నిన్నటి దాకా తెగడ్తలు.. ఇప్పుడు పొగడ్తలు వైసీపీ వ్యూహం మార్చిందా?
posted on Jun 28, 2023 @ 11:14AM
వైసీపీ ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ.. మరోసారి అధికారంలోకి రావడానికి సర్వశక్తులూ ఒడ్డుతోంది. కళ్లెదుట కనిపిస్తున్న ప్రజా, ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడానికి ఎదురీదుతోంది. ప్రజలను ఎలాగా ఆకట్టుకోలేం.. విపక్షాలను చీల్చి చెండాడితే చాలని భావిస్తోంది. విపక్షాల ఐక్యతకు గండి కొట్టడానికి ఎక్కడ లేని ఎత్తులూ వేస్తోంది. వ్యూహరచన పేరిట నేల విడిచి సాము చేస్తోంది.
అయినా గ్రాఫ్ పెరగడం లేదన్న ఆందోళన ఆ పార్టీలో పై నుంచి కింది వరకూ కనిపిస్తోంది. ఒక వైపు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనలు, మరో వైపు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలకు వస్తున్న జన స్పందన, ప్రభుత్వంపై, జగన్ పై, వైసీపీ నేతలపై వారు చేస్తున్న విమర్శలకు ప్రజల నుంచి వస్తున్న స్పందనతోనే ఖంగారు పడుతున్న వైసీపీకి జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి యాత్రతో కంగారు రెట్టింపైంది. పవన్ విమర్శలు, సూటి ప్రశ్నలతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి అరికాళ్ల కింద భూమి కదిలినట్లైంది. పవన్ పై వైసీపీ నేతలు రిటార్డ్ ఇవ్వడం.. దానికి జనసైనికుల నుంచి అంతకు రెట్టింపు తీవ్రతతో ప్రతి విమర్శలు రావడంతో పవన్ విషయంలో వైసీపీ వ్యూహం మార్చుకుంది.
పవన్ పై విమర్శలు కాదు.. పొగడ్తల ద్వారా ఆయన విమర్శల తీవ్రత తగ్గేలా చూసుకోవడం మేలని భావిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. అందుకే ఒక్కరొక్కరుగా వైసీపీ గెస్ట్ ఆర్టిస్టులు తెరపైకి వస్తున్నారు. పవన్ కల్యాణ్ చాలా మంచివాడని కితాబులిస్తున్నారు. ఆయన అమాయకుడనీ, తెలుగుదేశం అధినేత చంద్రబాబు ట్రాప్ లో పడి వాస్తవాలను గుర్తించడం లేదనీ మెత్తమెత్తగా మాట్లాడటం ప్రారంభించారు. పోసాని కృష్ణమురళి, లక్ష్మీ పార్వతి వంటి వారు మైకుల ముందుకు వచ్చి, మీడియా సమావేశాలు పెట్టి మరీ జనసేనాని పట్ల ఎక్కడ లేని సాఫ్ట్ కార్నర్ ప్రదర్శిస్తున్నారు.
నిన్న మొన్నటి వరకూ తన కెరీర్ ను పవన్ నాశనం చేశాడంటూ గొంతెత్తి అరచిన పోసాని కృష్ణ మురళి.. ఇప్పుడు ఆయన అమాయకుడంటూ మీడియా ముందుకు వచ్చారు. వాస్తవానికి పోసాని కృష్ణ మురళి కేవలం తమ పార్టీ అధినేత జగన్ కు అవసరమైనప్పుడు మాత్రమే మీడియా ముందుకు వస్తారు. ఒకటి రెండు రోజులు వరుస ప్రెస్ మీట్లతో హడావుడి చేసి ఆ తరువాత యధా ప్రకారం టీవీలలో రియాల్టీ షోలకు గెస్టుగానో, ఉంటే ఏదైనా షూటింగ్ లోనో పాల్గొంటూ తన మానాన తను తన పని చేసుకుంటుంటారు. ఇక లక్ష్మీ పార్వతి విషయానికి వస్తే ఆయన ఎప్పుడు ఎందుకు మాట్లాడతారో ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న వైసీపీకే కాదు ఆమెకు కూడా తెలియదని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతుంటాయి. ఇక అనుకోని విధంగా కాదు.. కాదు అనూహ్యంగా పోసాని, లక్ష్మీపార్వతిలకు పవన్ కల్యాణ్ ఎలా మంచివాడైపోయాడు, ఆయనపై ఎక్కడ లేని సానుభూతి ఎందుకు వచ్చింది? ఈ ప్రశ్నలకు పవన్ వారాహియాత్రకు జనంలో వస్తున్న స్పందనే కారణమంటున్నారు. నిన్న మొన్నటి వరకూ పవన్ వెంట కాపు సామాజికవర్గం కదలకుండా నిలువరించడానికి వైసీపీ నేతలు చేసిన ప్రయత్నం రివర్స్ కావడం, ఇక పార్టీ బయట నుంచి ముద్రగడ వంటి వారు సంధించిన లేఖాస్త్రాలు బూమరాంగ్ కావడంతో.. ఇక ఎదురెళ్లి లాభం లేదన్న నిర్ణయానికి వచ్చిన వైసీపీ అగ్రనేత వ్యూహం మార్చి తెగడ్తలకు ఫుల్ స్టాప్ పెట్టి పొగడ్తల మార్గం పట్టారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీలో ఇంత వరకూ పవన్ ను ఇష్టారీతిగా విమర్శించి, కొండొకచో దూషించిన పేర్ని నాని, అంబటి రాంబాబు వంటి కాపు నేతలు హఠాత్తుగా ప్లేట్ ఫిరాయించి పొగడ్తల వర్షం కురిపిస్తే జనం ఛీకొడతారన్న భయంతో గెస్ట్ ఆర్టిస్టులను జగన్ రంగంలోకి దింపారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే జగన్ కొత్త ఎత్తుగడ పని చేసే అవకాశాలు ఇసుమంతైనా కనిపించడం లేదు. ఎందుకంటే ఇంత కాలం పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత విమర్శలకు దిగి, ఆయనను ఆయన సొంత సామాజికవర్గానికి దూరం చేయాలన్న ఎత్తుగడ బూమరాంగ్ అయ్యి చివరికి కాపు సామాజికవర్గ ఓటర్లు వైసీపీకి దూరమయ్యే పరిస్థితులు ఏర్పడటంతో ప్లేట్ ఫిరాయించి పవన్ కు కితాబులిచ్చేస్తే.. అంతా సానుకూలం అయిపోతుందని వైసీపీ భావించడం అమాయకత్వమైనా కావాలి లేదా అతి విశ్వాసమైనా అయ్యుండాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.