వైసీపీలో అసమ్మతికి జగనే కారణమా?
posted on May 8, 2023 @ 10:07AM
యిటీవల విడుదలైన సినిమాలలో బలగం ప్రజలను విశేషంగా ఆకర్షించింది. ఆ సినిమా గొప్పతాన్ని యిక్కడ మనమేమీ చర్చించుకోవడం లేదు. కానీ ఒక కుటుంబాన్ని ముందుండి నడిపించాల్సిన వ్యక్తి ఆ పని చేయకపోతే.. ఏం జరుగుతుందో ఈ సినీమా అర్ధమయ్యేలా చెప్పింది. కుటుంబం చీలిపోతుంది. ఒకరికి ఒకరు వ్యతిరేకులౌతారు. శత్రువులౌతారు. ఒక రాజకీయ పార్టీ విషయమేనా అంతే.. పార్టీ నేత పార్టీని ఒక కుటుంబంగా.. అందులో సభ్యులందరినీ తనవారుగా భావించకపోతే పార్టీ చీలిపోతుంది. చీలికలు పేలికలు అవుతుంది.
యిందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా మాత్రం జగన్ అధినేతగా ఉన్న వైసీపీని చెప్పుకుంటే సరిపోతుంది. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి.. ఏపీలో కాంగ్రెస్ పార్టీని ఏకతాటిపై నడిపారు. ఆయన జీవించి ఉన్నంత వరకూ పార్టీలో అసమ్మతి, అసంతృప్తి ఉన్నప్పటికీ.. అదంతా ఏదో ఒకరిద్దరికి సంబంధించిన వ్యవహారంగానే ఉండింది. ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తరువాత కూడా పార్టీలో మెజారిటీ భాగం ఆయన కుమారుడి జగన్ కు మద్దతుగా నిలిచారు. వైఎస్ వారసుడిగా జగన్ నే ముఖ్యమంత్రిని చేయాలంటూ.. ఆయన మృతదేహం సాక్షిగా సంతకాల సేకరణ కూడా జరిగింది. అయితే జగన్ వ్యవహార శైలి కారణంగా అప్పటి కాంగ్రెస్ అధినేత్రి సోనియా అందుకు అంగీకరించలేదు. దీంతో జగన్ సొంత కుంపటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) పెట్టుకున్నారు. అప్పుడు కూడా వైఎస్ అభిమానులు జగన్ వెంటే నడిచారు.
ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి మరీ జగన్ పార్టీలో చేరారు. ఒక ఎన్నికలలో ఓడిపోయినా జగన్ ను వారు వీడలేదు. సరే 2019 ఎన్నికలలో జగన్ సొంత పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. వైఎస్ కుమారుడు జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే అక్కడ నుంచే జగన్ పెద్దరికం డొల్లతనం బయటపడింది. నేను అని తప్ప మనం అన్న పదానికి అర్ధం తెలియని విధంగా వ్యవహరించడంతో తొలుత ఆయన సొంత కుటుంబీకులే దూరమయ్యారు. పార్టీ కుటుంబం సరే.. అదే పార్టీలో సొంత తల్లి, తోడబుట్టిన చెల్లి కూడా ఉన్నారు. వారిరువురినీ ఆయన దూరం పెట్టారు. కారణాల జోలికి వెళ్లడం లేదు. వారిరువురినే దూరం పెట్టిన జగన్ పార్టీలో కూడా ఎవరికీ అందుబాటులోకి రాని రాజరికాన్ని ప్రదర్శించారు. ఫలితంగా యిప్పుడు వైసీపీలో అసమ్మతి జ్వాలలు భగ్గుమంటున్నాయి. ఏ క్షణంలో ఎవరు పార్టీని వీడుతారు.. ఎవరు పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తారు అన్నది పార్టీ అధినేతకే అర్ధం కాని పరిస్థితి నెలకొంది.
ముఖ్యంగా వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో జగన్ అవినాష్ రెడ్డి కి మద్దతుగా నిలిచిన తీరు.. అందుకోసం అందరూ అజాత శత్రువుగా భావించే వివేకానందరెడ్డి వ్యక్తిత్వంపై వేస్తున్న నిందలు, ఆమె కుమార్తె తన తండ్రి హంతకుల ను చట్టం ముందు దోషులుగా నిలబెట్టాలంటూ చేస్తున్న న్యాయపోరాటం.. వైఎస్ పై ఉన్న అభిమానాన్ని కూడా బద్దలు కొట్టి జగన్ కు వ్యతిరేకతను పెంచేలా ఉందని పరిశీలకులు చెబుతున్నారు. తాను జైలులో ఉన్నంత కాలం పార్టీని పదిలంగా కాపాడిన తల్లి విజయమ్మ, ఆయన తల్లి విజయలక్ష్మి చేత వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేయించడం, జగనన్న వదిలిన బాణాన్ని అంటూ కలికి బలపం కట్టుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర చేసిన షర్మిలను పార్టీకి దూరం చేయడం వంటివన్నీ జగన్ వ్యక్తిత్వాన్ని పార్టీ శ్రేణుల ముందు బ్లాక్ అండ్ వైట్ లో నిలబెట్టాయి.
దీంతో ప్రజలలో ఆయన పాలనా తీరు పట్ల వ్యతిరేకత వ్యక్తమౌతుంటే.. పార్టీలో ఆయన నిరంకుశ శైలి పట్ల వ్యతిరేకత ప్రబలుతోంది. ముందు ముందు ఈ వ్యతిరేకత మరింత పెచ్చరిల్లే ప్రమాదం ఉందంటున్నారు. బలగం సినిమాలో కుటుంబ పెద్ద అల్లుడిని కొడుకులు అవమానిస్తుంటే అడ్డుకోలేక కుటుంబ చీలికకు కారణమైతే.. వైసీపీలో జగన్ తానే స్వయంగా అయిన వారిని అవమానాల పాలు చేస్తూ పార్టీలో ముసలానికి కారణమౌతున్నారని పరిశీలకులు విమర్శిస్తున్నారు.