వైసీపీ నుంచి కౌంటర్లు కరువు.. తత్వం బోధపడిందా?!
posted on Jun 27, 2023 @ 10:04AM
ఆ మధ్య విజయవాడ శివారు పోరంకిలోని అనుమోలు గార్డెన్స్ లో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిధిగా సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరై ఎన్టీఆర్ కుటుంబం, చంద్రబాబుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మంచితనం, కష్టపడే తత్వం, ఆయన ఛరిష్మా గురించి నాలుగు ముక్కలు మాట్లాడారు. అంతే మంత్రుల నుండి వైసీపీ ఎమ్మెల్యేల వరకు అందరూ రజనీకాంత్ ను టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు చేశారు. కొడాలి నాని, మంత్రి రోజా లాంటి వాళ్ళైతే అసలు రజనీకాంత్ అనే వ్యక్తి తమిళనాడులో సూపర్ స్టార్ ఏమో కానీ.. ఏపీలో మాత్రం జీరో అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో రజని అభిమానులు వైసీపీ నేతలను ఓ రేంజిలో ఆట ఆడేసుకున్నారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి ఊసే లేకుండా చంద్రబాబు మంచోడు, కష్టజీవి అని మాట్లాడినా అంతగా రెచ్చిపోయి విమర్శలు చేసిన ఆ బ్యాచ్ అంతా.. ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డిపై రోజూ పనిగట్టుకొని విమర్శలు చేస్తున్నా రివర్స్ కౌంటర్లు కరువయ్యాయి. దీంతో ఏపీ రాజకీయాలలో ఇప్పుడు ఇదే చర్చ మొదలైంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాను చేపట్టిన వారాహీ యాత్రలో జగన్ మోహన్ రెడ్డిపైనా, ఆయన ప్రభుత్వ పాలనపైనా రోజూ విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూనే.. మంత్రుల నుండి ఎమ్మెల్యేల వరకూ పేరు పేరునా పవన్ కడిగి పారేస్తున్నారు. అయినా వైసీపీ నేతల నుండి కౌంటర్ రెస్పాన్స్ రావడం లేదు.
పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపైనే నేరుగా విమర్శలు చేస్తున్నారు. ఏ నియోజకవర్గానికి వెళ్తే అక్కడి ఇష్యూస్ పై ఆయన లేవనెత్తే అంశాలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. అయినా, వైసీపీ నుంచి కౌంటర్లు కరవవుతున్నాయి. గతంలో ఇలా పవన్ ఏదైనా అంటే వైసీపీ నేతలు పవన్ పర్సనల్ లైఫ్ మీద కూడా విమర్శలు చేసే వాళ్ళు. కానీ ఇప్పుడు కనీసం ఆయన లేవనెత్తిన అంశంపై కూడా వైసీపీ నుండి సమాధానం రావడం లేదు. కనీసం వచ్చే ఎన్నికలలో టికెట్లు ఆశించే నేతలు కూడా పవన్ విమర్శలపై స్పందించడం లేదు. పైగా, టెక్నికల్‌గా వైసీపీకి బయట ఉన్న ముద్రగడ పద్మనాభం లాంటి పాత కాపును పవన్‌పై ప్రయోగిస్తున్నారు.
దీంతో పవన్ పై వైసీపీ మౌనం వెనక ఏదైనా వ్యూహం ఉందా? లేక తత్వం బోధపడిందా? అని చర్చలు జరుగుతున్నాయి. పవన్ విషయంలో వైసీపీ నేతలంతా ఆచితూచి మాట్లాడుతున్నారు. లేదంటే మౌనంగానే ఉండిపోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉండడం.. పవన్ కొత్త ఊపుతో ఉండడంతో పవన్ పై వ్యక్తిగత దాడి చేసి మరింత వ్యతిరేకత మూటగట్టుకోవడం ఎందుకనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తుంది.
ఒకరిద్దరు మినహా వైసీపీ నేతలంతా సైలెంట్ అయిపోయారు. ఆఖరికి పవన్ పై దాడికి వైసీపీ బాగా వాడుకున్న అంబటి లాంటి వాళ్ళు కూడా నోరు మెదపడం లేదు. దీంతో సొంత పార్టీలో నేతలు విమర్శలు చేసి విమర్శలపాలై సినీ అభిమానులను, కాపు సామజిక ఓటర్లను దూరం చేసుకొనే ఉద్దేశ్యాన్ని వెనక్కి తీసుకొని ఆ స్థానంలో పవన్ పై నెగటివ్ ప్రచారం స్ప్రెడ్ చేసేందుకు ముద్రగడ లాంటి వాళ్ళని ఉపయోగించుకుంటున్నట్లుగా కనిపిస్తుంది.