టీడీపీ జనసేనకు ఇచ్చే సీట్లివేనా?
posted on Jun 27, 2023 @ 10:43AM
ఏపీలో ప్రతిపక్షాల పొత్తు దాదాపుగా ఖరారైంది. తానే సీఎం అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కాస్త ఈ అంశంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినా ఆయన మనసులో ఉన్నది మాత్రం టీడీపీతో పొత్తుగా ఎన్నికలకు వెళ్లడమే. ఇదే విషయాన్ని ఆయన రెండేళ్లుగా చెప్తూనే ఉన్నారు. ఇప్పుడూ అదే మాట చెప్తున్నారు. అయితే, ఇప్పటికే బీజేపీతో జనసేన పొత్తులో ఉండగా.. ఇద్దరూ టీడీపీతో కలిసి వెళ్తారా అనే అంశంలో కాస్త క్లారిటీ రావాల్సి ఉంది. ఏది ఏమైనా ఈసారి ఎన్నికలకు పొత్తులు ఖరారైనట్లే కనిపిస్తుంది. పొత్తులు మాత్రమే కాదు జనసేనకు టీడీపీ కేటాయించే సీట్లు కూడా ఇవే అంటూ రెండు పార్టీలతో పాటు రాజకీయ వర్గాలలో కూడా ప్రచారం జరుగుతుంది. దానికి కారణం జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహీ యాత్ర రూట్ మ్యాప్. పొత్తులో జనసేనకి కేటాయించే సీట్లలోనే ప్రస్తుతం పవన్ యాత్ర కొనసాగిస్తున్నట్లు కనిపిస్తుంది.
టీడీపీ-జనసేన పొత్తులలో జనసేనకి 25 నుండి 30 స్థానాలను కేటాయించే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాల సమాచారం కాగా బీజేపీ కూడా కలిసి వస్తే దానిని బట్టి ఈ సంఖ్య ఖరారు అయ్యే ఛాన్స్ ఉంటుంది. బీజేపీ పొత్తులో ఉంటే ఐదు స్థానాలను కేటాయించే అవకాశం ఉండగా జనసేనకి 25 స్థానాలను కేటాయిచనున్నారు. ఇక పొత్తులో ప్రధాన పార్టీ టీడీపీ ఎటు తిరిగి 140 స్థానాలకు పైగా పోటీ చేయాలని నిర్ణయించుకోగా.. ఈ 140 స్థానాలలో కూడా అధికారాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ పైనే స్థానాలను గెలుచుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. తాము 88 స్థానాలపైనే విజయం సాధిస్తామని టీడీపీ నేతలు బాహాటకంగానే చెప్పుకుంటున్నారు.
ఇక, జనసేనకి కేటాయించే సీట్ల విషయానికి వస్తే కాపు సామజిక వర్గం అధికంగా ఉండే ప్రాంతాలలో ఎక్కువ శాతం సీట్లను కేటాయించనున్నారు. వీటిలో ఉత్తరాంధ్ర నుండి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఒక్కో స్థానంతో పాటు విశాఖలో రెండు స్థానాలను కేటాయించనున్నారు. విశాఖ జిల్లాలో చూస్తే గాజువాక, మాడుగుల స్థానాలలో జనసేన ఇప్పటికే ప్రచారం కూడా మొదలు పెట్టింది. ఇక, ఉభయ గోదావరి జిల్లాలలో ఎక్కువ శాతం స్థానాలను జనసేన దక్కించుకునే అవకాశం ఉంది. ఈ జిల్లాలలో పిఠాపురం, కాకినాడ రూరల్, పి.గన్నవరం, రాజోలు, అమలాపురం, నర్సాపురం, తాడేపల్లి గూడెం, భీమవరం, నిడదవోలు జనసేనకు దక్కనున్నట్లు అంచనా వేస్తున్నారు.
ఇక మిగతా రాష్ట్రానికి వస్తే.. కోస్తా ప్రాంతంలో కృష్ణా జిల్లా అవనిగడ్డ, పెడన, కైకలూరు, విజయవాడ వెస్ట్ సీట్లు జనసేనకే ఇచ్చేందుకు టీడీపీ సిద్ధమైందని చెప్తున్నారు. అలాగే గుంటూరు జిల్లాలో తెనాలి, గుంటూరు పశ్చిమ సీట్లను జనసేన కోరుతుండగా టీడీపీ ఈ స్థానాలలో ఇంకా తేల్చుకోలేకపోతుంది. అయితే, ప్రత్తిపాడు సీటు జనసేనకు ఇచ్చేందుకు సిద్ధమైంది. అలాగే ప్రకాశం జిల్లా నుండి దర్శి, నెల్లూరు నుండి నెల్లూరు సిటీ, చిత్తూరు జిల్లా నుండి తిరుపతి, కడప నుండి రాజంపేట సీట్లను కూడా జనసేన దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.
ఇవి కాకుండా మరో నాలుగైదు స్థానాలను కూడా జనసేన పట్టుబడుతోండగా.. ఆయా స్థానాలను టీడీపీ వదులుకునేందుకు తటపటాయిస్తుంది. మొత్తంగా రెండు పార్టీల మధ్య 25 నుండి 30 స్థానాలకు అంగీకారం కుదిరినట్లు తెలుస్తుంది. ఈ అసెంబ్లీ స్థానాలతో పాటు మూడు ఎంపీ సీట్లు కూడా జనసేనకి ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిందని అంటున్నారు. జనసేనకి కేటాయించిన ఎంపీ స్థానాలు కాకినాడ, నర్సాపురం, మచిలీపట్నంగా తెలుస్తుంది.