ఓ తెలంగాణా ఓ కేసీఆర్ కథ
posted on Jul 12, 2012 @ 10:52AM
ఇదేమిటీ? ఓ తెలంగాణా...ఓ కేసీఆర్ కథ అంటారు అనుకుంటే పొరబాటే. ఈ కేసీఆర్ ఎవరో కాదు టిఆర్‌ఎస్ అథినేత. ఈయన తెలుగుదేశం పార్టీని వదిలి తెలంగాణా రాష్ట్రసమితి పార్టీ అథినేతగా మారినప్పటి నుంచి ప్రత్యేక తెలంగాణా పాటనే పాడుతున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు తుమ్మినా, దగ్గినా కూడా అది తెలంగాణా ఇచ్చేసేందుకే అని ఈయన సంబరపడుతుంటారు. దేనికోసమైతే తాము పార్టీ పెట్టారో ఆ లక్ష్యం త్వరలోనే నెరవేరుతుందన్న ఆశావాదం ఆయనికి గ్లూకోజు అందుకే సుగర్ వచ్చినా లెక్కచేయరు. ఎప్పుడు తెలంగాణా వస్తుందా అని భార్య భర్త కోసం గుమ్మంలో ఎదురుచూసినట్లే కేసీఆర్ కళ్లల్లో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. అందని ద్రాక్షపండు పుల్లన అన్నట్లు ఆయన తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించిన సమైక్యవాదులంటే కారాలు, మిరియాలు నూరేందుకు పార్టీలో ఒక పదవి ఇచ్చి మరీ హరీశ్‌రావును ప్రోత్సహిస్తున్నారు. కేసీఆర్ మాట హరీశ్‌రావు నొటెంట అని అందరూ అనుకుంటూ ఉంటారు. తెలంగాణా గురించి ఎవరూ అనుకోనప్పుడే మూడు నెలల్లో వచ్చేస్తుందని ఒకసారి, ఆరు నెలల్లో వచ్చేస్తుందని మరోసారి జోస్యాలు చెబుతూ కాలం గడిపేస్తుంటారు.
ఇదే తెలంగాణా పేరు చెప్పి తమ నేతలతో చేయించిన రాజీనామాల ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం కాదు కానీ ఉప ఎన్నికలు మాత్రం వస్తుంటాయి. అలాంటి ఉప ఎన్నికల్లో ఒకసారి బిజెపి చేతిలో ఒక అసెంబ్లీ స్థానాన్ని నష్టపోయారు కూడా. ఈయన హయాంలోనే ఇటీవల 2012 ఉప ఎన్నికలు జరిగాయి. మొత్తం తెలంగాణాలోని ఒక్క పరకాల అసెంబ్లీలో జరిగిన ఈ ఎన్నికల్లో కేవలం 1500ఓట్ల మెజార్టీతో టిఆర్‌ఎస్ అభ్యర్థి భిక్షపతిని గెలిపించుకోవటానికి మొత్తం టిఆర్‌ఎస్ అంతా చెమటలు కక్కేసింది. ఒకదశలో ఓడిపోతామన్న బాధ, భయం టిఆర్‌ఎస్‌కు ఏర్పడిరది. కేసీఆర్‌ది ఐరన్ టంగ్ అన్నట్లు సునాయసంగా తెలంగాణావాదంపై గెలవాల్సిన ఈయన పార్టీకి చావుతప్పి కన్నులొట్టపోయింది. ఏ సమైక్యవాద పార్టీ వల్ల తెలంగాణా రాదని ప్రచారం చేసి ఓటెయ్యవద్దని ప్రజలను హెచ్చరించారో ఆ వైఎస్‌ఆర్ కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి కొండాసురేఖ టిఆర్‌ఎస్ నేతలకు ముచ్చెమటలు పోయించారు.
ఆ చెమటలను తుడిచేసుకుని తెలంగాణావాదం గెలిచిందని హరీశరావు చేత ప్రచారం చేయించారు. ఇంకో విశేషమేమిటంటే ఈయన ఇంకేముంది తెలంగాణా వచ్చేసిందని అంటారో అప్పుడు అది ఖచ్చితంగా రాదు. ఈ ఇష్యూని పక్కకు తప్పించి వేరే సమస్యను ముందుకు తీసుకురావటానికి కాంగ్రెస్ పార్టీ అలవాటు పడడింది. అందుకే ఇంకేముంది తెలంగాణా వచ్చేస్తుందని రాజీనామాలు చేసేయమంటే ఎన్నికలే వస్తున్నాయని కేసీఆర్‌ను సొంత పార్టీ ప్రతినిధులే విమర్శిస్తున్నారు. తాజాగా రెండు రోజుల నుంచి తెలంగాణా వచ్చేసిందని కేసీఆర్ చంకలు గుద్దుకోవటం చూసి మరేమవుతుందో అని టిఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. కేసీఆర్ ఉత్సాహపడితే తెలంగాణా వస్తుందా? కేంద్రంలోని అందరూ తెలంగాణా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి కదా! ఏమైనా నిరంతరం కొనసాగే ఈ కథకు టైటిల్ సరిపోయిందనుకుంటా. కథ కూడా ఇంకా సాగుతూనే ఉంది.