ఎపీలో మూడు రోజులు మోస్తరు వర్షాలు

ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. వాయవ్య బంగాళాఖాతం, ఒడిశా తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది.. ఒడిశా సరిహద్దు తీర ప్రాంతాల్లో విస్తరించింది. ఇటు అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం విస్తరించింది. రుతుపవన ద్రోణి ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది. ఈ ప్రభావంతో రానున్న మూడు రోజులు మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.ఐఎండీ సూచనల ప్రకారం వాయువ్య బంగాళాఖాతంపై అల్పపీడనం కేంద్రీకృతమైందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా బీఆర్ అంబేద్కర్ తెలిపారు. ఇది రానున్న 48 గంటల్లో ఒడిశా మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందన్నారు. ఈ ప్రభావంతో మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. నేడు మన్యం, అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగిలినచోట్ల జల్లులు పడే అవకాశం ఉన్నట్లు వివరించారు. రాష్ట్రంలో 3 రోజులు ముసురు వాతావరణం ఉంటుందని తెలిపారు.  

ప్రారంభమైన యాదాద్రి ఎంఎంటీఎస్ పనులు

హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైన ఎంఎంటీఎస్ సేవలను దక్షిణ మధ్య రైల్వే మరింత విస్తరిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ శివారు ప్రాంతాలకు కూడా ఎంఎంటీఎస్‌ను విస్తరించగా.. ఓఆర్ఆర్ చుట్టూ కూడా ఎంఎంటీఎస్ సేవల కోసం రైల్వే లైన్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇక తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ను విస్తరించేందుకు ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతుండగా.. ఇప్పుడు పనులు మొదలయ్యాయి.యాదాద్రికి ఎంఎంటీఎస్ సేవలను విస్తరించే ప్రాజెక్టు ఖర్చు మొత్తాన్ని రైల్వేశాఖ భరించనుంది. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ పనులు జరగనున్నాయి. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేనర్ అరుణ్ కుమార్ జైన్‌తో పాటు సికింద్రాబాద్ డీఆర్‌ఎం ఏకే గుప్తా తాజాగా యాదాద్రి రైల్వే స్టేషన్‌ను పరిశీలించారు. ఎంఎంటీఎస్ ట్రైన్ల కోసం ప్రత్యేక రైల్వే ట్రాక్ నిర్మించనున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న యాదాద్రి రైల్వే స్టేషన్‌కు ఎదురుగా గుట్టవైపు మరో రైల్వే స్టేషన్ నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన స్థలాన్ని అధికారులు పరిశీలించారు.కొత్త రైల్వే స్టేషన్ ముఖద్వారాన్ని యాదాద్రి ఆలయ నమూనా తరహాలో నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. యాదాద్రి వరకు ఇప్పటికే రెండు రైల్వే ట్రాక్‌లు ఉన్నాయి. కానీ ఎంఎంటీఎస్ ట్రైన్ల కోసం ఘట్‌కేసర్ నుంచి యాదాద్రి వరకు ప్రత్యేక ట్రాక్ నిర్మించనున్నారు. యాదాద్రికి ఎంఎంటీఎస్ సేవలు అందుబాటులోకి వస్తే చాలా తక్కువ ఖర్చుతో భక్తులు ప్రయాణించవచ్చు. యాదాద్రికి భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు యాదాద్రికి వెళుతుంటారు. ప్రస్తుతం బస్సుల ద్వారానే ఎక్కువమంది ప్రయాణం చేస్తున్నారు. ఎంఎంటీఎస్ అందుబాటులోకి వస్తే తక్కువ ఖర్చుతో సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు.

మాజీ మంత్రి చిలకూరి రాంచంద్రారెడ్డి ఇక లేరు

ఆదిలాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి చిలకూరి రాంచంద్రారెడ్డి (82) గురువారం సాయంత్రం కన్నుమూశారు. అనారోగ్యంతో అస్వస్థతకు గురైన ఆయన్ను ఇటీవల హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రిలో చేర్పించారు. రాంచంద్రారెడ్డికి వైద్య పరీక్షలు చేసిన వైద్యులు కిడ్నీ సంబంధిత ఇన్ఫెక్షన్‌తో బాధ పడుతున్నారని గుర్తించారు. ఈ నేపథ్యంలోనే శస్త్ర చికిత్సలు చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన హఠాన్మరణం చెందినట్లు వైద్యులు తెలిపారు. రాంచంద్రారెడ్డి స్వస్థలమైన ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. రాంచంద్రారెడ్డి నాలుగు సార్లు ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా సేవలందించారు. రాంచంద్రారెడ్డి మరణం పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్‌ శాంతికుమారిని ఆదేశించారు. అలాగే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ మాణిక్‌రావ్‌ ఠాక్రే, ఏఐసీసీ, టీపీసీసీ నేతలు పలువురు, ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యే జోగు రామన్న తదితరులు సంతాపాన్ని ప్రకటించారు. రాంచంద్రారెడ్డి మరణం కాంగ్రెస్‌ పార్టీకి తీరని లోటని రేవంత్‌ అన్నారు.

కడెం ప్రాజెక్ట్ లో పెద్ద ఎత్తున ఇన్ ఫ్లో

తెలంగాణ రాష్ట్రం   నిర్మల్ జిల్లాలో  కడెం నది ఉప్పొంగుతోంది. గోదావరి నదీ జలాలు వచ్చి చేరే కడెం ప్రాజెక్ట్ గత నాలుగు  రోజులుగా కురుస్తున్న   భారీ వర్షాల కారణంగా   పెద్ద ఎత్తున ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. దాదాపు కడెం ప్రాజెక్టులోకి లక్షా 70 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 12 వరద గేట్లు ఎత్తి వేసి లక్షా 30 వేల క్యూసెక్కులు ఔట్ ఫ్లో ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో 6 వరద గేట్లు మొరాయిస్తున్న పరిస్థితి. ప్రాజెక్టు పూర్తిస్తాయి నీటి మట్టం 700 అడుగులుగా నమోదు అయ్యింది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో లక్షా 70వేల క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో లక్షా 30వేల క్యూసెక్కులుగా కొనసాగుతోంది. అయితే ప్రాజెక్టు సరైన మరమ్మత్తులు చేయకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సంవత్సరం ప్రాజెక్ట్‌ ప్రమాదానికి గురైనప్పటికీ మరమత్తులు చేయడంలో ప్రభుత్వం, అధికారులు విఫలమయ్యారని ఆవేదన చెందుతున్నారు. కడెం ప్రాజెక్ట్‌లోకి ఇన్ ఫ్లో ఇలాగే కొనసాగితే గత సంవత్సరంలాగే ప్రాజెక్టు ప్రమాదభరితంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో అని స్థానిక ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి నెలకొంది.కడెం ప్రాజెక్ట్  నది నీటి మట్టానికి 31 మీటర్ల ఎత్తులో ఉంది. 174 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. క్యాచ్ మెంట్ ఏరియా 2,590 చదరపు కిలోమీటర్లు ఉంది.

కడపలో వైసీపీకి షాక్ తప్పదా?

