నాని వ్యవహారంలో తెలుగుదేశం తొందరపడిందా?
posted on Jul 12, 2012 @ 9:50AM
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని సస్పెండ్ చేసి తెలుగుదేశం పార్టీ తొందరపడిందా? ఈ ప్రశ్న రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చలకు దారి తీస్తోంది. ఏ నలుగురు కలిసినా దీని గురించే చర్చిస్తున్నారు. క్రమశిక్షణ ఉన్న పార్టీ అని నిరూపించుకునేందుకు నానిపై సస్పెన్షన్ వేటు వేయటం ద్వారా తెలుగుదేశం పార్టీ తహతహలాడుతోందని అర్థమవుతోందని కొందరు తేల్చేస్తున్నారు. వై.కా.పా. గౌరవాధ్యక్షురాలు విజయమ్మను కలవగానే ఒకే ఒక్క నిమషం వ్యవథిలో తెలుగుదేశం పార్టీ నానిని సస్పెండ్ చేసిందని ప్రకటన విడుదలైంది. ఒక్కనిమషంలోనే ఈ ప్రకటన జారీచేయటం, జైలు వద్ద జగన్‌ను కలిశాక నానిని విలేకరులు ప్రశ్నించారు. తనను సస్పెండ్ చేయటమేమిటీ? అంటే నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో లేనా? అని నాని విలేకరులను ఎదురు ప్రశ్నించటం మొదలుకుని గుడివాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం వరకూ అన్ని అంశాలూ చర్చల్లో పాల్గొనే వారు ప్రస్తావిస్తున్నారు.
తానే స్వయంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతానంటే వద్దని ఉప ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న టిడిపి అథినేత చంద్రబాబు బుజ్జగించిన సంఘటన మరిచిపోయారా అని నాని ప్రశ్నించారు. చంద్రబాబు తనని నమ్మకద్రోహి అంటూ వ్యాఖ్యానిస్తు ఆగ్రహం వ్యక్తం చేయటాన్ని నాని ఖండిరచారు. ఈ ఖండన కూడా చర్చలో పాల్గొనేవారికి ఆసక్తికర అంశంగా మారింది. ఎందుకంటే దీనిపై నాని వివరణ ఇస్తూ చంద్రబాబు చంద్రగిరి నుంచి పారిపోయి వచ్చినందున తనను కూడా అలానే భావించారని ఆరోపించారు. తనపై కార్యకర్తలను రెచ్చగొట్టడం చాలా దారుణమని నాని రివర్సులో ఎదురుతిరగటం చర్చలో ప్రముఖ అంశంగా మారుతోంది. ప్రత్యేకించి ఒక్క కృష్ణా జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాల్లో కూడా తెలుగుదేశం శ్రేణులు నాని వై.కా.పా. తీర్థం పుచ్చుకున్నానని ప్రకటిస్తే నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సన్నద్ధమయ్యారు. ఈలోపు నాని తాను తెలుగుదేశంలోనే కొనసాగుతానని ప్రకటిస్తూ పార్టీ చంద్రబాబుకు సొంతమా అని ఎదురు ప్రశ్నించటం చర్చల్లో పాల్గొన్న వారు గతపరిస్థితుల విశ్లేషణకు దారి తీస్తోంది.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు నుంచి చంద్రబాబు పార్టీని సొంతం చేసుకున్న గతం గురించి నాని ప్రకటన వల్ల ఆ పార్టీ నేతలు కూడా ఈసందర్భంగా గుర్తు చేసుకున్నారు. అలానే నాని తాను హరికృష్ణ వల్ల తెలుగుదేశం పార్టీలో చేరానని, ఎన్టీఆర్ తనను ఎమ్మెల్యే చేశాడని చెప్పటం ఆయన విథేయతను చాటుకున్నట్లుందని చర్చల్లో ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబును ఎదిరించి మరీ తెలుగుదేశం పార్టీలో కొనసాగుతానని, సస్పెన్షన్ ఎత్తివేయకపోతే ఊరుకోనని నాని హెచ్చరించారు. ఈ హెచ్చరిక కూడా నాని తన హక్కుని చాటుకున్నట్లు ఉందని పలువురు అంటున్నారు. రూ.30కోట్లకు నాని అమ్ముడుపోయాడని ఎమ్మెల్యే దేవినేని ఉమ ఆరోపించటం, దానికి నాని తాను పైసా తీసుకోలేదని కుటుంబసాక్షిగా ఒట్టేసి చెబుతున్నానని తెలపటం రాష్ట్రవ్యాప్తంగా నానిపై సానుభూతిని కురిపిస్తోంది.
ఎమ్మెల్యే ఉమ తన తమ్ముడు వై.కా.పా.కు వెడితే వదిలేసి తనపై పడటం గురించి నాని ప్రశ్నించిన తీరు కూడా సంచలనానికి వేదికైంది. అసలు వై.కా.పా.గౌరవాధ్యక్షురాలు విజయమ్మను కలవటం, జైలులో ఉన్న జగన్‌ను కలవటం వ్యక్తిగతంగా ఎందుకు భావించరని నాని ప్రశ్నించటం చర్చల్లో మసాలాను జోడించినట్లుంది. ఒకవేళ సస్పెన్షన్‌ను తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తే నాని తాను జగన్‌తో కలిసి పని చేయటానికైనా సిద్ధమేనని ముక్తాయింపుగా హెచ్చరిక చేయటం కొసమెరుపుగా పలువురు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసినందునే తాను వై.కా.పా.లో చేరానని చెప్పుకోవటానికి నానికి టిడిపి ఛాన్స్ ఇచ్చినట్లు ఉందని అందరూ అంగీకరిస్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ నాని వ్యవహారంలో మొత్తం మీద తొందరపడినట్లే కదా! అని నవ్వుకుంటున్నారు.