మూడు ప్రశ్నలు.. సమాధానం చెబితే మూడు లక్షలు!
posted on Jun 27, 2023 @ 5:34PM
ఒక ప్రశ్నకు జవాబు చెప్పండి.. లక్ష రూపాయిలు తీసుకెళ్లండి.. రెండో ప్రశ్నకు జవాబు చెప్పండి.. ఇంకో లక్ష రూపాయిలు తీసుకెళ్లండి.. ముచ్చటగా మూడో ప్రశ్నకు సమాధానం చెప్పండి.. మరో లక్ష రూపాయిలు ముచ్చట పడుతూ తీసుకెళ్లండి.. ముచ్చటగా మూడు ప్రశ్నలకు ఇలా సమాధానం చెప్పి.. అలా మూడు లక్షల రూపాయిలు తీసుకు వెళ్లండంటూ... ఓ వార్తా కథనం అయితే అటు మీడియలో ఇటు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.
అయితే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పి.. లక్షాధికారి అయిపోవాలంటూ చిన్న పిల్లల నుంచి విషయ పరిజ్జానం కలిగిన మేధావులు వరకు అందరూ రంగంలోకి దిగి.. ఏమా ప్రశ్నలు.. ఏమా మూడు లక్షల రూపాయిలంటూ వాయువేగంతో ఆరా తీయడం.. అంతే వేగంతో డల్‌గా.. డైలామాలో పడిపోతుడడం మహా విశేషం. ఇంతకీ ఆబాలగోపాలాన్ని ఓ రేంజ్‌లో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఈ మూడు ప్రశ్నలు ఏమిటంటే 1) ఇంతకీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ? 2) పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎప్పటికీ పూర్తి అవుతుంది? 3) ప్రైవేటీకరణ నుంచి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను రక్షించేవారు ఎవరు?
అయితే ఈ మూడు ప్రశ్నలు చూసి.. ప్రపంచంలోని ప్రతీ తెలుగు వాడు అవాక్కయిపోతుండడం గమనార్హం. ఈ ప్రశ్నలు చూడాడానికి చాలా సింపిల్‌గా ఉన్నా.. చెప్పటానికి సాధ్యం కాని బేతాళ ప్రశ్నలుగా ఉన్నాయనే ఓ చర్చ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ మూడు ప్రశ్నలను సంధించింది జన జాగరణ సమితి.
రాష్ట్ర విజభన జరిగి తొమ్మిదేళ్లు అయినా.. నేటికి రాష్ట్రానికి రాజధాని లేకపోవడం.. అలాగే ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం సైతం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా అయిపోవడం.. అదే విధంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ పోరాటాలతో.. ప్రాణ త్యాగాలతో.. సాధించుకొన్న విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ.. ప్రైవేటీకరణ కార్యక్రమం వాయువేగంతో జరిగిపోతుండడం.. ఇలా విభజనతో తీవ్ర అన్యాయమై పోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. మళ్లీ ఈ విధంగా వరస దెబ్బలతో విలవిల్లాడిపోతుండడంతో.. విశాఖపట్నం నగరానికి చెందిన ప్రజా సంఘం జన జాగరణ సమితి.. తనదైన శైలిలో ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఈ ప్రశ్నలు సంధించింది.
ఇక 2014లో రాష్ట్ర విభజన జరిగింది. ఆ సమయంలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్రమంలో నవ్యంధ్రకు రాజధాని అమరావతి అని ప్రకటించారు. అందులో భాగంగా రాజధాని కోసం తూళ్లూరు, వెలగపూడి తదితర 29 గ్రామాలకు చెందిన రైతుల నుంచి వ్యవసాయ భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా స్వచ్ఛందంగా సేకరించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం సోమవారం ను పోలవారంగా మార్చి.. దాదాపు 70 శాతం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చంద్రబాబు హయాంలోనే పూర్తి చేశారు. అయితే అప్పటి ప్రతిపక్ష నాయకుడు,వైసీపీ అధినేత జగన్.. అసెంబ్లీ సాక్షిగా రాజధాని అమరావతికి మద్దతు ప్రకటించారు.
అయితే 2019 అసెంబ్లీ ఎన్నికలు రానే వచ్చాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయ ఢంకా మోగించడంతో... ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కారు. అధికార వికేంద్రీకరణ పేరుతో నవ్యంధ్రకు మూడు రాజధానులు ఉండాలంటూ.. అందులో ఒకటి న్యాయ రాజధానిగా కర్నూలు, కార్యనిర్వహాక రాజధానిగా విశాఖపట్నం, ఇక శాసన రాజధానిగా అమరావతి ఉండాలని ఆయన ప్రకటించారు.
ఇక పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని.. రివర్స్ టెండరింగ్‌లో భాగంగా.. మరో కాంట్రాక్టర్‌కి కట్టెబెట్టిందీ జగన్ ప్రభుత్వం. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఎంతవరకు వచ్చిందంటే.. రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి గారు సైతం చెప్పలేని దుస్థితి నెలకొంది. అలాంటి వేళ రాష్ట్ర పరిస్థితిపై తీవ్ర ఆందోళన చెందుతూ.. విశాఖపట్నానికి చెందిన ప్రజా సంఘం జన జాగరణ సంస్థ.. ఈ మూడు ప్రశ్నలకు ప్రజలకు సంధించింది.
మరోవైపు క్విజ్ పోటీల్లో గెలిచిన విజేతలకు ప్రముఖులు రాసిన పుస్తకాలో.. పార్కర్ పెన్నులో వగైరా వగైరా బహుమతులుగా నిర్వాహకులు అందజేస్తూ ఉంటారని... కానీ ఒక ప్రశ్నకు సమాధానం చెబితే.. లక్ష రూపాయిలు ఇస్తామనే వాళ్లు మాత్రం చాలా అరుదుగా ఉంటారని.. అలా ప్రకటిస్తే అయినా ప్రజల్లో ఓ విధమైన ఆలోచన కలుగుతోందేమోనని.. దీంతో వారి ఆలోచన తీరు మారీ.. అభివృద్ధి, దార్శనికత, నీతి, నిజాయితీ కలిగిన నేతలకు ఓటు వేసి.. వచ్చే ఎన్నికల్లో వారిని గెలిపించడం ద్వారా రాష్ట్రం ప్రగతి పథంలో పయినిస్తుందనే ఉద్దేశంతో.. ఈ ఆలోచన చేసినట్లుగా ఉందనే ఓ చర్చ సైతం ప్రజాస్వామిక వాదుల్లో నడుస్తోంది. అదీకాక.. ఈ మూడు లక్షలు కొట్టేసే ఒకే ఒక్క మొనగాడు ఎవరు..? లేకుంటే ఒక్కో ప్రశ్నకు జవాబు చెప్పి విడి విడిగా లక్ష చొప్పున కొట్టేసే మొనగాళ్లు ఎవరు అనే చర్చ సైతం అటు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు.. ఆ మొనగాడు ఎక్కడా.. ఎవరా అని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.