ఎన్నికలకు సమయం దగ్గర పడేకొద్దీ అధికార పార్టీ వైసీపీకి ఎదురుగాలి ఎక్కువ అవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు తోడు.. ప్రజలలో వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యేలు వైసీపీకి దూరమవుతున్న వాతావరణం కనిపిస్తుంది. గతంలో క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలు, కంచుకోట లాంటి నియోజకవర్గాలు కొన్ని ఇప్పటికే వైసీపీకి దూరమయ్యాయి. అవి కాకుండా మరి కొన్ని నియోజకవర్గాలలో ఇప్పటికే కొంత మంది ఎమ్మెల్యేలు అధిష్టానంతో ఆంటీ ముట్టనట్లు ఉండగా.. మరికొందరు ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయోనని ముందే  ఓ అడుగు ముందుకేస్తున్నారు. ఈ జాబితాలో వైసీపీకి కంచుకోట ఉమ్మడి కడప జిల్లాలోని స్థానం కూడా ఉండడమే విశేషం. అదే రాజంపేట.  రాజంపేట రాజకీయాలను అంచనా వేయడం అంత ఈజీ కాదు. రాజంపేట లోక్‌సభ నియోజకవర్గంతో పాటు.. దాని  పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలను గత ఎన్నికలలో వైసీపీ క్లీన్‌స్వీప్‌ చేసింది. ఇప్పుడు మరోసారి అదే టార్గెట్‌గా అడుగులు వేస్తోంది. అయితే, నేతలలో మాత్రం మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. గత నాలుగేళ్ళలో ఉమ్మడి కడప జిల్లాలో  మసకబారిన వైఎస్ కుటుంబ ప్రతిష్ట, సొంత జిల్లాను సైతం సీఎం జగన్ పట్టించుకోకపోవడం లాంటి కారణాలు ఈసారి వైసీపీని దెబ్బకొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. అందుకే నేతలు ముందే మెల్లగా పార్టీకి దూరమవుతున్నారు. అందుకు తగ్గట్లే టీడీపీ కూడా వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ పావులు కదుపుతుంది. ఇక్కడ అసంతృప్తిలో ఉన్న ఎమ్మెల్యే సోదరుడిని పార్టీలో చేర్చుకుంది.  ప్రస్తుతం రాజంపేట అసెంబ్లీ స్థానం నుండి మేడా వెంకట మల్లికార్జునరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. వ్యాపార రంగం నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినా మల్లిఖార్జున రెడ్డి.. 2012 ఉప ఎన్నికల్లో రాజంపేటలో కాంగ్రెస్‌ తరపున పోటీచేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆకేపాటి అమరనాథరెడ్డి చేతిలో ఓడారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఆయన 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. టీడీపీ ఆయనకు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినా చీఫ్‌ విప్‌‌ పదవి ఇచ్చి ప్రోత్సహించింది. అయితే, 2019 ఎన్నికలకు ముందు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీకి వెళ్లారు. అక్కడ మళ్ళీ గెలిచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. రాబోయే ఎన్నికలలో ముచ్చటగా మూడవసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని మల్లిఖార్జున రెడ్డి ఆలోచన చేస్తున్నారు. కానీ, ఈ నాలుగేళ్ళలో మేడా మల్లిఖార్జున రెడ్డిపై రాజంపేటలో అసంతృప్తి అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. ఒకదశలో రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డికి వ్యతిరేకంగా నియోజకవర్గంలో పోస్టర్లు వెలిశాయి. 'మా నమ్మకం నువ్వే జగనన్నా.. కానీ రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి మీద మాకు నమ్మకం లేదు' అంటూ పోస్టర్లు అంటించారు. ‘ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డీ.. మీ మీద మాకు నమ్మకం లేదు.. ఇట్లు మోసపోయిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు’ అంటూ పోస్టర్లు దర్శనమిచ్చాయి. ఈ క్రమంలో ఆయనకు ఈసారి జగన్ టికెట్ ఇస్తారా ఇవ్వరా అనే అనుమానాలున్నాయి. అందుకు తగ్గట్లే మల్లిఖార్జునరెడ్డి కూడా పెద్దగా ఫోకస్ లోకి రావడం కూడా లేదు. అయితే, గత రెండేళ్లుగా మల్లిఖార్జున రెడ్డి తమ్ముడు విజయశేఖరరెడ్డి టీడీపీలో చేరనున్నారని స్థానికంగా ప్రచారం జరుగుతున్నది.  గత రెండుసార్లు అన్న విజయంలో తమ్ముడు కీలకపాత్ర పోషించారు. అయితే, 2019 ఎన్నికల అనంతరం అన్నదమ్ముల మధ్య సఖ్యత కొరవడిందని చెప్పుకుంటున్నారు. ప్రజలలో పెరిగిన అసంతృప్తి, మరోవైపు అన్నతో సఖ్యత లేకపోవడంతో గత ఏడాదినే విజయశేఖరరెడ్డి టీడీపీలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు  ముహూర్తం కుదిరింది. చంద్రబాబును కలిసిన విజయశేఖర్ రెడ్డి తనకు టీడీపీపై ఆసక్తి ఉందని.. అవకాశం ఇస్తే రాజంపేట నుంచి పోటీ చేస్తానని తన మనసులో మాటను బయటపెట్టారు. రాజంపేటకు తీవ్ర అన్యాయం జరిగిందని.. ఇందులో తన సోదరుడు మల్లికార్జునరెడ్డి పాత్ర కూడా ఉందని విజయశేఖరరెడ్డి ఆరోపించారు. ప్రధానంగా జిల్లాల విభజన సమయంలో రాజంపేటకు తీవ్ర అన్యాయం జరిగిందన్న విజయశేఖరరెడ్డి రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేయాలనే డిమాండ్ ను కూడా బయటపెట్టారు. విజయశేఖరరెడ్డిని సాదరంగా ఆహ్వానించిన చంద్రబాబు కలిసి పనిచేసి టీడీపీని గెలిపిద్దామని అన్నారు.

