అన్నారు. రాజ్యసభ సీటును ముప్పై కోట్లకు అమ్ముకున్నారని ఆయన అన్నారు. ఎన్.టి.ఆర్. మాబోటి అభిమానుల కోసం పెట్టిన పార్టీ అని, నీ బోటి వాళ్ళ కోసం పెట్టిన పార్టీ కాదని అన్నారు.