మోడీ టార్గెట్ కవిత!
posted on Jun 28, 2023 @ 10:22AM
ప్రధాని నరేంద్రమోడీ మరో సారి అవినీతికి వ్యతిరేకంగా గళమెత్తారు. ఆయన భోపాల్ లో చేసిన ప్రసంగం మొత్తం విపక్షాలే అవినీతికి పాల్పడుతున్నాయని ఎలుగెత్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత విషయాన్నీ ప్రస్తావించారు. తమ ప్రభుత్వంలో మంత్రులు, పార్టీ నేతలూ మాత్రం పులికడిగిన ముత్యాలని చెప్పుకొచ్చారు. ఆయన ప్రసంగ సారాంశమేమిటంటే.. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారంతా అవినీతి పరులేనని, అలాంటి వారెవరైనా బీజేపీలో చేరితే వారి పాపాలూ, అవినీతి అక్రమాలన్నీ.. గంగలో మునిగితే పాపాలు పోయినట్లు మాయమైపోయి పునీతులౌతారని అన్నట్లుగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ ఆవల తొలి సారిగా బీఆర్ఎస్ అధినేత కుమార్తె కల్వకుంట్ల కవిత మద్యం కుంభకోణంలో ఎదుర్కొంటున్న ఆరోపణలను ప్రస్తావించారు. ఈడీ, సీబీఐ నజర్ లో ఉన్న సంగతి ఎత్తి చూపారు. అంతే కాదు తెలంగాణలో అవినీతి, కుటుంబ పాలన కొనసాగాలని కోరుకునే వారు మాత్రమే బీఆర్ఎస్ కు ఓటు వేయాలనీ, స్వచ్ఛమైన, అవినీతి రహిత పాలన కావాలనుకుంటే బీజేపీకి ఓటేయండి అని పిలుపు నిచ్చారు. మోడీ భోపాల్ పర్యటన వందేభారత్ ఎక్స్ ప్రెస్ ల ప్రారంభం కోసం.. సరే ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీకి కూడా ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్నాయి. మోడీ ఆ రాష్ట్రంలో సమస్యలు, అక్కడి రాజకీయాల గురించి ప్రస్తావిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదు. కానీ మధ్యప్రదేశ్ గడ్డ మీద నుంచి ఆయన తెలంగాణలో అవినీతి సర్కార్ అంటూ ఆక్షేపించారు.
ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తెపై కేసుల గురించీ, ఆరోపణల గురించీ కూడా చెప్పారు. అక్కడ నుంచి తెలంగాణ ప్రజలను బీజేపీకి ఓటేయాల్సిందిగా కోరారు. సరే ఆవిషయాన్ని కాసేపు పక్కన పెడితే.. ప్రధాని మోడీ గంపగుత్తగా విపక్ష పార్టీలన్నీ అవినీతి పార్టీలే అని ప్రకటించేసి... బీజేపీకి క్లీన్ చిట్ ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న వారిని బీజేపీలో చేర్చుకుని వారికి క్లీన్ చిట్ ఇవ్వడం ద్వారా కమలం పార్టీ మొత్తం అవినీతి రహిత పార్టీ అని ప్రధాని ఎలా సర్టిఫికెట్ ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలకు విపక్ష నేతలపై దర్యాప్తు చేయడం వినా మరో పని లేకుండా పోయిన పరిస్థితి ఏర్పడిందని పరిశీలకులు అంటున్నారు. సంక్షేమం పేరుతో విపక్షాలు అవినీతికి గ్యారంటీ ఇస్తుంటే.. తాను, తన సర్కార్ మాత్రం అవినీతి పరులకు శిక్షలు వేయించడానికి గ్యారంటీ ఇస్తున్నట్లు ఘనంగా ప్రకటించుకున్నారు. ఇక్కడే అవినీతి ఆరోపణలకు ఎదుర్కొంటూ బీజేపీ గూటికి చేరి హఠాత్తుగా పునీతులైపోయిన నేతల గురించి మోడీ ఏం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన సొంత నేతల్నే జైలుకు పంపిన రికార్డు ఉంది కానీ.. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం సొంత పార్టీ నేతల అవినీతిని పట్టించుకోవడం లేదు. అంతే కాదు అలా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుటన్నవారు కమలం గూటికి చేరగానే క్లీన్ చిట్ ఇచ్చేస్తున్నది. గతంలో కాంగ్రెస్ హయాంలో కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలపై అధికార పార్టీ ఆదేశాల మేరకు పని చేస్తున్నదన్న ఆరోపణలు ఉన్నాయి. సాక్షాత్తూ సుప్రీం కోర్టే గతంలో సీబీఐని పంజరంలో చిలుకగా అభివర్ణించింది. ఇప్పుడు మోడీ హయాంలో అయితే కేంద్ర దర్యాప్తు సంస్థలు మరబొమ్మలుగా మారిపోయాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం కీ ఇస్తే కదులుతున్నాయి. లేకపోతే ఆగిపోతున్నాయి. మోడీ భోపాల్ వేదికగా ప్రస్తావించిన కల్వకుంట్ల కవిత వ్యవహారమే తీసుకుంటే.. కేసీఆర్ కేంద్రం మీద విరుచుకుపడుతూ.. మోడీపై విమర్శలు గుప్పించినంత కాలం మద్యం కుంభకోణంలో కవిత విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు యమా స్పీడుగా వ్యవహరించాయి. ఇహనో, ఇప్పుడో కవిత అరెస్టు తథ్యం అనిపించేలా హడావుడి చేశాయి. హస్తినకు పిలిపించుకుని మరీ ఈడీ విచాణ చేసింది. ఆమె ఫోన్లను స్వాధీనం చేసుకుంది. పలువురిని అప్రూవర్లుగా మార్చి మరీ కవితను టార్గెట్ చేసింది.
ఎప్పుడైతే కేసీఆర్ కేంద్రంపై విమర్శలకు విరామం ప్రకటించారో.. ఆ వెంటనే కవిత విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు సైలెంట్ అయిపోయాయి. ఈ తొమ్మిదేళ్లుగా మోడీ సర్కార్ అవినీతినై ప్రకటించిన యుద్ధం అంతా ఇలానే సాగింది. గత ఎన్నికలకు ముందు అప్పటి తెలుగుదేశం నేతలు సుజనా చౌదరి, సీఎం రమేష్ లను దర్యాప్తు సంస్థలు ముప్పుతిప్పలు పెట్టాయి. ఎప్పుడైతే వారిరువురూ తెలుగుదేశం వీడి కమలం గూటికి చేరారో అప్పటి నుంచి వారిపై అవినీతి మరక లేదన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఇక మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు సంగతి ఎంత తక్కువ చెబితే అంత మంచిది.
అందుకే మోడీ అవినీతిపై పోరాటం అంటూ ఇస్తున్న నినాదాలను ప్రజలు విశ్వసించడం మానేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కర్నాటక ఫలితం ఇదే తెల్చి చెప్పిందని అంటున్నారు. విపక్షాల మీద విమర్శలు గుప్పించే మోడీ సర్కార్ కర్నాటకలో కమిషన్ల సర్కార్ అంటూ ఎదుర్కొన్న విమర్శల గురించి మాత్రం పన్నెత్తి మాట్లాడటం లేదెందుకని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.