స్పీడ్ న్యూస్ 3

నీట మునిగిన అండర్ పాస్  31. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ లింగంపల్లి రైల్వే అండర్‌పాస్‌ కిందకు భారీగా  నీరు చేరింది.  మోకాళ్ల లోతు వరకు నీరు చేరుకోవడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. వర్షం పడితే వరదనీటితో లింగంపల్లి అండర్‌పాస్‌ రోడ్డు ముంపునకు గురికావడం పరిపాటి అయ్యింది. ......................................................................................................................................................... జగన్ పై చెక్ బౌన్స్ కేసు 32. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై చెక్‌బౌన్స్‌ కేసు పెడతామని తెదేపా నేత బీటెక్‌ రవి అన్నారు. బటన్ నొక్కి డబ్బులు జమచేశామని స్వయంగా సీఎం చెప్పినా ఇప్పటి వరకూ సగం మంది మహిళల ఖాతాలలో అమ్మ ఒడి డబ్బులు జమ కాలేదని ఆయన ఆరోపించారు. ............................................................................................................................................................... వర్షాలపై సీఎస్ శాంత కుమారి సమీక్ష 33. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీవర్షాల నేపథ్యంలో  సచివాలయంలో ఉన్నతాధికారులతో సీఎస్‌ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. ఎటువంటి పరిస్థితి ఎదురైనా తట్టుకునేందుకు సర్వ సన్నద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. విపత్తు దళాలను అప్రమత్తం చేయాలన్నారు. ....................................................................................................................................................... కాళేశ్వరం వద్ద పెరిగిన ప్రవాహం 34.  భారీ వర్షాల కారణంగా కాళేశ్వరం వద్ద   ప్రవాహం  పెరుగుతోంది. 33 అడుగులు మేర నీటిమట్టం నమోదైంది. అన్నారం సరస్వతి బ్యారేజి 15 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరులో  గోదావరి నది ప్రవాహ ఉధృతి పెరిగింది. ............................................................................................................................................................... రాయగఢ్ లో మట్లిపెళ్లలు విరిగిపడి 15 మంది మృతి 35. భారీ వర్షాల కారణంగా మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌ జిల్లాలో మట్టిపెళ్లలు విరిగిపడి కనీసం 15 మంది మరణించారు.   ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే ధృవీకరించారు.  పలువురు గల్లంతైనట్లు చెబుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ...................................................................................................................................................... మణిపూర్ హింసాకాండపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం 36.మణిపుర్‌లో హింసాత్మక ఘటనలపై లోక్‌సభలో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. సభా కార్యకలాపాలు వాయిదా వేసి మణిపుర్ ఘటనలపై చర్చించాలని వాయిదా తీర్మానంలో బీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ......................................................................................................................................................... గండిపోచమ్మ ఆలయం వద్దకు వరద నీరు 37. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం  గండి పోచమ్మ అమ్మవారి ఆలయం వద్ద గోదావరి  నది ఉగ్రరూపం దాల్చింది.  గండి పోచమ్మ అమ్మవారి ఆలయం గోపురం వరకూ వరద వరద నీరు చేరడంతో  అధికారులు పాపికొండల విహారయాత్రను నిలిపివేశారు. ............................................................................................................................................................ పోలవరం వద్ద పెరిగిన గోదావరి నీటి మట్టం 38. పోలవరం వద్ద గోదావరి నీటిమట్టం  పెరుగుతోంది.  48 గేట్ల ద్వారా 3,15,791 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.  ..................................................................................................................................................... మహిళలపై లైంగిక వేధింపులు అనాగరికం 39. మణిపుర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనను తెలంగాణ మంత్రి  కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ లో చేశారు. జాతుల మధ్య ఘర్షణలతో మహిళలను లైంగిక వేధింపులకు గురిచేయడం అనాగరికమని పేర్కొన్నారు.   ............................................................................................................................................................... రాష్ట్రంలో ఓట్ల దొంగలు .40. రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ అన్నారు. ఏపీలో ఓటు దొంగలను చూస్తున్నామన్నారు.  విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 15నుంచి 19 వార్డులకు చెందిన  బూత్‌, యూనిట్‌, క్లస్టర్‌ ఇన్‌చార్జిలకు సమీకృత శిక్షణ కార్యక్రంలో ఆయన మాట్లాడారు. ............................................................................................................................................................. డబుల్ ఇళ్లపై అనవసర రాద్ధాంతం: తలసాని 41. డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంపై బీజేపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి తలసాని విమర్శించారు. కిషన్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడం, ఆయన రోడ్డుపై బైఠాయించడంపై స్పందించిన ఆయన  కిషన్ రెడ్డి కోరితే తానే స్వయంగా తీసుకెళ్లి డబుల్  ఇళ్లను చూపిస్తానన్నారు.   .......................................................................................................................................................... ఆలస్యంగా ప్రకటించినందుకు ప్రత్యేక ధన్యావాదాలు! 42. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు  రెండు రోజులు సెలవు ప్రకటించడం వివాదాస్పదమైంది.   తమ పిల్లలను స్కూల్స్, కాలేజీలకు పంపించిన తర్వాత సెలవు ప్రకటించడంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు   ప్రత్యేక ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.  .................................................................................................................................................... నడ్డాతో పవన్ భేటీ 43. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో  జనసేనాని పవన్ కల్యాణ్‌ నేడు భేటీ అయ్యారు. వీరి మధ్య భేటీ దాదాపు గంటసేపు జరిగింది. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ........................................................................................................................................................ నో క్యాస్ట్ ఆప్షన్ మస్ట్ 44.   విద్య సహా అన్ని దరఖాస్తుల్లో ‘నో క్యాస్ట్‌’, ‘నో రిలీజియన్‌’ అనే కాలమ్‌ను  తప్పని సరి అని తెలంగాణ హైకోర్టు పేర్కొంది.  కులాన్ని, మతాన్ని వదులుకునే హక్కు అందరికీ ఉంటుందని, ఆ స్వేచ్ఛను అడ్డుకోవడం సరికాదని ఒక పిటీషన్ విచారించిన కోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.  ............................................................................................................................................................. ట్రాఫిక్ డీసీలేం చేస్తున్నారు: డింపుల్ హాయత్ 45. గత రెండు రోజులుగా వర్షాల కారణంగా నగరంలో ట్రాపిక్ జామ్ లు జరుగుతుంటే ట్రాఫిక్ డీసీపీలు ఎక్కడ ఉన్నారంటూ నటి హాయతి ట్వీట్ చేసింది. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే, నటి డింపుల్ హయతి మధ్య గతంలో జరిగిన వివాదం నేపథ్యంలో ఈ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. ......................................................................................................................................................... ఆర్ఆర్ఆర్ పై విశాఖ ఎంపీ దూషణలు 46. పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో వైసీపీ ఎంపీ  ఎంవీవీ  ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజుపై  తన కుటుంబ సభ్యుల కిడ్నాప్‌ వ్యవహారంపై స్పీకర్‌, హోం మంత్రిత్వ శాఖకు రఘురామ లేఖ రాయడంపై ఎంవీవీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసభ్య పదజాలంతో దూషించారు. ......................................................................................................................................................... బీజేపీ నేతల అరెస్టు పై లక్ష్మణ్ మండిపాటు 47. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సహా  బీజేపీ ముఖ్య నాయకులను అరెస్ట్ పై ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు.  డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించడం యుద్ధం అనుకుంటున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. .......................................................................................................................................................... సోనియాకు మోడీ పలకరింపు 48. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజు  ఆమె కూర్చున్న చోటుకు వెళ్లి, ఆమె ఆరోగ్యం, క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు.   ......................................................................................................................................................... ఆన్ లైన్ క్రీడలపై నిషేధ చట్టం హక్కు రాష్ట్రాలకు లేదు! 49. ఆన్‌లైన్‌ క్రీడలను నిషేధిస్తూ చట్టం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని  కేంద్రం మద్రాసు హైకోర్టుకు తెలిపింది.  రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్‌లైన్‌ క్రీడల నిషేధ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మద్రాసు హైకోర్టులో దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కేంద్రం ఈ విషయం తెలిపింది. ............................................................................................................................................................... అజిత్ పవార్ తో ఉద్ధవ్ ఠాక్రే భేటీ 50.ఎన్సీపీ తిరుగుబాట వర్గం నేత అజిత్‌ పవార్‌తో మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే బుధవారం భేటీ అయ్యారు. బెంగళూరు వేదికగా మంగళవారం జరిగిన విపక్షాల సమావేశంలో పాల్గొన్న ఉద్ధవ్‌ ఠాక్రే.. ఆ మరుసటి రోజే అజిత్‌ పవార్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

సీఎం జగన్ ఇంటి ముందు ధర్నాకు సిద్ధమంటున్న పేర్ని నానీ!

