సీన్ అర్థమైందా?
posted on Jun 27, 2023 @ 10:48AM
వరుసగా ముచ్చటగా మూడోసారి నెల్లూరు నగర ఎమ్మెల్యేగా గెలుపొందాలని ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆశ పడుతోన్నారు. అయితే ఆయన ఆశలపై జగనన్న చల్లని పెన్నా నది నీళ్లు చల్లారనే ఓ చర్చ నెల్లూరు నగరంలో ఊపందుకొంది.
జూన్ 21వ తేదీ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 18 మంది ఎమ్మెల్యేలు చాలా డల్‌గా ఉన్నారని.. కష్టపడాలని.. లేకుంటే వచ్చే ఎన్నికల్లో టికెట్లు రావనీ.. అలాగే టికెట్లు ఇచ్చేది కూడా తాను కాదంటూ పార్టీ అధినేత వైయస్ జగన్ ఈ సందర్బంగా క్లియర్ కట్‌గా పార్టీ ఎమ్మెల్యేలకు ఓ క్లారిటీ ఇచ్చేశారని.. అయితే ఈ సమావేశం జరిగిన 48గంటల్లోనే అనిల్ కుమార్ యాదవ్.. నెల్లూరులో పార్టీ శ్రేణులకు ఉద్దేశించి మాట్లాడారని... ఆ క్రమంలో ఆయన మాట్లాడిన మాటలను తరచి తరచి చూస్తే.. ఓ విధమైన మూడ్ ఆఫ్‌లో ఆయన ఉన్నారనే ఓ టాక్ వైరల్ అవుతోంది.
అంతేకాదు సీఎం జగన్ చెప్పిన 18 మంది డల్ ఎమ్మెల్యేల్లో అనిల్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారనే వార్త సైతం నెల్లూరు నియోజకవర్గంలో చల్ చల్ గుర్రం చలాకీ గుర్రం అన్నట్లుగా హల్‌చల్ చేస్తున్నాయి. ఈ విషయం తెలిసిన అనిల్.. తీవ్రంగా హర్ట్ అయి బుంగమూతి పెట్టుకొన్నారని తెలుస్తోంది. అదీకాక ఆయన సొంత బాబాయి, నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ స్థానికంగా వైసీపీ కోసం సొంత బిల్డింగ్ కట్టి దానికి జగనన్న భవనం అంటూ నామకరణం చేయడమే కాకుండా.. గతంలో అనిల్‌కి చేదోడు వాదోడుగా ఉన్న వారందరిని.. ఆయస్కాంతం ఆకర్షించినట్లు ఆకర్షించేయడం ద్వారా అబ్బాయికి గట్టిగానే హ్యాండ్ ఇచ్చేశారని... దీంతో నియోజకవర్గంలో అనిల్ ఒంటరిగా మిగిలిపోయారనే ఓ చర్చ వాడి వేడిగా సాగుతోంది.
మరోవైపు అనిల్ కుమార్ యాదవ్‌ను పక్కన పెట్టి.. ఆయన బాబాయి రూప్ కుమార్‌తో నెల్లూరు జిల్లాలో రాజకీయ చక్రం తిప్పించాలనే ఓ పదునైన వ్యూహంతో పార్టీ అధినేత, సీఎం జగన్ ఆలోచనతో ఉన్నట్లు.. ఆ క్రమంలో ప్రణాళిక బద్దంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు మంత్రిగా ఉన్న సమయంలో అనిల్ చాలా చాలా ఎక్స్ ట్రాలు చేశారని.. ఆ క్రమంలో అనిల్‌కు కట్టబెట్టిన భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా కాకుండా బూతుల నోటి పారుదల శాఖ మంత్రిగా ఇమేజ్ సంపాదించారని.. ఈ నేపథ్యంలో రూప్ కుమార్‌ను తెరపైకి తీసుకు వస్తున్నట్లు చర్చ సైతం నడుస్తోంది. అదీకాక జగన్ ప్రభుత్వంపై నెల్లూరు పెద్దారెడ్లు అసమ్మతి గళం వినిపిస్తుండడంతో.. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో గెలుపు అంత ఈజీ కాదనే విషయం వైయస్ జగన్‌కు పక్కాగా అర్థమైందని.. దీంతో అబ్బాయిని పక్కన పెట్టి బాబాయికి వచ్చే ఎన్నికల్లో నెల్లూరు నగర ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా.. ఆశ్చర్య పోనక్కర్లేదనే ఓ చర్చ సైతం కొనసాగుతోంది. ఇంకోవైపు అనిల్ ఒంటరి అయిపోయినట్లు.. ఇప్పటికే సర్వే నివేదికలు సీఎం జగన్ టేబుల్‌పైకి చేరినట్లు తెలుస్తోంది.
ఇక అనిల్ కుమార్ యాదవ్‌కి మంత్రి పదవి హుళక్కి అయిన తర్వాత.. చాలా చాలా కామ్ అయిపోయారని.. కానీ అనిల్ మంత్రిగా ఉన్న సమయంలో సహచర మంత్రులుగా ఉన్న నాని బ్రదర్స్‌కు పదవి లేకపోయినా.. బూస్ట్ తాగినట్లు నిత్యం యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా ఉంటారని ఈ నేపథ్యంలో ప్రస్తుత నెల్లూరు నగర ఎమ్మెల్యే వ్యవహారంలో సీఎం జగన్ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఓ చర్చ సైతం కొన.. సాగుతోంది.
అందుకే నెల్లూరులో మళ్లీ తన సత్తా చాటాలని అనిల్ కుమార్ యాదవ్ ప్రణాళికలు సిద్దం చేసుకొంటున్నారు. అందులోభాగంగా త్వరలో ఓ భారీ కళ్యాణ మండపంలో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని.. దీనికి తన హితులు, సన్నిహితులు, పరిచయస్తులను పిలవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరి అనిల్ ఆహ్వానాన్ని మన్నించి.. దూరమైన వారంతా మళ్లీ దగ్గరకు.. అంటే ఆత్మీయ సమావేశానికి వస్తారా? అంటే సందేహమే అనే చర్చ సైతం నడుస్తోంది.
ఇంకోవైపు గత ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలకు పది స్థానాలు గెలుచుకొన్న ఫ్యాన్ పార్టీకి నేడు ఆ పరిస్థితి లేకపోవడంతో ... సీఎం జగన్ చాలా పకడ్బందీగా వ్యూహా రచనకు శ్రీకారం చేసినట్లు ఓ టాక్ అయితే స్థానికంగా హల్‌చల్ చేస్తోంది.