జగన్ న్నాథ రథచక్రాల కిందనలిగిపోతున్న ఏపీ
posted on May 8, 2023 @ 9:39AM
వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రధ చక్రాలు వస్తున్నాయి.. రాష్ట్రంలో రాజన్న రాజ్యం రావాలంటే... ప్రతిపక్ష నేత జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కాల్సిందే.. అలా అయితేనే.. ప్రజలకు శాంతి, సౌఖ్యం, సంక్షేమం అంటూ వేల కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్రలో వైసీపీ అధ్యక్షుడు జగన్ నుంచి ఆ పార్టీ కార్యకర్త వరకు అందరూ చెప్పుకొంటూ పోవడంతో.. ఓటర్లు అమాయకంగా జగన్ పార్టీకి గంపగుత్తగా ఓట్లు గుద్దిపారేశారు. ఆ గుద్దుడికి అప్పటి ప్రతిపక్ష పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రి కూర్చిలోకి వచ్చి పడ్డారు. అలా వైయస్ జగన్ మోహన్ రెడ్డి.. 2019, మే 30వ తేదీన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంటే 2023, మే 30వ తేదీకి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తి అవుతుంది.
ఈ నాలుగేళ్ల పాలనలో ముఖ్యమంత్రిగా జగనన్న.. పాలనా వైభోగాన్ని ఒక సారి అవలోకనం చేసుకుంటే.. గతంలో చెప్పినట్లు రాజన్న రాజ్యం తీసుకువచ్చారా? రాష్ట్రాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ను అగ్రస్థానానికి తీసుకెళ్లారా? రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు.. మోదీ ప్రభుత్వంతో పోరాడి మరీ సాధించుకొచ్చారా? ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేశారా? అభివృద్దిలో ఆంధ్రప్రదేశ్.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోటీ పడి దూసుకుపోతోందా? రాష్ట్రంలో శాంతిభద్రతలు ప్రశాంతంగా ఉన్నాయా? ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే.. వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు.. వస్తున్నాయని వైసీపీ నేతలు చెప్పినట్లు ఆ జగన్నాథ రథచక్రాలు వచ్చాయా వచ్చేశాయా అంటే పరిశీలకులు వచ్చేశాయంటున్నారు. కానీ అవి జనాన్ని తొక్కుకుంటూ సాగుతున్నాయనీ.. ఆ ‘జగన్’ న్నాథ రథచక్రాల కింద పడి జనం నలిగిపోతున్నారనీ విశ్లేషిస్తున్నారు.
గన్ గద్దెనెక్కిన నాటి నుంచి నేటి వరకు ఈ నాలుగేళ్ల పాలనలో.. ప్రజా వేదిక కుప్పకూల్చడంతో ప్రారంభమైన విధ్వంసం.. అప్రతిహాతంగా అలా కొనసాగుతూనే ఉేందని అంటున్నారు. ఆ తర్వాత ఇసుక సరఫరా నిలిపివేతతో భవన నిర్మాణదారులు పెట్టిన ఆర్తనాదాలు, జగనన్న తీసుకొచ్చిన కొత్త మద్యం బ్రాండ్లతో.. మందుబాబులకు కిక్క్ ఎక్కడం దేవుడేరుగు.. కిక్క్ డ్ ది బెక్కెట్ అన్నట్లుగా.. ప్రాణాలు హరించిపోతున్నాయి.
ప్రతిపక్షనేతగా రాజధాని అమరావతికి మద్దతు ప్రకటించి.. . అధికారంలోకి మూడు రాజధానులు ఉండాలని.. అలా అయితేనే పాలన, పరిపాలన వికేంద్రీకరణ జరుగుతోందని ప్రకటించడం.. ఆ దిశగా అడుగులు తడబడుతూ వేయడం.. దాంతో తాము నిండిమునిగిపోయామంటూ... ఆందోళనలకు దిగినా.. ధర్నాలు చేసినా... ఆక్రందనలతో పెడబొబ్బలు పెట్టినా రాజధానికి భూములిచ్చిన రైతుల గోడు పట్టించుకునే నాథుడు లేకపోవడంతో.. తమ బాధలు, తమ గాధలు అటు ఆ కలియుగదైవం శ్రీవెంకటేశ్వరుడికి.. ఇటు ప్రత్యక్ష నారాయణుడు అరసవిల్లిలోని శ్రీసూర్య భగవానుడి చెప్పుకొనేందుకు పాదయాత్రకు శ్రీకారం చుట్టిన ఫలితం మాత్రం లేకపాయే.
ఇక జగన్ అధికారంలోకి రాగానే అమలు చేస్తున్న నవరత్న పథకాలు.. కాలం గడిచే కొద్ది... రంగు వెలిసిపోతూ.. నవరత్నాల ఉంగరంలోని నకిలీ రాళ్లు.. రాలినట్లుగా ఒక్కొ పథకం ఒక్కో రాయి లాగా జారి పడిపోతున్నాయి. ఇక తాము అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేసి.. ఆ స్థానంలో పాత ఫించన్ విధానాన్ని అమలు చేస్తామంటూ ప్రభుత్వ ఉద్యోగులకు స్పష్టమైన హామీ ఇచ్చి .. అధికారంలోకి రాగానే.. ఆ హామీని తుంగలోకి తొక్కి.. తాము మాట తప్పం.. మడమ తిప్పం అంటూ చెప్పుకున్న గొప్పలన్నీ డొల్లేనని రుజువు చేసుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రాష్ట్ర విభజనతో ప్రభుత్వానికి రాబడి నిల్.. అప్పులు మాత్రం ఫుల్‌గా ఉండడంతో.. రాష్ట్రంలో ఆర్థిక శాఖ కాస్తా.. అప్పుల శాఖగా మారిపోయింది. ఇలా చెప్పుకొంటూ పోతే.. ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాలనలోని చోటు చేసుకొన్న వైఫల్యాలు లెక్కకు అందనన్ని ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు.
ఇక ఎగత న్నికలకు ముందు నాటి ప్రతిపక్ష నేత జగన్ సొంత బాబాయి, వివేకా దారుణ హత్యకు గురైతే... సొంత ఇంటి మనిషి ప్రభుత్వాధినేతగా ఉండి కూడా న్యాయం జరగకపోవడం... పట్ల ప్రజలే ముక్కున వేలేసుకుంటున్నారు. ఇలా ఈ నాలుగేళ్లల్లో జగనన్న పాలనను బేరిజు వేసుకొంటూ వెళ్లితే.. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి చూసుకుంటే.. భూమీ ఆకాశాలు కలిసే చోటే అది ఆవిష్క్రృతమవుతోందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అందుకే వచ్చేశాయి.. వచ్చేశాయి... తొక్కేశాయి.. తొక్కేశాయి.. జగన్నాథ రధచక్రాలు.. రథ చక్రాల కిందపడి.. టోకుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ ఆనవాలు లేకుండా.. ఆంధకారంలో పడి కొట్టుమిట్టాడుతోంది.