SPEED NEWS 2
posted on Jun 27, 2023 @ 4:11PM
1. ఉప్పల్ చౌరస్తాలో స్కై వాక్ అందుబాటులోకి వచ్చింది. పాతిక కోట్లతో నిర్మించిన ఈ స్కై వాక్ ను మంత్రి కేటీఆర్ నిన్న ప్రారంభించారు. అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ చౌరస్తా వద్ద రోడ్డు దాటేందుకు పాదచారులకు ఈ స్కైవాక్ ఎంతగానో దోహదపడుతుంది.
2. హైదరాబాద్ నగరంలో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
3. బహుళజాతి వ్యాపార దిగ్గజం లులు తెలంగాణ రాష్ట్రంలో 3వేల 500 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. బియ్యం సేకరణ, ఫిష్, మీట్ ప్రాసెసింగ్ సెంటర్ల ఏర్పటుతో పాటు వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించనున్నట్లు పేర్కొంది.
4. ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని తెలంగాణ సర్కార్ కనీస వేతన చట్టం పరిధిలోనికి తీసుకువచ్చింది. దీంతో ఈ రంగంలో పని చేసే ఉద్యోగులు, కార్మికులకు ఇక నుంచి కనీస వేతన చట్టం పరిధిలోకి వస్తారు. ఈ మేరకు కార్మిక, ఉపాధి కల్పన శాఖ ఉత్తర్వ్యులు జారీ చేసింది.
5. ధరణి పోర్టల్ విషయంలో బీజేపీ పూటకో మాట చెబుతోందని మంత్రి హరీష్ రావు అన్నారు. ధరణి విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని బీజేపీ అధ్యక్షుడు నడ్డా ప్రకటించడాన్ని తప్పుపట్టారు.
6.పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు అటవీ ఉత్పత్తులు దోహదపడతాయని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అధ్యయనం వెల్లడించింది. పశ్చిమబెంగాల్ ఆదివాసీలు అధికంగా ఉండే ప్రాంతాలలో ఆదివాసీ మహిళల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించడంలో అటవీ ఉత్పత్తులు దోహదం చేశాయని ఆ అధ్యయనం వెల్లడించింది.
7.తిరుమలలో టీకప్పుపై శిలువ గుర్తు కలకలం రేపింది. ఆ కప్పుపై టి అక్షరాన్ని శిలువగుర్తుగా ముద్రించడం వివాదానికి దారి తీసింది. భక్తుల ఫిర్యాదు మేరకు టీటీడీ అధికారులు తిరుమలలో టీ దుకాణాలలో తనిఖీలు నిర్వహించి ఓ దుకాణాన్ని సీజ్ చేశారు.
8. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను ఖతం చేస్తామంటూ గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్ హెచ్చరించాడు. కెనడాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన గోల్డీబ్రార్ ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటుడు సల్మాన్ తన హిట్ లిస్ట్ లో ఉన్నట్లు పేర్కొన్నాడు.
9.అధిక పెన్షన్ దరఖాస్తు గడువును వచ్చే నెల 11 వరకూ పొడిగిస్తూ ఈపీఎఫ్ వో నిర్ణయం తీసుకుంది. ఈ దరఖాస్తు గడువును పొడగించడం ఇది మూడో సారి. ఇదే చివరి అవకాశమని ఈపీఎప్ వో సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
10. మణిపూర్ లో జరుగుతున్న హింసాకాండపై ప్రధాని మోడీ మౌనం వీడాలని కాంగ్రెస్ అధ్యక్షడు మల్లి కార్జున్ ఖర్గే అన్నారు. అలాగే హింసాకాండను అదుపుచేయడంలో విఫలమైన మణిపూర్ సీఎం బిరేన్ సింగ్ ను తొలగించాలని డిమాండ్ చేశారు.