డీబీర్స్ గనుల తవ్వకాల నుంచి తప్పుకుంది?
posted on Jul 12, 2012 @ 10:45AM
వజ్రాలు, బాక్సయిట్, క్రోమ్‌ఖనిజం, ఇనుము, మాంగనీసు, విలువైన రాళ్లు, సీసం, జింకు, బంగారం వంటి గనులు తవ్వగలమని చెప్పి అనుమతి కోరిన డీబీర్స్ సంస్థ ఏడాది తిరగకుండానే తమకు ఇచ్చిన అనుమతి రద్దు చేయమని రాత పూర్వకంగా కోరింది. తాజాగా ప్రభుత్వమూ అనుమతులను రద్దు చేసింది. దీని వెనుక అసలు కథేమిటీ? అన్న ప్రశ్న తెరవెనుక పాత్రలను పరిచయం చేస్తోంది. ఇప్పటి వరకూ గనుల అక్రమతవ్వకాల్లో మాఫియాగా చెలామణి అవుతున్న కొందరు డీబీర్స్ సంస్థ నిర్వాహకులను బెదిరించారని ఒక కొత్తసమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ బెదిరింపుల కారణంగా తమకు వ్యాపారంలో మిగిలేదానికన్నా టెన్షన్ ఎక్కువ భరించాల్సి ఉంటుందనే ఈ తవ్వకాల నుంచి డీబీర్స్ తప్పుకుందంటున్నారు. అందుకే తమకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని కూడా ఆ సంస్థ రాతపూర్వకంగా కోరింది.
2009 ఆగస్టులో డీబీర్స్ కంపెనీ తమకు 153.3 కిలోమీటర్లు అక్షాంశాలు, రేఖాంశాలు నిర్దేశిస్తూ గనుల తవ్వకాలకు అనుమతి కోరింది. మూడేళ్ల పాటు గనుల తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తరువాత 2010 జనవరిలోనే తాము తవ్వకాలు జరపలేమని, అనుమతులు రద్దు చేయమని ప్రభుత్వానికి ధరఖాస్తు చేసుకుంది. అనంతపురం, కడప జిల్లాల్లో ఈ కంపెనీ తీసుకున్న గనుల ప్రాంతంలో అసలు ఏమి లభ్యమయ్యే అవకాశం ఉంది? అన్న విషయం మాత్రం ఆ కంపెనీ తేల్చలేదు. తనకున్న అర్హతలు పేర్కొన్న ఈ కంపెనీ ఆ ప్రాంతంలో తామనుకున్నట్లు ఫలానా ఖనిజం లేనందున తవ్వకాలు జరపలేకపోతున్నామని ప్రకటించలేదు. విలువైన సంపద ఉన్నందున ఈ కంపెనీ నిర్వాహకులను బెదిరించారా? లేక నిర్వహణభారం ఎక్కువై స్వయంగా తప్పుకోవాలనుకుందా? వంటి పలు రకాల సందేహాలు డీబీర్స్ అనుమతుల రద్దు కోరటంలోనే వ్యక్తమవుతున్నాయి. అయితే ఆ కంపెనీ కోరినట్లే ప్రభుత్వం అనుమతులను రద్దు చేసింది. ఓసారి ఈ ప్రాంతం మైనింగ్‌నిపుణుల సహకారంతో పరిశీలించిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఎవరికైనా అనుమతులు ఇవ్వాలని పలువురు సూచిస్తున్నారు.