ఇక అన్నీ కోతలే
posted on Jul 12, 2012 @ 10:11AM
గ్యాస్‌సరఫరా కోసం వేరొకరితో ఒప్పందం చేసుకున్నాం త్వరలో విద్యుత్తు సరఫరా పరిస్థితి మెరుగవుతుందని రాష్ట్రముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. కానీ, ట్రాన్స్‌కో ఎండి హీరాలాల్ సమారియా కోతవేళలు నిర్ధారించారు. ఈ రెండు అంశాలూ భిన్నంగానే ఉన్నాయి. ముఖ్యమంత్రి మాటలు కూడా కోతలతో పోల్చాలా? లేక ట్రాన్స్‌కో ఎండీ అమలు చేసే కోతలు అనుభవించాలా? అన్న మీమాంస రాష్ట్రంలోని ప్రజలకు ఏర్పడిరది. రాష్ట్రంలోని అన్ని డిస్కమ్‌లతో ఎండి సమావేశమై కోతల వేళలను నిర్ధారించారు. తిరుపతి, వరంగల్, విశాఖనగరాల్లో రోజుకు మూడుగంటల కోత విధిస్తారు. రైతులకు ఏడు గంటల పాటు విద్యుత్తును నిరంతరంగా సరఫరా చేస్తారు. జిల్లా కేంద్రాల్లో రోజుకు ఐదుగంటల పాటు విద్యుత్తు కోత ఉంటుంది. గ్రామీణప్రాంతాల్లో సాయంత్రం ఆరు నుంచి ఉదయం ఆరుగంటల వరకూ విద్యుత్తు సరఫరా చేస్తారు. పట్టణాలు, పురపాలకసంఘాలు, మండలాలులో రోజుకు ఆరుగంటలు కోత విధిస్తారు.
పరిశ్రమలకు వారానికి మూడు రోజుల చొప్పున నెలకు 12రోజులు విద్యుత్తు సరఫరా ఉండదు. చిన్నతరహాపరిశ్రమలకు వారానికి రెండు రోజుల చొప్పున నెలకు 8రోజులు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తారు. రైసుమిల్లులు, గిడ్డంగులు, కోళ్లఫారాలు వంటి వాటికి 40శాతం విద్యుత్తుకోత ఉంటుంది. ఇలా ఒక కోత ప్రణాళికను రూపొందించిన ఏకైక ప్రభుత్వంగా కిరణ్‌సర్కారును ప్రజలు గుర్తిస్తున్నారు. ఇప్పటికే నిరంతర విద్యుత్తు ఉంటుందన్న నమ్మకంతో ఏర్పాటు చేసిన కొన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. కోట్లాది రూపాయల పెట్టుబడి నష్టపోయారు. ఇక ఈ కోతల్లో ఇంకెంత నష్టం వస్తుందో భవిష్యత్తులోనే లెక్కలు చూడాలి. రాష్ట్రప్రభుత్వం కొత్త విద్యుత్తు ఉత్పత్తి చేసే పరిశ్రమలకు ప్రణాళిక వేయనంత కాలం కరెంటు విషయంలో ఇంకా గడ్డురోజులు చవి చూడాల్సిందేనని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు తప్పవని హెచ్చరిస్తున్నాయి.