స్పీడ్ న్యూస్ 1
posted on Jul 25, 2023 @ 1:09PM
పోలవరం గేట్లన్నీ ఎత్తివేయండి!
1. పోలవరం గేట్లన్నీ తెరిచే ఉంచి వచ్చిన వరదను దిగువకు వదిలేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ ని తెలంగాణ కోరింది. గత ఏడాది పోలవరం బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలం ముంపునకు గురైందని పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వాటర్ ఇయర్లో గేట్లన్నీ తెరిచే ఉంచాలని కోరింది.
...............................................................................................................................................................
పట్టిసీమ ద్వారా నీటి విడుదల
2. గోదావరిపై పోలవరం మండలం పట్టిసీమ వద్ద నిర్మించిన ఎత్తిపోతల పథకం ద్వారా నాలుగేళ్ల తర్వాత నీటిని విడుదల చేశారు. కుడి కాలువలోకి ఆరు పంపుల ద్వారా 2,124 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 2019లో చివరిసారిగా 43.99 TMCల నీటిని కృష్ణా డెల్టాకు ఇచ్చారు.
...........................................................................................................................................................
ఏపీ విద్యుత్ ఉద్యోగుల సమ్మె సైరన్
3. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 10 నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్లు ఏపీ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ తెలిపింది. విద్యుత్ ఉద్యోగులు, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోవడం లేదని నేతలు ఆరోపించారు.
..........................................................................................................................................................
ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్
4. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నియమితులయ్యారు. జస్టిస్ ధీరజ్ సింగ్ ప్రస్తుతం ముంబై హైకోర్టు న్యాయమూర్తిగా పని చేస్తున్నారు. ఆయనకు పదోన్నతి కల్పిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
..............................................................................................................................................
డివైడర్ ను ఢీకొన్న అంబులెన్స్
5. హైదరాబాద్ లో ఈ తెల్లవారు ఇక అంబులెన్స్ రోడ్డు డివైడర్ ను ఢీకొంది. దీంతో అంబులెన్స్ లో ఉన్న ఆక్సిజన్ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. నగరంలోని వనస్థలిపురంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
........................................................................................................................................................
ఉమ్మడి వరంగల్ లో భారీ వర్షాలు
6. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేడు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్ జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు జనగామ, ములుగు, భూపాలపల్లి జిల్లాలలో నేడు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
.....................................................................................................................................................
అత్తాపూర్ లో పిడుగుపాటు
7. హైదరాబాద్ అత్తాపూర్ లోని ఓ నాలుగు అంతస్తుల భవనం సమీపంలో పిడుగు పడటంతో అపార్ట్‌మెంట్లలోని టీవీలు, ఫ్రిజ్‌లు కాలిపోయాయి. పిడుగు శబ్దానికి స్థానికులు తీవ్ర భయందోళనలకు లోనయ్యారు. అయితే, ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
...................................................................................................................................................
జల్ జీవన్ మిషన్ అమలులో ఏపీ వెరీ పూర్
8. జల్‌జీవన్ మిషన్ అమలులో ఆంధ్రప్రదేశ్ పనితీరు సరిగా లేదని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పేర్కొన్నారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు బదులిచ్చారు.
..............................................................................................................................................
పొలంలో యుద్ధ విమానం ఇంధన ట్యాంకు
9. పొలంలో యుద్ధ విమానం ఇంధన ట్యాంకు పడిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపింది. సంత్ కబీర్‌నగర్ జిల్లా బంజారియా బలుశాషన్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఈ సమాచారాన్ని జిల్లా ఎస్పీ, వాయుసేనకు తెలియజేశారు.
......................................................................................................................................................
29న అమిత్ షా తెలంగాణ రాక
10. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 29న హైదరాబాద్ రానున్నారు. పార్టీలోని వివిధ విభాగాల నేతలతో ఆయన సమావేశం కానున్నారు. సంస్థాగత అంశాలపై సమీక్షించనున్నారు. కిషన్ రెడ్డి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమిత్ షా రావడం ఇదే మొదటి సారి.