పిలిచిన పేరంటానికే రానివ్వలేదు
posted on May 6, 2023 @ 2:08PM
బీఆర్ఎస్ ప్రభుత్వం సచివాలయంలో తమకు నచ్చని వారికి ఎంట్రీ ఇవ్వదల్చుకోలేదా? మొన్న ప్రారంభోత్సవంలో తెలుగు మీడియాను గేట్ బయటకు గెంటేసిన కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వాళ ప్రజాస్వామ్య వ్యవస్థలో మరో పిల్లర్ ను అవమానించింది. బీఆర్ఎస్ మంత్రివర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్న తలసాని ఆహ్వానం మేరకు సచివాలయానికి వచ్చిన ఎమ్మెల్యే రాజాసింగ్ ను గేట్ బయటే ఆపేసి అవమానించింది బీఆర్ఎస్ ప్రభుత్వం.
తెలంగాణ ప్రభుత్వం భారీ ఖర్చుతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయంలో సామాన్యులతో పాటు ప్రజా ప్రతినిధులకు కూడా ఎంట్రీ లేదన్న విమర్శలు పెరిగిపోతున్నాయి. కొన్ని రోజుల కిందట ఎంపీ రేవంత్ రెడ్డిని సచివాలయంలోకి వెళ్లకుండా పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. తాజాగా బీజేపీ బహిష్కృత నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు అలాంటి చేదు అనుభవమే ఎదురైంది.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో సచివాలయంలో గ్రేటర్ ప్రజాప్రతినిధులతో శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే రాజాసింగ్కు కూడా ఆహ్వానం పంపారు. బుల్లెట్ పై వచ్చిన రాజా సింగ్ ను భద్రతా సిబ్బంది లోపలికి అనుమతించలేదు. మీటింగ్ అని చెప్పి తనను ఆహ్వానించి, లోపలికి అనుమతించకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఎమ్మెల్యేలు కూడా సచివాలయంలోనికి రాకూడదా అంటూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిసేపు అక్కడే వేచి ఉండి, రాజాసింగ్ తిరిగొచ్చేశారు. అయితే, తాము ఆహ్వానం పంపినప్పటికీ రాజాసింగ్ గేటు వరకు వచ్చి వెళ్లిపోయారని మంత్రి తలసాని పేషీ ప్రకటించినట్టు తెలుస్తోంది.విద్వేష ప్రసంగ ఆరోపణపై ఎమ్మెల్యే రాజాసింగ్ ను బీజేపీ బహిష్కరించింది. ఇటీవలె తెలంగాణా బిజేపీ చీఫ్ బండి సంజయ్ ఇటీవలె రాజాసింగ్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. అసెంబ్లీ పట్టుమని ఆరు నెలలు కూడా లేవు. రాజాసింగ్ కు బిజేపీ టికెట్ ఇస్తుందో ఇవ్వదో తెలియదు. బిజేపీ నుంచి సస్పెండ్ అయిన రాజాసింగ్ ను పార్టీ ఆహ్వానించలేదు. రాజాసింగ్ అయోమయంలో పడిపోయారు. తన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ వేసుకుని పార్టీ టికెట్ కోసం టిడిపి తెలంగాణా చీఫ్ కాసాని ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. గోషామహల్ టికెట్ రాజాసింగ్ కే దక్కుతుందని ప్రచారం జరిగింది. అయితే కన్ ఫమ్ కాలేదు. ఆశావహులు ఎక్కువగానే ఉన్నారు. బీఆర్ఎస్ గోషామహల్ అభ్యర్థి నందకిషోర్ వ్యాస్ పేరు బలంగా వినిపిస్తోంది. ఇంతలో మంత్రి తలసాని మీటింగ్ అంటే రాజాసింగ్ అదే బుల్లెట్ మీద సచివాలయానికి వచ్చేశారు. ఏ శక్తులు అడ్డుకున్నాయో రాజాసింగ్ ను సెక్యురిటీ సిబ్బంది ఆపేశారు. రాజాసింగ్ అంటే ఆషామాషీ వ్యక్తి కాదు. నరేంద్రమోడీతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి. జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. మరి రాజాసింగ్ పిలిచిన పేరంటానికి వచ్చినప్పటికీ అడ్డుకుని అవమానించారు. ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవానికి వచ్చిన మీడియాను బీఆర్ ఎస్ అడ్డుకుంది. అసలు వారిని గేట్ లోనికి కూడా రాకుండా అవమానించారు. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. ఆహ్వానాన్నిమన్నించి వచ్చిన ప్రజాప్రతినిధికి వెల్ కమ్ చెప్పడం కూడా సంస్కారం. జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టిన బీఆర్ఎస్ కు సంస్కార క్లాసులు అవసరమేమో మరి.