మంత్రి రోజా కొత్త అవతారం!
posted on May 8, 2023 9:13AM
ఆర్కే రోజా.. తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. గతంలో వెండితెర మీద హీరోయిన్‌గా వెలుగు వెలిగినా.. నిన్న మొన్నటి వరకు బుల్లితెర మీద క్యామెడీ షోల్లో న్యాయ నిర్ణేతగా మార్కులేసినా.. అలాగే రియాల్టీ షోల్లో జడ్డిలాగా లేడీ పెదరాయుడిలా తీర్పులు చెప్పినా.. మంత్రి పదవి రావడంతో.. వాటన్నింటికి ఆమె ఫుల్ స్టాప్ పెట్టేశారు. అయితే ప్రస్తుతం జగన్ కేబినెట్‌లో పర్యాటక శాఖ మంత్రిగా ఆమె కొనసాగుతున్నారు.
ఆ క్రమంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగనపై కానీ, పార్టీపై కానీ ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎవరు... ఏమైనా చిన్న పాటి విమర్శ చేసినా రోజా ఇలా రంగంలోకి దిగి.. అలా రంగు పడుద్ది అన్నట్లుగా వార్నింగ్‌లు ఇచ్చేస్తున్నారు. ఆ విషయంలో ఎవరినైనా.. ఎవరికైనా సరే... నో మినహాయింపు అన్నట్లుగా రెచ్చిపోతున్నారు. ఇటీవల ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబును ఆల్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ పొగడ్తలతో ముంచెత్తారు. అంతే జగన్ కేబినెట్‌లోని మంత్రులు, మాజీలు రంగంలోకి దిగేశారు. వారిలో రోజా కూడా ఉన్నారు. అలా రజినీ కాంత్‌పై విమర్శలు గుప్పించారు.
అయితే జగన్ ప్రభుత్వం ఇటీవల మా నమ్మకం నువ్వే జగన్ అన్న స్టిక్కర్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆ క్రమంలో పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు అంతా పాల్గొంటున్నారు. మంత్రి రోజా సైతం.. భుజానికి సంచి తగిలించుకొని వెళ్తున్న ఓ వీడియో.. ఆ వీడియోలో వస్తున్న వ్యాఖ్యానం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వారు రోజా స్టైల్ పై సెటైర్లు వేస్తున్నారు. యిది ఆమె కొత్త అవతారమా అని జోకులు పేలుస్తున్నారు.
ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలువడం అంత వీజీ కాదు కానీ.. భుజాన సంచితో కొత్త వ్యాపారం చాలా బాగుందమ్మా అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేస్తే.. ఎంతైనా ఎక్స్ పీరియన్స్ .. ఆ మాత్రం విక్రయాలు చేయాలంటే.. జనంలోకి వెళ్లాల్సిందే.. తప్పదంటూ మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. వెండితెరమీద, బుల్లితెర మీద వచ్చిన పారితోషకం, మంత్రిగా వచ్చిన జీత భత్యాల సంగతేమో కానీ.. ఇలా ప్రజల్లోకి వెళ్లడం ఏదైతే ఉందో.. అది మాత్రం అదిరిపోయిందంటూ సామాజిక మాధ్యమంలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
వచ్చే ఎన్నికల్లో రోజా గెలుపు నల్లేరు మీద నడక ఎంతమాత్రమూ కాదనీ, ఇప్పటికే నియోజకవర్గంలో ఆమెపై తీవ్ర వ్యతిరేకత ఉందని.. అలాంటి సమయంలో ప్రముఖ నటుడు రజినీ కాంత్‌పై రోజా ఆరోపణలు గుప్పించడంతో.. తమిళ ఓటర్లు సైతం రోజాకు బాగా దూరం జరిగారని.. ఈ నేపథ్యంలో ఆమెకు విజయావకాశాలు లేవని నెటిజన్లు పేర్కొంటున్నారు.
అయినా పర్యాటక శాఖ మంత్రిగా రాష్ట్రానికి ఏమైనా కొత్త ప్రాజెక్ట్‌లు ఏమైనా తీసుకొచ్చారా? మంత్రిగా దేవాలయాల సందర్శనతోపాటు.. విపక్షాలపై నోరు పారేసుకోవడం మీనహా మీరు చేసిందేముందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంకొకరు అయితే కొత్త బ్యాగ్, కొత్త స్టిక్కర్... అంటూనే అంతా కొత్తదనం అంటూ కామెంట్ చేస్తున్నారు.