మాజీ మంత్రి, మ‌చిలీప‌ట్నం వైసీపీ ఎమ్మెల్యే, కాపు నాయ‌కుడు పేర్ని నాని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పేర్ని నానీ వ్యాఖ్యలు అప్పుడప్పుడూ సంచలనం అవుతుండడం కద్దు.  ఇప్పుడు ఆయన   సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేసేందుకు కూడా తాను సిద్ధమేనని చేసిన వ్యాఖ్యలు  సంచలనంగా మారాయి. సీఎం జ‌గ‌న్ ఇంటి ముందు ధ‌ర్నా చేస్తాం అని ప్రకటించిన పేర్ని నానీ..   కావాలంటే ఏలూరు జిల్లా ప‌రిష‌త్ స‌భ్యుల‌తో పాటు ఈ జిల్లాలోని ఎమ్మెల్యేల‌తో క‌లిసి వెళ్లి మ‌రీ త‌మ త‌డాఖా ఏంటో చూపిస్తామ‌ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా పేర్ని నాని వ్యాఖ్య‌లు క‌ల‌కలం రేపాయి. నిన్నటి వరకూ జగన్ మంత్రి వర్గంలో ఉన్న పేర్ని ఒక్కసారిగా ఇలా సీఎం ఇంటి ముందు ధర్నా కూర్చుంటానని ప్రకటించడంతో సొంత పార్టీలో కూడా అటెన్షన్ మొదలైంది. అసలు పేర్ని నానీ వ్యాఖ్యల వెనక కారణం చూస్తే విస్తుపోవడం ఖాయం. బుధ‌వారం ఏలూరు జిల్లా ప‌రిష‌త్ స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి జెడ్పీటీసీలు స‌హా ప్రొటోకాల్ ప్ర‌కారం.. జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు కూడా వ‌చ్చారు. ఈ క్ర‌మంలో ఏలూరు జిల్లా ప‌రిధిలో ఉన్న నూజివీడు, మ‌చిలీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గాల ఎమ్మెల్యేలు పేర్ని నాని, మేకా వెంక‌ట ప్ర‌తాప్ అప్పారావు త‌దిత‌రులు కూడా హాజ‌ర‌య్యారు. మ‌ధ్యాహ్నం 4 గంట‌ల వ‌ర‌కు స‌మావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎలాంటి తీర్మానాలు చేయలేదు.. ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. కారణం ఎక్స్ అఫిషియో స‌భ్యుడైన ఏలూరు జిల్లా క‌లెక్ట‌ర్ స‌హా ఉన్న‌తాధికారులు అందరూ ఈ సమావేశానికి డుమ్మా కొట్టేశారు. వారి స‌మ‌క్షంలోనే ఆయా స‌మ‌స్య‌ల‌పై ఒక నిర్ణ‌యానికి రావాల్సి ఉండగా.. వారు మాత్రం ఈ స‌మావేశాల‌కు రాలేదు. దీంతో ఒక్క‌సారిగా జెడ్పీ స‌భ్యులు అంద‌రూ పేర్ని నానిపై ఒత్తిడి తేవడంతో నాని రెచ్చిపోయారు. కలెక్టర్ సహా ఉన్నతాధికారులు ఎవరూ సమావేశానికి హాజరు కాకపోవడంతో  నానీ.. క‌లెక్ట‌ర్‌కు అసలు మేం ఎలా క‌నిపిస్తున్నాం. ఎమ్మెల్యేలు అనుకుంటున్నారా.. లేక మీ కింద నౌకర్లు అనుకుంటున్నారా? ఆయ‌న కోసం మేం వేచి ఉండాలా.. మాకు మాత్రం ప‌నులు ఉండవా.. మేము రాలేదా అని ఆగ్రహంతో ఊగిపోయారు. అంతేకాదు క‌లెక్ట‌ర్‌పై సీఎం జ‌గ‌న్‌కు ఫిర్యాదు చేస్తాం.. జిల్లా ప‌రిష‌త్ స‌భ్యులు, జిల్లాలోని ఎమ్మెల్యేల‌తో క‌లిసివెళ్లి తాడేప‌ల్లి వ‌ద్ద ధ‌ర్నాకు దిగుతాం. ఈ విష‌యాన్ని క‌లెక్ట‌ర్ దృష్టిలో ఉంచుకుంటే మంచిదని వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఏలూరు జిల్లాలో కలెక్టర్, ఉన్నతాధికారులు.. వైసీపీ ఎమ్మెల్యేల మధ్య ఉన్న అంతర్యుద్ధం బయటపడింది. కలెక్టర్ సహా ఉన్నతాధికారులు అంతా పనిగట్టుకొని సమావేశానికి డుమ్మా కొట్టారంటే ఇక్కడ రాజకీయం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. నిజానికి ఈ సమస్య ఈ రోజుది కాదు.. ఈ సమావేశానిది మాత్రమే కాదు. వ‌రుస‌గా రెండు స‌మావేశాల‌కు  క‌లెక్ట‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ డుమ్మా కొట్టారు.  కలెక్టర్ రారని తెలిసి ఉన్నతాధికారులు కూడా ఎవరూ సమావేశాలకు రావడం లేదు. గతంలో వైసీపీ నేతలు, ఈ అధికారుల మధ్య పలుమార్లు జరిగిన వాగ్వాదాలే దీనికి కారణంగా తెలుస్తున్నది. వైసీపీ నేతలు తరచుగా అధికారుల పనికి అడ్డు తగలడం.. నానీ మంత్రిగా ఉన్నప్పుడు తెచ్చిన ఒత్తిళ్ల కారణంగానే అధికారులు ఇప్పుడు ఇలా మొహం చాటేస్తున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతున్నది. కాగా, ఒక మాజీ మంత్రి ఇలాకాలోనే , ఎమ్మెల్యేలు హాజరయ్యే సమావేశానికి అధికారులు మొహం చాటేస్తున్నారంటే రాష్ట్రంలో పాలన డొల్లతనం బయటపడుతున్నది. ఒక మాజీ మంత్రి, సొంత పార్టీ అధికారంలో ఉండగానే అధికారులు మాట వినడం లేదని సీఎం ఇంటి ముందు ధర్నాకు దిగుతా అని ప్రకటించారంటే ప్రభుత్వ తీరు ఎంద సుందరముదనష్టంగా ఉందో ఇట్టే అవగతమౌతుంది.

మైనార్టీలకు లక్ష ఆర్థిక సహాయం: హరీష్ రావ్ 

తెలంగాణ సర్కారు మరో సంక్షేమ ప్రకటన చేసింది. రాష్ట్రంలోని మైనార్టీలకు ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్టు మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో నిర్వహించిన మైనార్టీ ఛైర్మన్ల అభినంద‌న స‌భ‌లో పాల్గొన్న హ‌రీశ్‌రావు మైనార్టీలకు ఈ శుభవార్త వినిపించారు. బ్యాంకుల‌తో సంబంధం లేకుండా ఈ ఆర్థిక సాయం అంద‌జేస్తామ‌ని మంత్రి స్పష్టం చేశారు. మైనార్టీల‌కు ఆర్థిక సాయంపై ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చార‌ని స్పష్టం చేశారు. మైనార్టీల‌కు ఆర్థిక సాయం అందించే కార్యక్రమంపై రెండు లేదా మూడు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు మంత్రి హ‌రీశ్‌ రావు పేర్కొన్నారు. అయితే... తెలంగాణ సర్కార్ ఇప్పటికే రాష్ట్రంలో వెనుబడిన కులవృత్తులు, చేతివృత్తుల వారికి లక్ష రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా.. తొలివిడత చెక్కులు కూడా పంపిణీ చేసింది ప్రభుత్వం. ఈ పథకం కోసం సుమారు 50 లక్షలకు పైగా బీసీలు అప్లై చేసుకోగా.. అర్హులైన ప్రతీ ఒక్కరికి సాయం అందించనున్నట్టు సర్కారు ప్రకటించింది. క్షేత్రస్థాయిలో పరిశీలించి.. అర్హుల జాబితాను సిద్ధం చేస్తున్న నేపథ్యంలో.. ప్రతీ నెల 15వ తారీఖున ఎంపికైన వారికి చెక్కులు అందించనుంది ప్రభుత్వం. ఇదిలా ఉండగానే.. మైనార్టీలకు కూడా లక్ష సాయం అందిస్తామని.. రెండు మూడు రోజుల్లోనే ఉత్తర్వులు కూడా వస్తాయని మంత్రి హరీశ్ రావు ప్రకటించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ప్రభుత్వం చర్య తీసుకోకుంటే మేమే తీసుకుంటాం: సుప్రీంకోర్టు 

మణిపూర్‌లో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి, అనంతరం వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా, ఈ ఘటనను సర్వోన్నత న్యాయస్థానం సుమోటాగా స్వీకరించింది. ఇది తమను తీవ్రంగా కలిచివేసిందని, ఇటువంటి చర్యలు ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే.. తామే తీసుకుంటామని హెచ్చరించింది. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరంగా జులై 28లోగా నివేదిక అందజేయాలని కేంద్రం, మణిపూర్ ప్రభుత్వాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ఆదేశించింది.  ‘నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలపై చాలా బాధపడ్డాం..తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నాం.. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది... ఇది ఆమోదయోగ్యం కాదు.. ప్రభుత్వం చర్య తీసుకోకపోతే, మేం తీసుకుంటాం.. అటువంటి హింసకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను కోర్టుకు తప్పక తెలియజేయాలని మేము భావిస్తున్నాం.. మీడియాలో చిత్రీకరించిన, కనిపించిన విజువల్స్ స్థూలంగా రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘన కిందకే వస్తాయి’ అని సీజేఐ చంద్రచూడ్ ఘాటుగా హెచ్చరించారు.

స్పీడ్ న్యూస్ 2

తిరుమలలో భక్తుల రద్దీ 11.తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం శ్రీవారిని 74 వేల 24 మందిదర్శించుకున్నారు. 32 వేల 688 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నేడు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 20 గంటలకు పైగా సమయం పడుతోంది. ....................................................................................................................................................... నిలిచిన వాట్సాప్ సేవలు 12.  ప్రపంచ వ్యాప్తంగా నిన్న అర్ధరాత్రి దాదాపు అరగంట సేపు వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి.  ఆ తర్వాత కంపెనీ సేవలను పునరుద్ధరించింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో వాట్సాప్ సేవలకు అంతరాయం కలిగింది. ................................................................................................................................................... టమాటాలతో వెడుతున్న లారీ బోల్తా 13. టమాటాలతో వెళ్తున్న లారీ ఉమ్మడి వరంగల్ జిల్లా  ఆత్మకూరు శివారులోని జాతీయ రహదారిపై  బోల్తా  పడింది. జనం టమాటాలను ఎత్తుకెళ్లకుండా ఆ ప్రమాదంలో గాయపడిన డ్రైవర్  టమాటా కిలో 150కి పైగా ఉండటంతో డ్రైవర్ గాయాలను సైతం లెక్క చేయకుండా కాపలాగా నిలబడ్డాడు. ....................................................................................................................................................... ఈటల, అరుణ గృహ నిర్బంధం 14.  హైదరాబాద్ శివార్లలోని బాటసింగారంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలనకు  బీజేపీ నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో  ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణల ను హైదరాబాద్ లో పోలీసులు గృహ నిర్బంధం చేశారు.  ................................................................................................................................................ అవసరమైతే తప్ప బయటకు రావద్దు 15. హైదరాబాద్ నగరంలో  ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ  మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ ప్రజలకు సూచించారు. జీహెచ్ఎంసీ జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు.  ......................................................................................................................................... పని చేయని వాలంటీర్లు మాకొద్దు: ధర్మాన 16. శ్రీకాకుళంలో జగనన్న సురక్షా పథకం కార్యక్రమానికి గైర్హాజరైన వాలంటీర్లపై మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పని చేయని వాలంటీర్లు మాకు అవసరం లేదన్న ఆయన వారిని తక్షణమే తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ............................................................................................................................................. విద్యా సంస్థలకు రెండు రోజులు సెలవు 17. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ప్రభుత్వం రెండు రోజులు సెలవు ప్రకటించింది. నేడు రేపు రాష్ట్రంలోని విద్యాసంస్థలకు సెలవలు ఇచ్చినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.    ......................................................................................................................................................... తెలంగాణలో భారీ వర్షాలు 18. తెలంగాణ రాష్ట్రంలో  నేడూ, రేపూ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.  బుధవారం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.  చెట్లు విరిగిపడటంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు నిలిచిపోయింది. ............................................................................................................................................................... మహిళలపై అమానవీయ ఘటన రాజ్యాంగ ఉల్లంఘనే: సుప్రీం 19. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై  ఏం చర్యలు తీసుకున్నారని కేంద్రం, మణిపుర్‌ ప్రభుత్వాన్ని సుప్రీం ప్రశ్నించింది. మహిళలపై అమానవీయ ఘటన రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని  సుప్రీం  చేసింది.  ................................................................................................................................................... సిగ్గుపడాల్సిన విషయం: మోడీ 20.మణిపుర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనను మెడీ  సిగ్గుపడాల్సిన విషయంగా ఆయన పేర్కొన్నారు. అమానవీయ ఘటనలకు ఎవరూ పాల్పడినా ఉపేక్షించబోమని మోడీ తేల్చి చెప్పారు. మహిళల భద్రత విషయంలో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించబోమని హెచ్చరించారు. ................................................................................................................................................. విపక్షాల కూటమికి ఇండియా పేరా: విజయశాంతి 21. విపక్షాల కూటమికి ఇండియా పేరు పెట్టడాన్ని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఖండించారు. ఈ మేరకు ఆమె ఓ ట్వీట్ లో  ఓటములు ఎక్కువై విపక్షాల తెలివి ప్రమాదం అంచులు దాటిందని పేర్కొన్నారు. ఆ కూటమి ఓడితే ఇండియా ఓటమి అనాలా అని ప్రశ్నించారు.  ..................................................................................................................................................... జగన్ స్వర్ణాంధ్రను అప్పుల ఆంధ్రప్రదేశ్ చేశారు: పురందేశ్వరి 22.   జగన్ పాలనపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి నిప్పులు చెరిగారు. నవ్యాంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం హయాంలో  చేసిన అప్పు రూ.2,65,365 కోట్లు అయితే జగన్ నాలుగేళ్ల పాలనలో చేసిన అప్పు రూ.7,14,631 కోట్లని చెప్పారు. జగన్ స్వర్ణాంధ్రను అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చారన్నారు. ........................................................................................................................................................ భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి  23. భద్రాచలం వద్ద  గోదావరి వరద ఉదృతి వేగంగా పెరుగుతోంది. అప్రమత్తమైన  యంత్రాంగం కలెక్టరేట్ తో పాటు కొత్తగూడెం, భద్రాచలం ఆర్డిఓ ,చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు.  .......................................................................................................................................................... ఉస్మానియా పరిధిలో పరీక్షలు వాయిదా 24. హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో  గురు, శుక్ర వారాల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ  ప్రకటించింది.   ............................................................................................................................................ రోడ్డుపై బైఠాయించిన కిషన్ రెడ్డి 25.   ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  విమానాశ్రయం నుంచే  డబుల్ బెడ్ రూం ఇళ్ల పరిశీలనకు బాటసింగారానికి బయల్దేరారు.  అయితే ఆయన వాహనాన్ని పోలీసులు అడ్డుకోవడంతో భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రోడ్డుపై బైఠాయించారు. ............................................................................................................................................ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం 26. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభయ్యాయి. నేటి నుంచి ఆగస్టు 11 వరకు జరిగే ఈ సమావేశాల్లో  ప్రభుత్వం.. యూనిఫాం సివిల్ కోడ్, ఢిల్లీ ఆర్డినెన్స్‌ సహా 31 బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మణిపూర్‌లో హింస, ఢిల్లీ ఆర్డినెన్స్‌ సహా పలు అంశాలను  విపక్షాలు గట్టిగా వ్యతిరేకిస్తాయి. ............................................................................................................................................................... వినియోగదారులకు నెట్ ఫ్లిక్స్ షాక్ 27. ప్రముఖ స్ట్రీమింగ్ మీడియా కంపెనీ నెట్ ఫ్లిక్స్ వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చింది. ఈ రోజు నుంచి  నెట్ వర్క్ పాస్‌వర్డ్‌ను షేర్ చేసుకునే వెసులుబాటును తొలగించింది. పాస్ వర్డ్ షేరింగ్ వల్ల సంస్థ ఆదాయానికి గండి పడుతోందన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది.   ....................................................................................................................................... మణిపూర్ హింసాకండపై మౌనంగా ఉండం : రాహుల్ 28. మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాండపై  ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ అంటే ఇండియా మౌనంగా ఉండదని రాహుల్ గాంధీ అన్నారు. ఆ మేరకు ఆయన ఓ ట్వీట్ లో   ప్రధాని మోడీ నిష్క్రియాపరత్వమే మణిపూర్ ను అరాచకత్వం వైపు నెట్టిందని పేర్కొన్నారు. .................................................................................................................................... మిజోరంలో కంపించిన భూమి 29. మిజోరంలో  ఈ తెల్లవారు జామున భూమి కంపించింది రిక్టర్ స్కేలుపై ఈ  భూకంప తీవ్రత 3.6గా నమోదైంది. భూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు.  .......................................................................................................................................... 30. అహ్మదాబాద్‌లోని ఇస్కాన్ వంతెనపై ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది దుర్మరణం పాలయ్యారు. వంతెనపై జరిగిన స్వల్ప ప్రమాదం వద్ద ప్రజలు గుమికూడి ఉండగా వేగంగా వచ్చిన కారు జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.  

ప్రయోగాల పుట్ట టీడీపీ.. ఆర్టిఫిషియల్‌ యాంకర్‌తో యువగళంలో ప్రయోగం!

