అవినాష్ నన్ను కొనేయాలని చూస్తున్నాడు!
posted on Jun 27, 2023 @ 4:54PM
మాజీ సీఎం రాజశేఖరరెడ్డి సోదరుడు, సీఎం జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న వివేకానందరెడ్డి హత్యకేసులో వైసీపీ ఎంపీ, జగన్ సోదరుడు అవినాష్ రెడ్డి పేరు గట్టిగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసినా బెయిల్ పై బయటపడ్డారు కానీ చేసిన పాపం మాత్రం ఇంకా వీడలేదు. డ్రైవర్ దస్తగిరి రూపంలో వెంటాడుతూనే ఉంది. ఈ కేసులో ఇప్పటికే సంచలన ఆరోపణలు చేసిన డ్రైవర్ దస్తగిరి తాజాగా మరోసారి అంతకి మించిన ఆరోపణలతో బయటకొచ్చారు. అది కూడా ఈ కేసులో కీలక సూత్రధారిగా చెప్పుకుంటున్న అవినాష్ రెడ్డి తనకు కొనేందుకు ప్రయత్నిస్తున్నారని.. తప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తున్నారని కూడా ఆరోపించాడు. దీంతో ఈ వ్యవహారం మరోసారి చర్చకు దారితీస్తుంది.
వివేకా హత్యకేసులో అప్రూవర్ గా మారిన తనను వైసీపీ ఎంపి అవినాష్ రెడ్డి అనుచరులు బెదిరిస్తున్నారని దస్తగిరి తెలిపాడు. ఇదే సమయంలో తనను ఏదో ఒక కేసులో ఇరికించి జైలుకు పంపించాలని అవినాష్ వర్గం కుట్ర పన్నుతున్నదని ఆరోపించాడు. పులివెందులలో ఓ పిల్లాడిని తాము నిర్బంధించి హింసించామంటూ తమపై తప్పుడు కేసులు పెట్టారని తెలిపాడు. ఈ మేరకు తన భార్య షబానాతో కలిసి కడప ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన దస్తగిరి.. పులివెందుల పోలీసులు తనపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆయనకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. ఈ కేసు గురించి సీబీఐ ఎస్పీకి కూడా సమాచారం అందించినట్లు చెప్పాడు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులపై దస్తగిరి కీలక వ్యాఖ్యలు చేశాడు.
వివేకా హత్యకేసులో తనను వారితో రాజీకి రావాలని వైసీపీ నేతలు రాయబారాలు పంపుతున్నారని వ్యాఖ్యానించిన దస్తగిరి.. పెద్ద మనుషుల సమక్షంలో రాజీ చేసుకొని డబ్బులు తీసుకెళ్లాలని కోరుతున్నట్లు చెప్పారు. అయితే, తాను చావడానికైనా సిద్ధం కానీ రాజీపడే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చాడు. వివేకా హత్య కేసులో ఒక్కొక్కరు అరెస్ట్ అవుతున్నారని చెప్పిన దస్తగిరి.. ఈ కేసులో దోషులందరికీ శిక్ష పడాల్సిందేనని కోరారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే సీబీఐ విచారణ నెమ్మదించేలా తెరవెనుక కొందరు ప్రయత్నించారని ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు వినిపిస్తుండగా, కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేస్తామని ఆ మధ్య ప్రకటించిన సీబీఐ ఇప్పుడు ఆయనను ప్రతి శనివారం విచారించి వదిలేయడం ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తుంది.
కాగా ఈ నెలాఖరుకల్లా ఈ కేసు ముగించాలని సుప్రీంకోర్టు ఇప్పటికే సీబీఐని ఆదేశించిన సంగతి తెలిసిందే. కానీ సీబీఐ వ్యవహారం చూస్తే మాత్రం ఈ నెల కాదు వచ్చే నెల కూడా కేసును తేల్చే సూచనలు కనిపించడం లేదు. దీంతో అసలు ఈ కేసులో దోషులకు శిక్ష పడుతుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. మరోవైపు అవినాష్ లాంటి వాళ్ళు బయటవుంటే ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేస్తారని, బెయిల్ రద్దు చేసి అవినాష్ ను అదుపులోకి తీసుకోవాలని వివేకా కుమార్తె సునీత కోర్టును కోరినా.. ఆ పిటిషన్ ను కోర్టు అత్యవసర విచారణకు తీసుకోలేదు. ఈలోగా సునీత అనుమానిస్తున్నట్లే అవినాష్ వర్గం తనను బెదిరిస్తున్నారని దస్తగిర్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఈ కేసు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో.. ఎప్పటికి తేలుతుందో చూడాలి.