అవినీతి ఇఓ రామచంద్రమోహన్ బదిలీ?
posted on Jul 12, 2012 @ 10:36AM
గుడిని, గుడిలో లింగాన్ని మింగేసే ప్రబుద్ధులు ఉంటారని తూర్పుగోదావరి జిల్లా అన్నవరం ఇఓ రామచంద్రమోహన్ విధులను పరిశీలిస్తే అనుమానించక తప్పదు. అందుకే చేతివాటం తిరిగిన ఈయన్ని ప్రశాంతంగా తప్పించాలని భద్రాచలం బదిలీ చేశారట. పూర్తిగా దేవాదాయశాఖ నుంచి ఈయన్ని తప్పించారని సమాచారం. అయితే ఇఓ తాజాగా సక్రమంగా విధులకు హాజరుకాలేదని వంకపెట్టి 3వగ్రేడ్ వ్రతపురోహితుడు పోచినపెద్ది రాథాకృష్ణను సస్పెండ్ చేశారు. ఇఓ తాను చేసిన తప్పులు కప్పిపుచ్చుకుని పేదబ్రాహ్మణుడిపై పడ్డాడేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిగడిరచిన తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో అవకతవకలపై ఇటీవల భారీగానే దుమారం లేస్తోంది. కొత్తగా ఆలయనిర్మాణం పూర్తి చేసిన ఇఓ బాగా లాభపడ్డారని ఆందోళనలు ఎక్కువయ్యాయి. అంతేకాకుండా తన భార్య, పిల్లల పేరిట వ్రతమండపాలు కట్టించేందుకూ ఈయన వెనుకాడలేదు. అంటే దాతల సొమ్ముతో తాను సోకు చేసుకుందామని ప్రయత్నించారు. అంతేకాకుండా లెక్కల్లో లేని విదేశీడబ్బును కూడా ఈయన కూడబెట్టారని ఆరోపణలు వెలుగుచూస్తున్నాయి.
గతేడాది అమెరికా వెళ్లి భక్తుల నుంచి కొంత సొమ్ము ఈయన తన తాలూకూవారి అకౌంట్లలోకి లాగేశారని సమాచారం. అలానే నిర్మాణం వాస్తవ ఎస్టిమేట్లు కూడా ఎప్పుడో దాటించేశారని కూడా ఈయనపై ఆరోపణలున్నాయి. అయితే ఈయన్ని బదిలీ చేస్తున్నందుకు దేవస్థాన పురోహితులు, సిబ్బంది ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి కళ్యాణం వచ్చినా, ఇతర ఏ కార్యక్రమం చేపట్టినా ఆర్‌ఎన్‌ఐ కూడా లేని, అసలు నిబంధనల ప్రకారం వచ్చి ప్రకటన కూడా కలెక్ట్ చేయలేని పత్రికల పేరిట బిల్లులు కూడా చేసేశారని తెలిసింది. అంతేకాకుండా దేవస్థానంలో పెద్దగా అవసరం లేదని పాత ఇఓలు తొలగించిన పోస్టులను తిరిగి నియమించి గొప్పగా చూపే ప్రయత్నంలో ఇఓ విజయవంతమయ్యారని తెలిసింది. దానిలో భాగంగానే ఓ పిఆర్‌ఓ పోస్టును ఆయన గొప్పగా చూపుతున్నారు. ప్రతీపనికీ పిఆర్‌ఓను ముందు చూపుతున్నారు.
ఒకరకంగా ఇఓ రామచంద్రమోహన్ తనకు బదులుగా ఏజెంటుగా పిఆర్‌ఓను వాడుతున్నారని విమర్శలు ఎక్కువయ్యాయి. గురివింద గింజ ఎక్కిరింతలా ఆయన తన అథికారాన్ని చిన్న ఉద్యోగుల ముందు ప్రదర్శిస్తూనే వచ్చారు. ఇక వ్రతపురోహితుడు పోచిపెద్ది రాథాకృష్ణ అన్నవరంలో పురోహిత యూనియన్ కోసం డబ్బులు వసూలు చేశారట. దానిలో ఇఓగారి వాటా అందనందుకే ఆయన్ని సస్పెండ్ చేశారని, అలానే ఇఓ సొంతపనులకు రాథాకృష్ణ ఒకసారి నో అన్నందుకు ఈ సస్పెన్షన్ విధించారని సమాచారం. ఇంకా వేరే కారణం ఉన్నా ఉండొచ్చని ఆ దేవస్థానంలోని ఇతర ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు. ఇలా ఇఓ ఇష్టానుసారంగా అన్నవరం దేవస్థానాన్ని వినియోగించుకుంటున్నారని ఆరోపణలు ఎక్కువయ్యాయి. మరి ఆయనపై చర్య తీసుకునేందుకు దేవాదాయశాఖ సిద్ధంగా ఉందా?