తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. జమిలి అనుమానాలు!
posted on May 8, 2023 @ 2:36PM
తెలంగాణ ఎన్నికల విషయంలో ముందస్తు ముచ్చట వెనక్కు పోయి.. జమిలి అవకాశాలపై చర్చకు తెరలేచింది. రాష్ట్రంలో ఎలాగైనా సరే అధికారాన్ని అందుకోవాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ.. పొరుగున ఉన్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే కర్నాటక ఫలితాల ప్రభావం పడి గెలుపు వాకిట బోల్తా పడే అవకాశాలున్నాయని ఆందోళన చెందుతోంది.
దీంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను కూడా సార్వత్రిక ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది లో నిర్వహించాలని భావిస్తోంది. అందు కోసం చట్టపరంగా, న్యాయపరంగా ఉన్న అవకాశాలను తీవ్రంగా పరిశీలిస్తోంది. జమిలి కోసం పార్లమెంటులో ఆర్డినెన్స్ తీసుకువచ్చైనా సరే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల వరకూ వాయిదా వేయడమే మంచిదన్న భావన బీజేపీ అధిష్ఠానంలో బలంగా వ్యక్తమౌతోందని కేంద్రంలో బీజేపీకి సన్నిహితంగా మెలిగా వర్గాలు విశ్వసనీయంగా చెబుతున్నాయి.
దీంతో తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలలోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగేదెప్పుడన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా సార్వత్రిక ఎన్నికలతో పాటే జరిగితే.. అది కచ్చితంగా బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తుందని తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ గట్టిగా నమ్ముతోంది. ఒక వేళ అదే జరిగితే న్యాయపోరాటానికి రెడీ అవుతామంటోది. ఒక్క తెలంగాణలోనే కాదు ఈ ఏడాది డిసెంబర్, నవంబర్ లో ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాలకు కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ రాష్ట్రాలన్నిటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నది అందరూ భావిస్తున్నారు.
అందుకే పలు దశల్లో ఎన్నికలు జరిపే కేంద్ర ఎన్నికల కమిషన్.. షెడ్యూలును దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో నవంబరు చివర్లో ఎన్నికలు నిర్వహించే అవకాశాలే మెండుగా ఉన్నాయని, కనుక అక్టోబరులోనే షెడ్యూలు విడుదల కావచ్చనీ బీఆర్ఎస్ భావిస్తోంది. అందుకే సెప్టెంబర్ నెలాఖరునాటికి రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన క్యాలెండర్‌ను సిద్ధం చేస్తోంది. అయితే ఈ రాష్ట్రాల ఎన్నికలు జరిగిన తరువాత ఆరు నెలల లోగానే .. సార్వత్రిక ఎన్నికలు జరగనున్నందున, ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసి జమిలిగా వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో నిర్వహించేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు ఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రచారం అవుతోంది. ఈ విషయంలో రాజ్యాంగ పరమైన చిక్కులు ఎదురు కాకుండా ఆర్డినెన్సు రూపంలో వీటి అసెంబ్లీ కాలపరిమితిని మే నెల వరకూ పొడిగించే అవకాశాలు లేకపోలేదన్నది పరిశీలకుల విశ్లేషణ.
అయితే బీఆర్ఎస్ మాత్రం యిందుకు ససేమిరా అంగీకరించే అవకాశాలు లేవు. ఒక వేళ కేంద్రం జమిలి కోసం ఆర్డినెన్స్ తీసుకువస్తే ఎదుర్కొనడం ఎలా అననదానిపై యిప్పటికే బీఆర్ఎస్ కసరత్తులు మొదలు పెట్టినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో యిప్పటికే రాజ్యాంగ నిపుణుల అభిప్రాయాలను తీసుకునే పనిలో ఆ పార్టీ అగ్రనాయకత్వం ఉందని చెబుతున్నారు.