కాంగ్రెస్, ‘దేశం‘ కు షాకివ్వబోతున్న ఆ ఎనిమిది మంది ఎం.ఎల్.ఎ.లు ఎవరు ?
posted on Jul 12, 2012 @ 7:45PM
ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే...... పండుగాడు అనే డైలాగ్ మహేష్ బాబుతో పోకిరి సినిమాలో పూరీజగన్నాద్ చెప్పించినా ప్రస్తుత రాజకీయాలలోకి ఇదే స్టయిల్ మెయింటిన్ చేస్తున్నారు వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్.
తనకంటూ వ్యక్తిగత ఇమేజ్ లేదు. తండ్రినుండి వచ్చిన ప్రజాకర్షక పధకాలను వారసత్వ ఓట్లగా మార్చుకోవడమే తప్ప. తనేం పెద్ద వక్తకాదు. రాజకీయ అనుభవశాలి అంతకన్నాకాదు. తన బలం కన్నా ప్రత్యర్థుల బలహీనతలే ఆయన ఆయుధంగా వాడుకుంటున్నారు. మొన్నజరిగిన ఉప ఎన్నికల్లో 18 సీట్లలో 15 సీట్లు గెలుచుకొని, తెలంగాణాలో నువ్వానేనా అనే పోటీనిచ్చిన జగన్ పార్టీ, అత్యధిక మెజారీటీతో పార్లమెంటు స్ధానాన్ని సంపాదించుకొని 10 జనపథ్ రోడ్డులోని దేశానికి కాబోయే ప్రిన్స్‌కి నిద్రలేకుండా చేశారు. ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ నుండి ఎవ్వరు వెళ్లినా బిజీగా ఉన్నామంటూ నెలలు తరబడి తిప్పే రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ, చిదంబరం, మొదలైన వాళ్లంతా ఇప్పుడు ఎవ్వరు ఎప్పుడెళ్లినా, ఒక్కరుగా అయినా సరే, గుంపుగా అయినా సరే రండి రండి అంటూ ఆహ్వానం పలుకుతున్నారు. ఆరోడ్డులో ఎవరైనా ఎపి నుండి వచ్చినట్లనిపించినా పలకరిస్తున్నారు. అలా అయిపోయింది వారి పరిస్థితి. మంతనాలు, రిపోర్టులు, సర్వేలతో కుస్తీ పడుతున్నారు.
ఇదే గాలి 2014 లో కూడా వీస్తే పరిస్ధితి ఏంటా అని నిద్రలేకుండా గడిపే పరిస్థితి డిల్లీ పెద్దలకు పట్టింది. రాష్ట్రంలో ప్రధాన పతిపక్షమైన తెలుగుదేశం పార్టీని కూడా కోలుకోలేని దెబ్బ తీసాడు జగన్ . అసలే మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్కటికూడా అసెంబ్లీ స్థానాలను గెలుచుకోలేకపోయామన్న బాధలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. గోరు చుట్టుపై రోకటి పోటులాగా ఆపరేషన్ ఆకర్ష పేరుతో తెలుగుదేశం పార్టీ లోని నాయకుల్నందర్నీ వైసిపి పార్టీలోకి లాగే ప్రక్రియ కొనసాగిస్తున్నారు జగన్. తెలుగుదేశం పార్టీలో అంతర్గత పోరు, కుటుంబపోరుతో సతమతమవుతున్న చంద్రబాబునాయుడికి ఈ వ్యవహారం మూలిగే నక్కపై తాటికాయపడినట్లు అయ్యింది. తెలుగుదేశం పార్టీకి సెంటుమెంటు స్ధానమైన గుడివాడ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నాని పార్టీ ఫిరాయించడంతో తెలుగుదేశంలో గగ్గోలు మొదలైంది. పార్టీ నిర్లక్ష్యంచేస్తుందని, తను జూనియర్ యన్టీఆర్ ద్వారా తెలుగుదేశం పార్టీలోకి వచ్చినందువల్లే చంద్రబాబునాయుడు ప్రక్కన పెడుతున్నారని, యస్,సి., బిసిల ఓట్లు వైసిపికి ఉన్నాయి కాబట్టి వైసిపి లోకెళుతున్నానని నాని ఎన్ని మాటలు చెప్పినా ఒక్కటి మాత్రం నిజం గెలుపుగుర్రాన్ని ఎవరు ఒదులుకుంటారు. ప్రస్తుతానికి ప్రజాకర్షక పార్టీ వైసిపి అని మొన్నటి ఎన్నికల్లో తేలిపోయింది. దాంతో నాయకులంతా ఆ పార్టీలోకి వెళ్ళడానికి క్యూ కడుతున్నారు.
అదేంటో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా ఇంతే. తెలుగుదేశం నుండే ఎక్కువ వలసలు జరిగాయి. తెలుగుదేశం పార్టీలో ఇక్కడితో నాయకులు జంప్‌లు ఆగిపోవని అధిష్టానానికి తెలుసు. అందుకే అంత రభస. కృష్ణాజిల్లాలో ఇంకా ఇద్దరు ముగ్గురు ఎమ్మేల్యేలు పార్టీ వీడటానికి సిద్దంగా ఉన్నారనే విషయమే నాయకులను కలవర పరుస్తోంది. గుంటూరు, ప్రకాశం జిల్లాలో కూడా పరిస్థితి ఇందుకు విరుద్దంగా ఏమీ లేదని నాయకులకు ఉప్పందుతుండటంతో తెలుగుదేశం నాయకులకు కంటికి నిద్ర కరువయ్యింది. ఈ మూడు జిల్లాల నుంచి కనీసం ఎనిమిది మంది కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన శాసన సభ్యులు జగన్ పంచన చేరడానికి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిసింది దాంతో చంద్రబాబుని పరామర్శించడానికి బాలకృష్ట పని కట్టుకొని వచ్చి పరిస్థితిని పరీక్షించవలసి వచ్చింది. అసలే రెండుకళ్ల సిద్దాంతంతో తెలంగాణకు దూరం అయిన చంద్రబాబుకు ఆంద్రలో కూడా ఓట్లు పడని పరిస్థితిలోకి నెట్టివేయబడ్డారు.
కాంగ్రెస్ పరిస్థితి అంతే. ఏదో అధికారంలో ఉన్నారు కాబట్టి నాయకులు సైలెంట్‌గా ఉన్నారు. రాబోయే ఎన్నికలకు ఎలాగా అని ముందుచూపున్న వారంతా వాళ్ల పిల్లల్ని వైసిపికి పంపుతున్నారు. దానికి తార్కాణం తెలుగుదేశం పార్టీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి కుమార్తె వైసిపిలో చేరారు. రాజమండ్రి కి చెందిన మంత్రి పినిపే విశ్వరూప్ తనయుడిది అదేతీరు. కాంగ్రెస్ నాయకుడు దివంగత జనార్దన్‌రెడ్డి (పిజెఆర్) కుమార్తె విజయకూడా చెంచల్‌గూడ జైలులో జగన్ ను కలిసారు. ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీలో అంతగా వలసలు లేక పోయినా వచ్చే ఎన్నికలనాటికి తీవ్రత హెచ్చయ్యే ప్రమాదం లేకపోలేదు. మునిగిపోయే ఓటి పడవల్లో ఉండటానికి ఎవరూ ఇష్టపడటం లేదు. ఒక్కడంటే ఒక్కడు అదీ చెంచల్‌గూడ జైల్లో నుంచి మహా మహానాయకుల్ని మట్టికరిపిస్తున్నారు.