కాగల కార్యం గంధర్వులు తీర్చారు అన్నది పాత సామెత. ఇప్పుడు ఏ కార్యాన్నయినా కృత్రిమ మేధతో సంపూర్ణంగా నిర్వర్తించవచ్చు. భగవంతుడి సృష్టిలో మనిషి గొప్పవాడు అయితే, మానవ సృష్టిలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) మహోన్నతమైనదిగా చెప్పుకోవచ్చు. ప్రపంచం అభివృద్దివైపు దూసుకెళ్తోంది.. టెక్నాలజీ అంతకు మించిన వేగంతో అభివృద్ధి చెందుతోంది. ఈ రోజు మనిషి చేసే దాదాపు అన్ని పనులూ యంత్రాలు చేయగలుగుతున్నాయి, చేయగలిగేలా మనిషే వాటిని తయారు చేస్తున్నారు. మనిషి చేయగల ఏ పనినైనా మిషన్స్ మరో 20 సంవత్సరాల్లోచేస్తాయని 1965లోనే సైంటిస్ట్, నోబెల్ గ్రహీత హెర్బర్ట్ సైమన్ చెప్పారు. ఇప్పుడు కళ్లారా చూస్తున్నాం. మనిషి మనుగడ ఇప్పటికే సౌకర్యవంతం కాగా ఏఐతో ఇది మరింత సులభతరం అవుతుంది. ఇంకా చెప్పాలంటే సృష్టికి ప్రతిసృష్టి చేసిన విశ్వామిత్రుడిలా.. కృత్రిమ మేధా సంపత్తి మానవుడికి సవాలు విసురుతున్నది.  కాగా, తెలుగుదేశం పార్టీ అంటేనే ప్రయోగాల  పుట్టగా పేరుంది. చంద్రబాబు ఆధ్వర్యంలో నడిచే ఈ పార్టీ కార్యక్రమాలలో   టెక్నాలజీని అందిపుచ్చుకొని ముందుకు వెళ్తుంటుంది. హైదరాబాద్ లో సైబరాబాద్ నిర్మాణానికి పునాది వేసిన ఘనుడు  చంద్రబాబేనని తెలంగాణ ఈనాటి పాలకులు కూడా తడుముకోకుండా చెప్తున్న సంగతి తెలిసిందే.  పార్టీ విషయానికి వస్తే 90ల్లోనే పార్టీ సభ్యులు, కార్యకర్తల వివరాలను కంపుటరైజేషన్ చేసిన చరిత్ర టీడీపీది. దేశ రాజకీయ చరిత్రలో అదే ప్రథమం. ఇలా టెక్నాలజీ అందిపుచ్చుకోవడంలో చంద్రబాబు, టీడీపీ ఎప్పుడూ  ముందుంటుందని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇండియా ఈ రోజు గురించి ఆలోచిస్తే.. చంద్రబాబు రేపటి గురించి ఆలోచిస్తారని ఆ పార్టీ కార్యకర్తలు తమ నాయకుడి గొప్పతనం గురించి చెప్పుకుంటుంటారు. అలాగే ప్రయోగం చేస్తే పోయేదేముంది సక్సెస్ అయితే అదే చరిత్ర అంటూ టీడీపీ మరో ప్రయోగం చేపట్టింది.  యాంకర్ లేకుండానే యాంకర్ తో యువగళం వార్తలు చదివించారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌ సాయంతో యువగళంలో వార్తలు చదివే యాంకర్‌ను రూపొందించారు. ఏఐ టెక్నాలజీ ద్వారా కృత్రిమ యాంకర్ తో వార్తలు చదివేలా టీడీపీ సాఫ్ట్ వేర్  డిజైన్ చేసింది. ఆ యాంకర్ కు వైభవి అని పేరు కూడా పెట్టారు. ఈ ప్రయోగం ద్వారా యాంకర్.. లోకేశ్ చేపట్టిన యువగళం షెడ్యూల్ ను వివరించింది. ప్రకాశం జిల్లా కనిగిరిలో 159వ రోజు జరిగే కార్యక్రమాలను కృత్రిమ యాంకర్ వైభవి వార్తలా చదివింది.  కనిగిరిలో పాదయాత్ర షెడ్యూల్‌ వివరాల్ని వైభవి అందరికి తెలియజేశారు. ఈ వీడియో దాదాపు 1.40 నిమిషాలు పాటు ఉండగా ఈ వీడియోలో పాదయాత్ర సాగే గ్రామాలు, కార్యక్రమాల వివరాలు ఉన్నాయి. ఇక నుంచి యువగళం అప్డేట్స్ ఇచ్చేలా కృత్రిమ యాంకర్ వైభవిని సిద్ధం చేసి ప్రయోగించారు.  టీడీపీ రాబోయే రోజుల్లో ఈ ఏఐ టెక్నాలజీ ద్వారా పార్టీ కార్యక్రమాలపై ప్రచారం సాగించే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. మేనిఫెస్టో సహా పార్టీ కార్యక్రమాలు, అప్డేట్స్ ప్రజల్లోకి ఇలాగే పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయ పార్టీల చరిత్రలో తొలి ఎఐ యాంకర్ కాన్సెప్ట్ తమదేనని టీడీపీ అంటోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టెక్నాలజీ విషయంలో ఎప్పుడూ ముందంజలో ఉండే టీడీపీ దీంతో ఏఐ టెక్నాలజీలో కూడా ఓ అడుగు ముందుకేసినట్లయింది. కాగా, ఆర్టిఫీషియల్ యాంకర్ స్పష్టంగా తెలుగు చదవడంతో నెటిజన్లు ఈ వీడియోపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పుడున్న న్యూస్ యాంకర్స్ కొందరు తెలుగును చంపేస్తుంటే ఆర్టిఫీషియల్ యాంకర్ వైభవి స్పష్టంగా వార్తలు ప్రజెంట్ చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇందులో మరికాస్త డెవలప్మెంట్ కావాల్సి ఉండగా ముందుముందు ఆ లోటుపాట్లు కూడా లేకుండా చేస్తామని టీడీపీ టెక్ విభాగం చెప్తుంది.

నోక్యాస్ట్ నో రిలీజియన్ కాలమ్ చేర్చాలి: తెలంగాణ హైకోర్టు

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యకు సంబంధించిన వాటితోపాటు ఇతర అన్ని దరఖాస్తుల్లో ‘నో క్యాస్ట్‌’, ‘నో రిలీజియన్‌’ అనే కాలమ్‌ను తప్పకుండా చేర్చాలని ఆదేశించింది. కులాన్ని, మతాన్ని వదులుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, ఆ స్వేచ్ఛను అడ్డుకోవడం సరికాదని స్పష్టం చేసింది.  తమ కుమారుడికి నో క్యాస్ట్‌.. నో రిలీజియన్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలని 2019లో సండెపు స్వరూప అనే వ్యక్తి పలుమార్లు అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో  స్వరూపతో పాటు మరొకరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ కన్నెగంటి లలిత విచారణ జరిపారు.  ‘‘పిటిషనర్‌ అభ్యర్థనను తిరస్కరించడం రాజ్యాంగంలోని లౌకిక స్ఫూర్తికి విరుద్ధం. ఆర్టికల్‌ 14, 19, 21, 25ను ఉల్లంఘించడమే. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25 కింద మత స్వేచ్ఛతో పాటు ఇలాంటి కొన్ని హక్కులు పౌరులకు ఉన్నాయి. ఏ మతాన్ని, కులాన్ని ఆచరించకూడదని ఎంచుకునే హక్కు పౌరులకు ఉంటుంది” అని కోర్టు స్పష్టం చేసింది. నో క్యాస్ట్‌, నో రిలీజియన్‌ అనే కాలమ్‌ను ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌ సహా అన్ని దరఖాస్తుల్లోనూ చేర్చాలని సూచించింది. ఈ మేరకు మున్సిపల్‌ కమిషనర్లకు, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, ఇతర ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేస్తున్నామని తీర్పులో పేర్కొంది.

