కేసీఆర్‌కు గులాబీ ముళ్లు గుచ్చుకుంటున్నాయా?
posted on Jun 27, 2023 @ 2:47PM
తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికల నగరా మరికొద్ది నెలల్లో మోగనుంది. అందులోభాగంగా అన్ని పార్టీల నేతల్లో హడావుడి మొదలైంది. ఆ క్రమంలో అధికార బీఆర్ఎస్ నేతలు ఓ రేంజ్‌లో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు.
ఇప్పటికే వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ను ముచ్చటగా మూడోసారి కూడా అధికార పీఠం ఎక్కించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అయితే ఆ కంగారులో పార్టీ శ్రేణులు ఏం చేస్తున్నాయో వారికే అర్థం కానీ పరిస్థితి నెలకొందనే చర్చ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోమవారం (జూన్ 26) ఉప్పల్‌లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్కైవాక్‌ను ప్రారంభించారు.
అయితే కేటీఆర్ ఉప్పల్ వస్తున్న సందర్బంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ పరిశ్రమలు మరియు మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి స్వాగతం - సుస్వాగతం అంటూ ముద్రించారు. కాగా ఈ ఫ్లెక్సీలను సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ చేయడంతో.. ప్రజలతోపాటు గులాబీ పార్టీ శ్రేణులు సైతం ఒక్కసారిగా ఉలిక్కిపడి.. అవాక్కవుతోన్నాయి. సదరు శాఖల మంత్రి కేటీఆర్ అయితే కేసీఆర్ అని రాశారంటూ చర్చకు తెర తీశాయి.
ఆ ఫ్లెక్సీలను అటు ఉప్పల్‌లోని పార్టీ శ్రేణులు కానీ.. ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుబాష్ రెడ్డి కానీ.. స్థానిక మున్సిపల్ సిబ్బంది కానీ పట్టించుకోక పోవడం గమనార్హం. దీంతో దొరికిందే సందు అన్నట్లుగా నెటిజన్లు గులాబీ శ్రేణులపై సెటైర్లతో ఓ ఆటాడుకుంటున్నారు. కేబినెట్లో ఎంత మంది మంత్రులు ఉన్నా.. కేటీఆర్ ఒక్కరే అన్నట్లుగా అంతా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ అంటూ గొంతు చించుకోవడం కాదని.. నగరంలో సామాన్య ప్రజలు పడుతోన్న వెతలను గుర్తించాలని వారు కారు బీఆర్ఎస్ నేతలను ప్రశ్నిస్తున్నారు. మహానగరంలో రాత్రి పది గంటలు దాటితే.. పలు ప్రాంతాలకు కనీస బస్సు సౌకర్యం కూడా లేకపోవడంతో.. ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతోన్నారని అంటున్నారు.
ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత ఉన్న హైదరాబాద్ కంటే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న హైదరాబాద్ మహా నగరం బాగుందని అభిప్రాయపడుతోన్నారు. నగరంలో ట్రాపిక్ సమస్య నేటికీ తీరలేదని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. తమది ప్రజా ప్రభుత్వం.. ప్రజా ప్రభుత్వం అంటూ గొంతులు చించుకోవడం కాదని.. ప్రజలకు ఏం కావాలో తెలుసుకోని వాటిని అమల్లో ఉంచితే సరిపోతోందని నెటిజన్లు.. ఈ సందర్బ:గా గలాబీ నేతలకు చురకలంటిస్తున్నారు. అంతేకాదు.. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగానే కాదు.... ప్రభుత్వంలోని లోపాలను ఎవరైనా బహిరంగంగా విమర్శించినా.. వారిపై బలవంతంగా కేసులు నమోదు చేయించి.. తమ కసి తీర్చుకొనే సర్కార్‌కు ప్రజల గోడు ఏ మాత్రం పడుతుందనే సందేహాన్ని సైతం నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.