శ్రీవారి సన్నిధిలో సెల్ హల్‌చల్
posted on May 8, 2023 @ 5:12PM
తిరుమల శ్రీవారి ఆలయం ఆనంద నిలయం. ఆ ఆలయంలోకి ప్రవేశించాలంటే... కట్టుదిట్టమైన భద్రత నడుమ, అడుగు అడుగునా నిఘా నేత్రాల మధ్య వీవీఐపీ నుంచి సాధారణ భక్తులు వరకు అందరూ ప్రవేశించాల్సి ఉంటుంది. అంతటి భద్రత నడుమ... అలాంటి ఆలయంలోకి ఓ వ్యక్తి సెల్ ఫోన్ తీసుకు వెళ్లడమే కాకుండా.. ఆ సెల్ ఫోన్.. కెమెరాతో ఆలయ విమాన గోపురాన్ని సైతం చాలా చక్కగా చీత్రికరించాడు. అందుకు సంబంధించిన వీడియో.. అటు సోషల్ మీడియలో ఇటు మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.
అయితే ఆ వీడియో వైరల్ కావడంపై శ్రీవారి భక్తులు తీవ్ర ఆందోళన చెందడంతోపాటు ఆగ్రహం సైతం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల స్వామి వారి ఆలయం వద్ద నిఘా వ్యవస్థ వైఫల్యానికి ఇది ఓ నిదర్శనమని ఆరోపణలు సైతం వెల్లువెత్తుతోన్నాయి. తిరుమలలోనే కాదు... తిరుమల దేవాలయ పరిసర ప్రాంతాల్లో సైతం భద్రత అత్యంత కట్టుదిట్టంగా ఉంటుంది. అలాగే తిరుమల కొండపైకి ప్రవేశించిప్పటి నుంచి అడుగడుగునా నిఘా కెమెరాలు.. నిత్యం భక్తులు, స్థానికుల కదలికలను ప్రతీక్షణం గమనిస్తూ ఉంటాయి.
అంటువంటిది.. ఆలయంలోకి ఓ వ్యక్తి నిఘా నేత్రాల కళ్లుగప్పి సెల్ ఫోన్ తీసుకు వెళ్లాడంటే.. అతగాడి చాకచక్యమని మురిసిపోవాలా లేకుంటే.. భద్రత దళాల చేతగానితనానికి నిలువెత్తు నిదర్శనమనాలా? నేడు సెల్ ఫోన్ తీసుకు వెళ్లిన వ్యక్తి.. రేపు మరణాయుధాలు తీసుకు వెళ్లితే పరిస్థితి ఏమిటీ.. ఆ తర్వాత చోటు చేసుకొనే పరిస్థితులకు బాధ్యులు ఎవరూ? అంతా జరిగిపోయాక.. మృతులకు, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానూభుతి తెలపడం... అలాగే ప్రధాని, ముఖ్యమంత్రి అత్యవసర సహాయక నిధి నుంచి నిధులు విడుదల చేయడం.. బాధ్యతారాహిత్యంగా, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై వేటు వేసి.. .ఆ బాధిత కుటుంబాలకు ఎంతో కొంత నష్టపరిహారం అందజేయడంతో.. తమ క్రతువు ముగిసిందని రాజకీయ నాయకాగణంతోపాటు ఏలికలు సైతం భావిస్తూ ఉంటాయి.
కానీ హిందూ దేవాలయాలు.. భగవంతునికి, భక్తునికి అనుసంధాన సంపదకు ప్రతీకగా వర్ధిల్లుతోన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ దేవాలయ నిర్మాణాలు, సాంస్కృతిక కట్టడాలు, ఆ విగ్రహాలు... ఆ ఆగమ శాస్త్రాలు.. ఆ ఆచారాలు, ఆ ఆలయాల పవిత్రత అన్ని హిందూ సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా ప్రపంచవ్యాప్తంగా వేనోళ్లు కొనియాడబడుతోన్నాయి..
అదీకాక ఉగ్రవాదం, తీవ్రవాదం అనే సమస్యలు ఓ ప్రాంతానికో.. ఓ దేశానికి సంబంధించిన సమస్యగా కాకుండా ప్రపంచ మానవాళిని ముప్పుగా పరిణమించిన వేళ... తిరుమలలో ఉగ్రవాదుల సంచారిస్తున్నారంటూ ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులకు ఇటీవల ఓ ఈమెయిల్ రావడం.. దాంతో భద్రత సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగి.. జల్లెడ పట్టడం.. ఆ తర్వాత తిరుమలలో ఉగ్రవాదులు లేరంటూ.. ఈ మెయిల్ శుద్ద అబద్దమంటూ వారి కొట్టిపారేయం జరిగింది. అయితే తొలుత ఈ వార్త విన్న... ప్రపంచంలోని శ్రీవారి భక్తులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
అలాంటి వేళ.. ప్రపంచంలోనే అత్యధిక భక్తులతో కొలవబడుతోన్న కొంగు బంగారు స్వామి శ్రీ ఏడుకొండల స్వామి వారిని ఏ మూల నుంచి, ఏ వైపు నుంచి ఎటువంటి ముప్పు వాటిల్లనుందో తెలియని నేపథ్యంలో ఆలయ అధికారులు, భద్రత సిబ్బందే కాదు.. భక్తులు సైతం అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నది మాత్రం సుస్పష్టం. ఓ వేళ.. ఎటువంటి ముప్పు అయినా వాటిల్లితే.. ఆ దేవదేవుడే కాదు.. భవిష్యత్తు తరాలు.. సైతం మనలను క్షమించవు కాక క్షమించవు.