స్పీడ్ న్యూస్ 1

యువతను మోసం చేసిన జగన్ 1. తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర బుధవారం కనిగిరి  నియోజకవర్గంలో సాగింది. ఆయన పాదయాత్ర బుధవారం 2100 కీలోమీటర్ల మైలు రాయి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతను జగన్ మోసం చేశారని విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాకా ఏటా జాబ్ క్యలెండర్ విడుదల చేస్తామన్నారు.  ........................................................................................................................................................ ఆసియాకప్ షెడ్యూల్ విడుదల 2. ఆసియా కప్ 2023 షెడ్యూల్‌ను   బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధిపతి జై షా బుధవారం ప్రకటించారు. ఈ టోర్నీలో భాగంగా  భారత్-పాకిస్థాన్ పోరు సెప్టెంబర్ 2న శ్రీలంకలోని క్యాండీలో జరగనుంది.  ఆరు దేశాలు పాల్గొనే ఈ టోర్నీ ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 17 వరకు జరగనుంది. ..................................................................................................................................................... కేసీఆర్ రాజకీయ జీవితానికి ముగింపు 3.ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజకీయంగా రోజులు దగ్గరపడ్డాయని బీజేపీ ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అన్నారు.   జాతీయస్థాయిలో కేసీఆర్ ఏ కూటమిలో ఉన్నారో చెప్పాలని నిలదీశారు. తెలంగాణను పరిపాలించే సత్తా లేకే కేసీఆర్ జాతీయ రాజకీయాంటున్నారని ధ్వజమెత్తారు. ఘోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను ఈటల కలిశారు.  ....................................................................................................................................................... ఈటలకు బీజేపీ హైకమాండ్ మందలింపు 4.బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ను ఆ పార్టీ అధిష్ఠానం మందలించింది. పార్టీ నుంచి సస్పెండ్ అయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తో ఈటల నిన్న భేటీ అయ్యారు. ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేయాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరుతానని ఈటల చెప్పారు. అయితే రాజాసింగ్ ను   కలవడాన్ని తప్పుపట్టిన అధిష్ఠానం ఈటలను మందలించినట్లు సమాచారం. .................................................................................................................................................. అమిత్ షాతో పవన్ భేటీ 5. ఎన్డీయే సమావేశం కోసం ఢిల్లీకి వెళ్లిన జనసేనాని పవన్ కల్యాణ్  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో నిన్న భేటీ అయ్యారు.  వీరి మధ్య వివిధ అంశాలపై దాదాపు పావుగంట చర్చ జరిగింది. అనంతరం పవన్ కల్యాణ్ ఒక ట్వీట్ లో అమిత్ షాతో తన చర్చలు చర్చలు  ఏపీ  ప్రజలకు నిర్మాణాత్మక, నిర్ణయాత్మక సుసంపన్నమైన భవిష్యత్తుకు నాంది పలుకుతాయన్నారు. ..................................................................................................................................... బీఆర్ఎస్ కు గద్వాల జడ్పీ చైర్ పర్సన్ రాజీనామా 6. బీఆర్ఎస్ కి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా  గద్వాల జెడ్పీ చైర్‌పర్సన్ సరిత  రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను అధిష్ఠానానికి ఫ్యాక్స్ ద్వారా పంపారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఆమె ఈ రోజు   ఢిల్లీలో ఏఐసీసీ పెద్దల సమక్షంలో హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. .................................................................................................................................... విమానంలో ఆక్సిజన్ మాస్క్ 7. విమానంలో ఆక్సిజన్ మాస్క్ తో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ ఫొటో నెట్టింట వైరల్ అయ్యింది. ఈ ఫొటోను రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మొన్న సాయంత్రం సోనియా, రాహుల్ ప్రయాణీస్తున్న విమానం భోపాల్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో  ఆక్సిజన్ తగ్గి, ఒత్తిడి పెరగడంతో సోనియా ఆక్సిజన్ మాస్క్ ధరించారు.  ................................................................................................................................. గ్రీన్ చానెల్ ద్వారా కిమ్స్ కు ఊపిరితిత్తులు 8. విజయవాడ నుండి ఇండిగో విమానంలో హైదరాబాద్ కు ఊపిరితిత్తుల ను తరలించారు.  వాటిని విమానాశ్రయం నుంచి   సికింద్రాబాద్ నుండి కీమ్స్ ఆస్పత్రికి తరలించేందుకు ట్రాఫిక్ ఏసీపి ఆధ్వర్యంలో గ్రీన్ చానెల్ ఏర్పాటు చేసి ఎటువంటి అంతరాయం లేకుండా చూశారు.  ......................................................................................................................................................... 9. వైసీసీ నుంచి బహిష్కృతురాలైన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. త్వరలో ఆమె గుంటూరులో జనసేన  అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ కు పాల్పడ్డారంటూ వైసీపీ ఉండవల్లి శ్రీదేవిని పార్టీ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. .............................................................................................................................................. గుజరాత్ లో నడిరోడ్డుపై మొసలి 10.భారీ  వర్షాలకు సముద్రాలు, నదుల్లో ఉండాల్సిన మొసళ్లు జన  జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి.   గుజరాత్ లోని గిర్ జిల్లాలో ఒక  పెద్ద మొసలి ఇండ్ల మధ్యలోకి రావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అటవీ అధికారులు ఆ మొసలిని బంధించి సురక్షిత ప్రాంతంలో వదిలేశారు.

జల కళ సంతరించుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు

 విరామం  లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టుకు  జలకళ సంతరించుకుంది. కాళేశ్వరం ప్రధాన పుష్కరఘాట్ వద్ద 9.770 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తోంది. మేడిగడ్డ బ్యారేజీకి ఇన్ ఫ్లో, 4,38,880 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 4,85,030 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. అలాగే బ్యారేజీ పూర్తి సామర్థ్యం16.17 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి మట్టం 7.646 టీఎంసీలుగా ఉంది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో బ్యారేజీలోని 57 గేట్లను అధికారులు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కుండపోతగా వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా భూపాలపల్లి సింగరేణి డివిజన్‌లోని కాకతీయ ఖని సెక్టార్-2, 3 ఓపెన్ కాస్ట్ గనుల్లో 7 వేల టన్నుల బోగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దాదాపు 1.63 లక్ష్యల కుబిక్ మీటర్ల మట్టి వెలుకితీతకు అంతరాయం ఏర్పడింది. దీని కారణంగా సుమారుగా ఒక కోటిన్నర నష్టం వాటిల్లినట్టు సింగరేణి అధికారులు అంచనా వేస్తున్నారు. అటు వర్షాల కారణంగా జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపైకి వర్షపు నీరు వచ్చిచేరడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.

బాట సింగారం చేరుకున్న కిషన్ రెడ్డి

బీజేపీ చలో బాటసింగారం నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ బీజేపీ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేసుకున్నారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి, బిజెపి రా ష్ట్ర అధ్య క్షుడు  కిషన్‌రెడ్డి  ఈరోజు ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ విమానశ్రయం నుంచి నేరుగా ఎమ్మెల్యే రఘునందనరావుతో కలసి కిషన్‌రెడ్డి బాట సింగారంకు బయలుదేరారు. బాట సింగారంలో డబుల్ బెడ్రూం ఇళ్ళను బీజేపీ అధ్యక్షుడు పరిశీలించనున్నారు. అయితే అనుమతి లేనందున బీజేపీ నేతలెవరూ బాట సింగారం రావొద్దని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే బీజేపీ నేతలు డీకే అరుణ, ఎంపీ ధర్మపురి అర్వింద్, ఈటల సహా.. బీజేపీ కార్పోరేటర్లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

మణిపూర్ హింసపై మౌనమెందుకు

మణిపూర్ లోని పరిస్థితిపై ప్రధాని మోడీ మౌనం వహిస్తుండడాన్ని సహించబోమని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. తమ కూటమి ‘ఇండియా’ దీనిపై పార్లమెంటులో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తుందన్నారు.  గుర్తు తెలియని సాయుధ దుండగులు  తౌబల్ జిల్లాలోని నాంగ్ పోక్ సెక్మాయ్ పోలీసు స్టేషన్ పరిధిలో ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడి వారిని హతమార్చిన ఘటనకు సంబంధించి కేసు నమోదు చేశామని పోలీసులు పేర్కొన్న విషయాన్ని రాహుల్ ప్రస్తావించారు. ఇలాంటి అరాచకాలపై మోడీ నోరు మెదపడంలేదని, మణిపూర్ దాడులపై ఈ ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుందని ఆయన ప్రశ్నించారు. ఆ రాష్ట్ర ప్రజలకు తాము అండగా నిలుస్తామని, అక్కడ శాంతి నెలకొనడం ఒక్కటే మార్గమని ఆయన ట్వీట్ చేశారు

