కాలం కలిసి రావడం లేదా?
posted on May 8, 2023 9:20AM
కాలం... ఓ మాయల మరాఠి. అది చేసే జిమ్మిక్కుల ముందు.. ప్రతి ఒక్కరు తైతక్కలాడాల్సిందే. కాలం కొట్టే దెబ్బకు ఎవరూ అతీతులు కారు. చిట్ట చివరకు సృష్టి, స్థితి, లయ కారకులైనా సరే. ఇంకా చెప్పాలంటే... పాలమ్మినోడిని ఓ రాష్ట్రంలో మంత్రిని చేస్తే.. టీ అమ్మినోడిని ఓ దేశానికి ప్రధాన మంత్రిని చేస్తోంది. పార్టీ అధినేతలుగా, ముఖ్యమంత్రిగా పీఠాలెక్కి రాజ్యాలు ఏలిన వాళ్లు నానా గడ్డి తిన్నారంటూ.. చివరకు శ్రీకృష్ణజన్మస్థానంలోకి తోసి.... ఊచలు లెక్కించేలా చేస్తుందీ. అదీ కాలం. అదీ కాల మహిమంటే. పాలమ్మిన చోటే కట్టెలమ్మాల్సిన పరిస్థితి వస్తుంది కాలం కలసిరాకపోతే.
అలా కాలం ఈడ్చీ కొట్టిన దెబ్బకి ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మే 5వ తేదీ ఒంగోలులో ప్రెస్ మీట్ పెట్టి.. మీడియా ముందు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అంతేకాదు.. తనపై సొంత పార్టీ వారే.. ఇంకాచెప్పాలంటే.. తాను ఎమ్మెల్యే సీట్లు ఇప్పించిన వారే.. తనపై విమర్శలు చేస్తున్నారంటూ ఒకానొక దశలో ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. అయితే అయిదుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన ఆయన ఓ సారి మహానేత, డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కేబినెట్‌లో మంత్రిగా... మరోసారి వైయస్ జగన్ తొలి కేబినెట్‌లో అడవులు, పర్యావరణం, ఇంధన శాఖ మంత్రిగా పని చేశారని.. అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయాలను శాసించి.. ఓ ఊపు ఊపిన తమ ఎమ్మెల్యే బాలినేని.. ఇలా.. ఇలాగా మాట్లాడతారని తాము కలలో కూడా అసలు ఊహించలేదని ఒంగోలు నగర వాసులు ఈ సందర్బంగా పేర్కొంటున్నారు.
గతంలో బాలినేని వాసన్న హవాను ఈ సందర్బంగా జిల్లా వాసులు గుర్తు చేసుకొంటున్నారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు అత్యంత సమీప బంధువన్న సంగతి అందరికి తెలిసిందేనని. ఆ క్రమంలో ఆయనకు పార్టీలోనే కాదు.. బంధు వర్గంలో కూడా ఆయనకు మంచి ఆదరాభిమానాలు ఉన్నాయని.. ఓ నాడు అలా ఓ వెలుగు వెలిగిన నాయకుడు నేడు ఇలా మాట్లాడడం చూస్తేంటే తమకే బాధేస్తోందని ఒంగోలు నగర వాసులు ఓ విధమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా బాలినేని పవర్‌లో ఉండగా చేసిన పనులే ఆయనను ఈ స్థితికి తీసుకు వచ్చాయనే అభిప్రాయం సైతం వారి నుంచి వ్యక్తమవుతోంది. అంతేకాదు.. నాటి సంఘటనలను వారు సోదాహరణగా వివరిస్తోంది.
బాలినేని శ్రీనివాసరెడి జన్మదినం డిసెంబర్ 12వ తేదీ. అయితే 2021 ఏడాదిలో బాలినేని వాసన్న జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు ఒంగోలులో ఊరు వాడల ఘనంగా నిర్వహించాయి. ఆ సందర్భంగా బాలినేని వీరాభిమాని, పార్టీ కార్యకర్త సుబ్బారావు గుప్తా.. ఫ్యాన్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత.. వరుసగా చోటు చేసుకోంటున్న పరిస్థితులు... అలాగే భవిష్యత్తులో మరో పార్టీ అధికారంలోకి వస్తే.. మన పార్టీ శ్రేణులు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉందంటూ.. ప్రస్తుత పరిస్థితులను అకళింపు చేసుకొని మరీ సుబ్బారావు గుప్తా మాట్లాడారని... అయితే అతడేదో పెద్ద నేరం చేసినట్లు.. ఆయనకు బాలినేని వాసన్న వర్గం నుంచి బెదింపులు రావడంతో ప్రాణ భయంతో బిక్కు బిక్కు మంటూ భయపడి గుంటూరు పారిపోయి.. ఓ లాడ్జిలో తల దాచుకొన్నారు. ఆ క్రమంలో గుప్తా కుటుంబం ఎంత వేదన పడిందో అందరికీ తెలిసిందే.
కానీ బాలినేని ప్రధాన అనుచరుడు సుభానీ.. సుబ్బారావు గుప్తా ఆచూకీ కనుగొని.. అతడిపై దాడి చేస్తూ.. బండబూతులు తిడుతూ... మంత్రి బాలినేనికి క్షమాపణలు చెప్పించారు. అందుకు సంబంధించిన వీడియో నాడే కాదు.. నేడు సైతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అయితే సుబ్బారావు గుప్తాపై దాడి అంశంలో మంత్రి బాలినేని అనుచరులు వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఆ క్రమంలో పలు సంఘాలు సైతం ఆందోళన బాట పట్టడంతో.. బాలినేనిపై తీవ్ర ఒత్తిళ్లు రావడంతో.. తన అనుచరుడు సుభానీపై పోలీసులు కేసులు నమోదు చేయక తప్పలేదు. ఆ తర్వాత అతడిని స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. ఈ వ్యవహారం ఒంగోలు నియోజకవర్గంలో తీవ్ర వివాదాస్పదమైందని నగర ప్రజలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
దేవుడుకి, కాలానీకి అందరూ సమానులే. అందుకే సమయం వచ్చినప్పుడు ఎవరికి ఏదీ ఇవ్వాలో అది ఇచ్చేసే వెళ్తోంది... అలాగే ఎవరి నుంచి ఏమీ తీసుకోవాలో అదీ ఖచ్చితంగా తీసుకోనే వెళ్లుందో.. అదీ బలవంతంగా అయినా సరే. అయినా కాలానికి లేనోళ్లు, గొప్పొళ్లు అనే బేధభావం ఉండదు. ఎందుకంటే అది కాలం కదా అని నియోజకవర్గ ప్రజలు పేర్కొంటున్నారు.