కర్ణాటక బిజేపీ బాటలో ..
posted on May 6, 2023 @ 5:34PM
కర్ణాటకలో కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోను అక్కడి బిజేపీ నేతలు తీవ్రంగా విమర్శించారు. తాము అధికారంలో వస్తే భజరంగ్ దళ్ ను నిషేధిస్తామని మేనిఫెస్టో పేర్కొనడం బీజేపీ నేతలకు మింగుడు పడడం లేదు. హిందువుల వోట్లను పొందడానికి భజరంగ్ దళ్ బిజేపీకి తన వంతు సహకారం అందిస్తోంది. కాబట్టి కర్ణాటక బిజేపీ నేతలు ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రేస్ మేనిఫెస్టోను చించేస్తే తెలంగాణా బిజేపీ చీఫ్ బండి సంజయ్ భజరంగ్ దళ్ బాటలో ముందుకెళుతున్నారు.
ఈ నెల 14 న కరీంనగర్ లో హిందూ ఏక్తా యాత్రను నిర్వహించనున్నట్లు టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడించారు. అయితే హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న ఈ యాత్రలో లక్షలాది మంది పాల్గొంటారని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని బీజేపీ శ్రేణులతో పాటు ఆ పార్టీకి చెందిన కీలక నేతలు కూడా ఈ యాత్రలో పాల్గొంటారని ఆయన వెల్లడించారు.
ఈ యాత్ర హిందువుల ఐక్యతను చాటి చెబుతుందన్న ఆయన హిందూ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న వారందరూ హిందూ ఏక్తా యాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాగా ఈ యాత్రలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తో పాటు తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఇంకా ప్రముఖ నేతలు పాల్గొననున్నారని సమాచారం. అయితే ఈ యాత్రపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తాయి.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ కావాలనే మత ప్రాతిపదికన ఓట్లను చీల్చేందుకు చేస్తున్న మరో ప్రయత్నమే ఈ యాత్ర అని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఓటు బ్యాంకును బలోపేతం చేసుకోవడానికేనని భావిస్తున్నారు. మరో వైపు రాజకీయంగా క్యాష్ చేసుకునేందుకే ఆ పార్టీ వివాదాస్పద అంశాలను లేవనెత్తుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ క్రమంలోనే చేవెళ్ల సభలో అమిత్ షా ముస్లిం రిజర్వేషన్లపై అలా మాట్లాడారని.. ఇప్పుడు కర్ణాటకలో బజరంగ్ దళ్ పై నిషేధం విధిస్తామని ప్రకటిస్తే.. ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండి పడుతున్నారు. బీజేపీ మాత్రం రాష్ట్రంలో అధికారాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని ప్రత్యేక ప్రణాళికతో ముందుకు పోతుంది. ప్రతి నెలా పలువురు కేంద్ర బీజేపీ నేతలను, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను బహిరంగ సభలు, ఇతర కార్యక్రమాలకు తీసుకొని రావాలని తెలంగాణా బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది.