వనమా ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు.. బీఆర్ఎస్ కు షాక్
posted on Jul 25, 2023 @ 1:06PM
సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు బీఆర్ఎస్ కు గట్టి ఎదురుదెబ్బగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికలలో కొత్త గూడెం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన వనమా వెంకటేశ్వరరావు ఆ తరువాత బీఆర్ఎస్ గూటికి చేరిన సంగతి తెలిసిందే.
అప్పటి ఎన్నికలలో వనమా వెంకటేశ్వరరావు జలగం వెంకట్రావుపై నాలుగువేల పై చిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఆయనకు ప్రత్యర్థిగా బీఆర్ఎస్ అభ్యర్థిగా అప్పట్లో పోటీ చేసి ఓడిపోయిన జలగం వెంకట్రావు హై కోర్టును ఆశ్రయించారు. వనమా ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తుల వివరాలు తప్పుగా చూపారంటూ జలగం వెంకట్రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు మంగళవారం (జూలై 25) తీర్పు వెలువరించింది. వనమా వెంకటేశ్వర రావు ఎన్నిక చెల్లదని పేర్కొంటూ 2018 నుంచి జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించింది. ఇక, అఫిడవిట్లో తప్పుడు వివరాలు ఇచ్చినందుకు వనమా వెంకటేశ్వర రావుకు ఐదు లక్షల రూపాయలు జరిమానా విధించింది.
ఇదిలా ఉండగా తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వనమా సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఏది ఏమైనా తెలంగాణ హైకోర్టు తీర్పు వనమాకే కాకుండా బీఆర్ఎస్ కు కూడా గట్టి ఎదురుదెబ్బగానే చెబుతున్నారు.