చంచల్ గూడాజైలులో ములాఖత్‌కు ముడుపు చెల్లించాల్సిందే
posted on Jul 12, 2012 @ 4:08PM
హైదరాబాద్‌లోని చంచల్ గూడా జైలు పలువురు వి.ఐ.పి. ఖైదీలతో కళకళలాడుతోంది. ఈ వి.ఐ.పి. ఖైదీల పుణ్యమాని జైలు అధికారులు నాలుగు కాసులు వెనుకేసుకోగలుగుతున్నారు. ఈ ఖైదీలకు వారు కోరుకునే ఫుడ్ చేయించుకుని తినే ఫెసిలిటీ ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగపర్చుకుంటున్న వి.ఐ.పి. ఖైదీల్లో కొందరు జైల్లో విందు భోజనాలు తయారు చేయించుకుంటున్నారు.ఈ పసందైన విందు బోజనాలను అతిధి ఖైదీలతో పాటు జైలు ఆధికారులు కూడా ఆరగించి బ్రేవ్‌మని తేన్చుతూ అన్నదాతా సుఖీభవ అంటూ ఆశీర్వదిస్తున్నారు.
ఎక్కడైనా బావేగాని వంగతోటకాడ బావ కాదన్నట్లు ముడుపులు పుచ్చుకునే విషయంలో మాత్రం జైలు అధికారులు ఏమాత్రం సెంటిమెంట్‌కు, స్నేహనికి తావివ్వడం లేదు. వి.ఐ.పి. ములాఖత్‌కు వచ్చేవారిని ముడుపులు చెల్లిస్తేనే లోనికి అనుమతిస్తున్నారు. తమ జైల్లో వి.ఐ.పి.లు ఎప్పుడోగాని రారని, అటువంటి వారిని చూడటానికి వచ్చేవారి నుంచి తృణమో , ఫణమో ఆశించడంలో తప్పేమి లేదన్నని జైలు సిబ్బంది అభిప్రాయం. జైలులో మగ్గుతున్న నూకారపు సూర్యప్రకాశరావును చూడటానికి పలువురు ములాఖత్‌కు వస్తుండడంతో జైలు సిబ్బంది వారిని ఆపివేశారు. దీంతో వారు నెలకు ఇంత చొప్పున ఇస్తామని బేరం కుదుర్చుకున్న తర్వాత నూకారపు భార్య, కూతురితో పాటు మరి కొందరిని లోనికి రెగ్యులర్‌గా అనుమతిస్తున్నారు.