బి.సి. పార్టీ ఏర్పాటుకు జైలులోనే సన్నాహలు చేస్తున్న నూకారపు
posted on Jul 12, 2012 @ 3:58PM
రాష్ట్రంలో మరో బి.సి .పార్టీని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బ్యాంకును మోసం చేసిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న నూకారపు సూర్యప్రకాశరావు మరో కొత్త బిసి పార్టీ పెట్టే దిశలో ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తున్నది. నేటి దినపత్రిక సూర్య అధినేత అయిన ప్రకాశరావు టెలివిజన్ ఛానల్ కూడా ప్రారంభించేందుకు ఆయన అనుయాయులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ డిసెంబర్‌లోగా టివి ఛానల్ ప్రారంభమవుతుందని, అనంతరం కొత్త పార్టీని లాంచ్ చేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఆయన జైలులోనే తన పత్రిక బ్యూరో ఇన్‌చార్జిలతో సమాలోచించినట్లు సమాచారం. శిక్షా కాలం పూర్తికాకముందే తాను బయటకు వస్తానని, సూర్య దినపత్రికకు బడుగుల పత్రిక అని పేరున్నదని, దీనిని ఆసరాగా చేసుకుని పార్టీ పెడితే భవిష్యత్తు ఎలా ఉంటుందని ఆయన బ్యూరో ఇన్‌చార్జిలను ఆడిగినట్లు తెలిసింది. అయితే టిడిపి బడుగుల బాటను అనుసరించడం, మిగిలిన పార్టీలూ బిసిలకు రిజర్వేషన్లు కల్పించాలని బిసి సంఘం నేత ఆర్.కృష్ణయ్య కోరిన విషయం తెలిసిందే. అయితే బి.సి.ల కోసం కాసానిజ్ఞానేశ్వర్ మన పార్టీ స్ధాపించి బి.సి.లను ఉద్దరించాలనుకున్నారు. దీని కోసం న్యూస్ ఛానల్ కూడా ప్రారంభించాలను కున్నారు.చివరకు ఆయన పార్టీని నట్టేట ముంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో కొత్త పార్టీ స్థాపించాలన్న నూకారపు ఆశయం ఏమేరకు అమలవుతుందో చూడాలి.