అవినాష్ అరెస్ట్ కు కర్నాటక అడ్డు
posted on May 8, 2023 @ 4:04PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ సొంత చిన్నాన్న వైయస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి వైయస్ భాస్కరరెడ్డి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో భాస్కరరెడ్డిని సీబీఐ ఇప్పటికే అరెస్ట్ చేసి.. 14 రోజుల రిమాండ్ నేపథ్యంలో చంచల్‌గూడ జైలుకు తరలించింది.
అయితే వైయస్ అవినాష్ రెడ్డి రేపో మాపో అరెస్ట్ అయిపోతారంటూ నిన్న మొన్నటి వరకూ జోరుగా సాగిన ప్రచారం యిప్పుడు జగరడం లేదు. అవినాష్ రెడ్డి.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి.. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. అయితే ముందస్తు బెయిల్ ఆదేశాలు ఇవ్వలేమని విస్పష్టంగా చెప్పేసి, కోర్టుకు వేసవి సెలవులు నేపథ్యంలో ఈ కేసు విచారణను జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది. దీంతో వైయస్ అవినాష్ రెడ్డి అరెస్ట్‌కు సీబీఐకి ఎలాంటి అవరోధాలూ లేకుండా పోయాయి. అయినా అవినాష్ అరెస్టు విషయంలో సీబీఐ అడుగు ముందుకు వేయడం లేదు. అవినాష్ మాత్రం పులివెందులలోనూ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రారంభోత్సవాలు, ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తూ బిజీగా గడిపేస్తున్నారు.
ఈ విధంగా అవినాష్ గతంలో ఎన్నడూ ప్రజలలో కలిసి తిరిగిన దాఖలాలు లేవు. ఆఖరికి చిన్న చిన్న దుకాణాల ప్రారంభోత్సవాలకు కూడా అవినాష్ హాజరౌతున్నారు. ఒక విధంగా కోర్టులు ఆయన అరెస్టు చేయడానికి సీబీఐకి ఎటువంటి అడ్డంకులూ లేవని విస్ఫష్టంగా చెప్పేసినా ఆయన అలా యథేచ్ఛగా తిరుగుతున్నా సీబీఐ ఆయనను అదుపులోనికి తీసుకోవడం లేదంటే.. ఆయనకు కోర్టుల రక్షణ లేకపోయినా సీబీఐ అరెస్టు చేయలేదన్న ధైర్యం మెండుగా ఉందనీ, దీని వెనుక ఏదో మతలబు ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆయన అరెస్టుకూ, కర్నాటక ఎన్నికలకూ లింకు పెడుతూ పలు విశ్లేషణలు చేస్తున్నారు.
అవేమంటే.. కర్నాటకలో అధికారం నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ ఆ రాష్ట్రంలో విజయం కోసం ఎదురీదుతోంది. యిప్పటి వరకూ వెలువడిన అన్ని సర్వేలూ కాంగ్రెస్ దే గెలుపని ఢంకా బజాయించి మరీ చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్నాటకలో అంతో యింతో పట్టున్న జగన్ కు కర్నాటకలో తమ పార్టీని గెలిపించే కీలక బాధ్యత బీజేపీ అగ్రనాయకత్వం ఆయనకు అప్పగించింది. అందుకు జగన్ సై అన్నారు. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు కర్నాటకలో బీజేపీ విజయం కోసం జగన్ రమారమి ఐదు వందల కోట్లు వ్యయం చేయడానికి సైతం రెడీ అయ్యారు. అన్నిటికీ మించి ఆ రాష్ట్రంలో బీజేపీని దూరం జరిగి సొంత కుంపటి పెట్టుకున్న మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి జగన్ కు సన్నిహితుడన్న సంగతి విదితమే.
ఈ నేపథ్యంలోనే ఆ బీజేపీ మాజీ నేత గాలి జనార్ధన్ రెడ్డి కారణంగా బీజేపీ ఓట్లు చీలకుండా, ఆయన కమలం పార్టీలో స్నేహపూర్వక పోటీలో మాత్రమే ఉండేలా ఆయనను ఒప్పించేందుకు బీజేపీ జగన్ తో ఒప్పందం కుదుర్చుకుందని పరిశీలకులు అంటున్నారు. యిందు కోసం జగన్ అవినాష్ రెడ్డికి అరెస్టు నుంచి రక్షణ కల్పించాల్సిందిగా కోరారనీ, అందుకు బీజేపీ హై కమాండ్ అంగీకరించిందనీ ఓ చర్చ అయితే జోరుగా సాగుతోంది. అందుకే కళ్ల ముందే సవాల్ చేస్తున్నట్లుగా అవినాష్ పులివెందులలో తిరుగుతున్నా.. అరెస్టు చేయడానికి సీబీఐ యిసుమంతైనా ప్రయత్నించడం లేదనీ అంటున్నారు. పరిస్థితులను గమనిస్తున్న ఎవరికైనా అవినాష్ అరెస్టు కాకపోవడానికి పై నుంచి సీబీఐపై తీవ్ర ఒత్తిడి ఉందని అనిపించకమానదు. ఆ ఒత్తిడి ఎక్కడ నుంచి, ఎవరి నుంచి అన్న విషయంలో ఎవరికీ అనుమానాలూ, సందేహాలూ ఉండవు. ఈ నేపథ్యంలోనే కర్నాటక ఎన్నికలు పూర్తై, ఫలితాలు వచ్చే వరకూ అవినాష్ కు అరెస్టు భయం లేదని పరిశీలకుల విశ్లేషణలు హేతుబద్ధంగానే ఉన్నయని సామాన్యులు సైతం అంటున్నారు.