జగనానందయ్య శిష్య పరమాణువు వాసిరెడ్డి పద్మ

ఆంధ్రప్రదేశ్‌లో   జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత ఆయన తొలి, మలి కేబినెట్‌లోని మంత్రి పుంగవులు.. మంత్రులుగా హుందాగా తమ తమ శాఖల వారీగా.. శాఖ పరంగా ఉన్నతాధికారులతో సమీక్షలు, సమావేశాలు నిర్వహించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఒకరు ఇద్దరు మంత్రులు అదీ కూడా మచ్చుకు ఒకటో రెండో  సమావేశాలు సమీక్షలు నిర్వహించడం తప్పితే శాఖ మీద పట్టు సాధించడం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్ణయాలు తీసుకోవడం వంటి చర్యలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. అయితే  మంత్రులలో అత్యధికులు మాత్రం   ప్రెస్‌మీట్ లు పెట్టి  ప్రతిపక్ష పార్టీలపై, నాయకులపై  బండ బూతులతో విరుచుకు పడిపోవడం, తద్వారా అధినేత జగన్ మొప్పు పొందడం అన్న అంశానికే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారన్న విమర్శలు  వెల్లువెత్తుతున్న సంగతి విదితమే. ఇప్పుడు ఆ విషయంలో వాసిరెడ్డి పద్మ ఒక అడుగు ముందుకు వేశారని నెటిజన్లు ఓ రేంజ్ లో ఆమె పై సెటైర్లు వేస్తున్నారు. మహిళా కమిషన్ చైర్మన్ గా ఆమె పదవిని ముఖ్యమంత్రి జగన్ ఊడబీకి చాలా కాలం అయినా ఆ విషయం కూడా తెలియకుండా  ఇంకా ఆ పదవిలోనే కొనసాగుతున్నానన్న భ్రమతో  వాసిరెడ్డి పద్మ ఇస్తున్న కలరింగ్ సూపర్బ్ గా ఉందని ఎద్దేవా చేస్తున్నారు.   ఈ ఏడాది మేలో  ముఖ్యమంత్రి జగన్ ఓ రహస్య  జీవో తో  వాసిరెడ్డి పద్మ ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ పదవికి ఎసరు పెట్టారనీ, అయితే ఆ విషయం ఆమెకు తెలియదో.. లేక తెలిసినా అది రహస్య జీవో కనుక మరెవరికీ తెలియదన్న ధీమాయో కానీ వాసిరెడ్డి  పద్మ మాత్రం  ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్‌ హోదాలో  రౌండే టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం,   వాలంటీర్లపై వ్యాఖ్యలు చేసిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు నోటీసులు  జారీ చేయడం వంటి చర్యలతో నవ్వుల పాలౌతున్నారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.   అయినా పదవి ఉందో.. ఊడిందో కూడా తెలుసుకోకుండా ఇలా నోటీసులు, జీవోలు, రౌండ్ టేబుల్ సమావేశాలంటూ హడావుడి చేయడం.. ఇంకోవైపు వరుస పెట్టి నోటీసులు జారీ చేయడం ఏమిటని నిలదీస్తున్నారు. అయినా ముఖ్యమంత్రి జగనన్న పదవి పీకేసిన సంగతి  ఇంతకీ వాసిరెడ్డి పద్మకు తెలుసా? లేదా? అనే సందేహాలు సైతం పోలిటికల్ సర్కిల్‌లో వ్యక్తమవుతోన్నట్లు సమాచారం.  వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన  మూడు నెలలకు వాసిరెడ్డి పద్మను ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్ పదవిలో నియమించారు. ఈ పదవిలో ఆమె ఐదేళ్ల పాటు కొనసాగనున్నారని అందుకు సంబంధించిన జీవోని  సైతం ఈ ప్రభుత్వం విడుదల చేసింది.  దీంతో అసలు  లెక్క ప్రకారం 2024 వరకు ఆమె ఆ పదవిలో కొనసాగాల్సి ఉంది.  అయితే జగన్ సర్కారు   సైలెంట్‌గా గుట్టు చప్పుడు కాకుండా  ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ అధ్యక్షురాలి పదవీ కాలాన్ని రెండేళ్లు కుదిస్తూ ఈ ఏడాది ఏప్రిల్‌ 24న గెజిట్‌ ప్రచురించింది. దీని ప్రకారం రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ యాక్ట్ -2023 మే 2023 నుంచి అమల్లోకి వచ్చినట్లుగా జీవోఎంఎస్ నెంబర్ 23 జారీ  చేసింది. ఈ ఏడాది మే 9వ తేదీన ఈ జీవో జారీ అయినట్లు తెలుస్తుంది. మే 15వ తేదీ నుంచి  ఇది  అమల్లోకి వస్తుందని క్లియర్ కట్‌గా స్పష్టం చేసింది. దీంతో ఆ రోజుతో వాసిరెడ్డి పద్మ పదవి కాలం ముగిసిపోయినట్లు అయింది. అయినా ఆమె ఇవేమీ పట్టకుండా.. జగనన్న స్ట్టైల్‌లో దూసుకోపోవడం చూస్తుంటే.. గంతకు తగ్గ బొంత అనే వ్యాఖ్యలు   పోలిటికల్ సర్కిల్‌లో  వినవస్తున్నాయి. అయినా పదవి పోయిన తర్వాత.. కూడా  ఇంకా ఆ పదవిలోనే ఉన్నట్లు వాసిరెడ్డి పద్మ వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు అయితే వెల్లువెత్తుతోన్నాయి. అయినా వాసిరెడ్డి పద్మ భర్త వెస్లీకి ఎమ్మెల్యే సీటు ఇస్తే.. పార్టీలోకి వస్తానన్న ఒకే ఒక్క కండిషన్‌తో  అప్పట్లో ఆమె వైసీపీలోకి  ఎంట్రీ ఇచ్చారు. ఆ క్రమంలో 2014లోనే కాదు.. 2019 ఎన్నికల్లో కూడా ఆమె భర్తకు ఎమ్మెల్యే సీటు అయితే కేటాయించలేదన్న సంగతి అందరికీ తెలిసిందే. దానిని కాంపన్ సేట్ చేయడానికే జగన్ వాసిరెడ్డి పద్మకు ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారనీ, అయితే అది కూడా  కూడా మూడునాళ్ల ముచ్చటే అయిందని పరిశీలకులు చెబుతున్నారు.   ఏదీ ఏమైనా జగన్ ప్రభుత్వంలో జగనానందయ్య శిష్యులు లెక్కలు మిక్కిలి ఉన్నారని.. వారిలో వాసిరెడ్డి పద్మ అనే ఓ శిష్యు పరమాణువుగా చేరిపోయారనే ఓ వ్యంగ్య చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది.

లలూ ప్రసాద్ యాదవ్ కుమారుడికి తీవ్ర అస్వస్థత

బీహార్ మాజీ ముఖ్యమంత్రి లలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బీహార్ అటవీ , పర్యావరణ శాఖా మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. అతడిని పాట్నాలోని మెడివర్సల్ ఆసుపత్రికి తరలించారు. లాలూ యాదవ్‌ కుమారుడు తేజ్‌ ప్రతాప్‌కు ఛాతీ నొప్పి రావడంతో ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు సమాచారం.ఆరోగ్యం క్షీణించిన వెంటనే తేజ్ ప్రతాప్‌ను పాట్నాలోని మెడివర్సల్ ఆసుపత్రిలో చేర్చారు. ఇక్కడి వైద్యులు అతడిని పరీక్షిస్తున్నారు. తేజ్ ప్రతాప్ యాదవ్ బుధవారం సాయంత్రం తన నివాసంలో ఉన్న సమయంలో ఆయనకు ఛాతీ నొప్పి వచ్చింది. నొప్పి తీవ్రమవడంతో, అతన్ని సమీపంలోని కంకర్‌బాగ్‌లోని మెడివర్సల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం గురించి వైద్యులు ఎలాంటి ప్రకటన చేయలేదు. తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ త్వరగా కోలుకోవాలని పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు.